Begin typing your search above and press return to search.

చైనాలో యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు?

చైనాలో ఒక సంఘటిత మార్పు అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ముఖ్యంగా యువతలో వచ్చిన ఈ మార్పు చైనాలో చర్చనీయాంశమైంది.

By:  A.N.Kumar   |   17 Dec 2025 3:00 PM IST
చైనాలో యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు?
X

చైనాలో ఒక సంఘటిత మార్పు అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ముఖ్యంగా యువతలో వచ్చిన ఈ మార్పు చైనాలో చర్చనీయాంశమైంది. చైనాలో చదువుకున్న యువతలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రైవేట్ రంగంలో ఉన్న అధిక జీతాలు.. వేగవంతమైన కెరీర్ వృద్ధి యువతను ఆకర్షించగా.. ఇప్పుడు అదే యువత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతోంది. దీనికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితులపై నెలకొన్ని అనిశ్చితి.

ఇటీవల జరిగిన జాతీయ సివిల్ సర్వీస్ పరీక్షకు రికార్డ్ స్థాయిలో 37 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో చైనాలోని అగ్ర విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన వారు కూడా ఉన్నారు. అయితే వచ్చే ఏడాది అందుబాటులో ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 38,100 మాత్రమే. అంటే వందమందిలో ఒకరికంటే తక్కువ మందికే అవకాశం దక్కనుంది. అయినప్పటికీ యువత ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు.

ప్రైవేట్ రంగంలో అవకాశాల కొరత

ఈ ప్రభుత్వ ఉద్యోగాల పట్ల పెరుగుతున్న ఆసక్తికి ప్రధాన కారణం ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడమే.. 16 నుంచి 24 ఏల్ల వయసున్న యువతలో పట్టణ నిరుద్యోగం జులై నుంచి 17 శాతం కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఇక అమెరికా వంటి దేశాలతో పోలిస్తే చాలా అధికం. వ్యాపార వాతావరణం బలహీనపడడం.. దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం వల్ల ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది.

ఐరన్ రైస్ బౌల్స్ కు మళ్లీ విలువ

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలను చైనాలో ‘ఐరెన్ రైస్ బౌల్స్’ అని పిలిచేశారు. అంటే స్థిరత్వం, నిర్ధిష్టమైన పనిగంటలు, భద్రత.. కానీ వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో యువత ఎక్కువ జీతాల కోసం అలీబాబా, టెన్సెంట్, హువావే వంటి టెక్ దిగ్గజాల వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ప్రైవేట్ ట్యూషన్ రంగాలపై బీజింగ్ ప్రభుత్వం తీసుకున్న కఠిన నియంత్రణ చర్యలు, ఆర్థిక వృద్ధి మందగమనం కలిసి భారీగా ఉద్యోగ నష్టాలకు దారితీశాయి. ఒక పరిశ్రమల సంఘం ప్రకారం.. గత ఏడాది చైనాలోని టాప్ 500 ప్రైవేట్ కంపెనీలు 3 లక్షల 14వేలకు పైగా ఉద్యోగాలను తగ్గించాయి.

భద్రతే ప్రాధాన్యం

ఈ పరిస్థితుల్లో యువత తమ ఆశలను తగ్గించుకొని ఉద్యోగ భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం కోరుకునే పట్టభద్రుల శాతం గణనీయంగా తగ్గింది. 2020లో 25.1 శాతంగా ఉన్న ఈ సంఖ్య గత ఏడాది 12.5 శాతానికి పడిపోయినట్లు సర్వేలు చెబుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రైవేట్ రంగంపై పెరుగుతున్న అసంతృప్తి అలాగే యువతలో పని వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కోరిక కూడా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తిని పెంచుతోంది.

ఉన్నత విద్యపై ఆసక్తి తగ్గుదల

ఇదే సమయంలో ఉన్నత విద్యపై కూడా ఆసక్తి తగ్గుతోంది. జాతీయ పీజీ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య అక్టోబర్ లో 34 లక్షలకు పడిపోయింది. 2023లో ఇది 47.4 లక్షలుగా ఉండేది అంటే ఉన్నత డిగ్రీలు చేసినా ఉద్యోగ భద్రత లభిస్తుందన్న నమ్మకం యువతలో తగ్గుతోందని ఇది సూచిస్తోంది.

మొత్తానికి చైనాలో యువత కెరీర్ ప్రాధాన్యాల్లో స్పష్టమైన మార్పు చోటు చేసుకుంది. గతంలో ఉన్న భారీ ఆశలు, వేగవంతమైన ఎదుగుదల కంటే ఇప్పుడు స్థిరత్వం, భద్రతే ముఖ్యం అన్న భావన బలపడుతోంది. ఆర్థిక అనిశ్చితి నడుమ, ప్రభుత్వ ఉద్యోగాలు మళ్లీ యువతకు అత్యంత ఆకర్షనీయమైన ఎంపికగా మారాయి.