'పెద్దాపురం' సీన్ మారుతోందా.. రాజకీయాలకు రాజప్ప రాంరాం...?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం అన్ని పార్టీలకూ కీలకం.
By: Garuda Media | 13 Aug 2026 1:03 PM ISTఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం అన్ని పార్టీలకూ కీలకం. కాపు సామాజిక వర్గం బలమై న ప్రభావం చూపుతుందన్న టాక్ ఉన్న ఈ నియోజకవర్గంలో వరుసగా.. టీడీపీ విజయం దక్కించుకుంటోంది. ని మ్మకాయల చిన్నరాజప్ప ఇక్కడ విజయం సాధిస్తున్నారు. 2014లో ఆయన విజయం సాధించి.. హోం శాఖ మంత్రి గా కూడా పనిచేశారు. 2019లో పార్టీ అధికారం కోల్పోయినా.. చిన్నరాజప్ప మాత్రం ఇక్కడ నుంచి గెలుపుగుర్రం ఎక్కారు. ఇక, గత 2024 ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.
మరి వచ్చే ఎన్నికల సంగతేంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వయోసంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నది టీడీపీలో టాక్. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఆయన తప్పుకొంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎవరికి టికెట్ ఇస్తుందన్నది చూడాలి. కానీ, ప్రస్తుతం ఈ నియజక వర్గంపై జనసేన నాయకులు కూడా కన్నేశారు. దీనిని తమకు ఇవ్వాలని అంతర్గత చర్చల్లో కోరుతున్నారు.
ముఖ్యంగా కాపులకు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం కావడంతో జనసేన నుంచి ఇద్దరు కీలక కాపు నాయకులు ఈ నియోజకవర్గంలో కర్చీఫ్‌లు వేసేశారని అంటున్నారు. అంతేకాదు.. తరచుగా ఇక్కడ జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో చిన్నరాజప్ప తప్పుకొంటే.. తమకు టికెట్ దక్కనుందన్న ఆశాభావం జనసేనలో కనిపిస్తోంది. అయితే.. ఇప్పటి వరకు రాజప్ప బహిరంగంగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించలేదు. అలాగని పార్టీపరంగా యాక్టివ్‌గా కూడా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గం వ్యవహారం జనసేనలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఓ నేత కూడా ఈ నియోజకవర్గంపై పరిస్థితిని ఆరా తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం మారడం ఖాయమని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో పెద్దాపురం అయితే ఎలా ఉంటుందన్న చర్చ చేస్తున్నారు. ఇక, వైసీపీ తరఫున మాజీ ఎంపీ.. తోట నరసింహం.. తన శక్తినంతా ధారపోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన సతీమణిని సభకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఇలా.. మూడు పార్టీల మధ్య పెద్దాపురం హాట్ టాపిక్‌గా మారింది.
