Begin typing your search above and press return to search.

భారత్ ఒక్క అడుగు.. చైనాకు డైజెస్ట్ కావట్లే.. అందుకే ఈ ఫిర్యాదు

భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), బ్యాటరీ ఉత్పత్తి రంగాల్లో అందిస్తున్న సబ్సిడీలు చైనాను కుదిపేశాయి.

By:  A.N.Kumar   |   17 Oct 2025 12:00 AM IST
భారత్ ఒక్క అడుగు.. చైనాకు డైజెస్ట్ కావట్లే.. అందుకే ఈ ఫిర్యాదు
X

భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), బ్యాటరీ ఉత్పత్తి రంగాల్లో అందిస్తున్న సబ్సిడీలు చైనాను కుదిపేశాయి. దేశీయ పరిశ్రమలకు అన్యాయంగా లాభం కలిగిస్తున్నాయంటూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద అధికారిక ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త ఉద్రిక్తతకు దారితీయనుంది.

చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించిన ప్రకారం.. భారత్ అమలు చేస్తున్న EV బ్యాటరీ సబ్సిడీలు తమ పరిశ్రమల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. అంతేకాదు.. ఈ సబ్సిడీలు WTO నియమాలకు విరుద్ధమని పేర్కొంటూ భారత విధానాలపై విచారణ కోరింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా అధిక సబ్సిడీలు అందిస్తోందని కూడా చైనా అసహనం వ్యక్తం చేసింది.

భారత్ ఇటీవల ప్రారంభించిన ‘నేషనల్ క్రిటికల్ మినరల్ స్టాక్ పైల్’ (NCMS) కార్యక్రమం ఈ ఫిర్యాదుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అరుదైన భూ మూలకాలు (రేర్ ఎర్త్ మినరల్స్) వంటి కీలక ఖనిజాల లభ్యతను పెంచి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడమే ఈ స్కీమ్ ఉద్దేశం. అయితే ఈ మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీల తయారీలో కీలకమైనవిగా ఉండటంతో చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో చైనా తన దేశం నుంచి ఈ మూలకాల ఎగుమతిపై ఆంక్షలు విధించడం కూడా గుర్తించదగిన అంశం.

చైనా ప్రకారం.. భారత్ మాత్రమే కాకుండా తుర్కియే, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలపైనా ఇలాంటి ఫిర్యాదులు WTO వద్ద నమోదు చేశారు. WTO నిబంధనల ప్రకారం, ఇలాంటి వివాదాలను ముందుగా చర్చల ద్వారానే పరిష్కరించడానికి ప్రయత్నించాలి. చర్చలు ఫలితం ఇవ్వకపోతేనే తీర్పునిచ్చే ప్యానెల్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.

ఈ పరిణామంపై స్పందించిన భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, చైనా సమర్పించిన వివరాలను త్వరలో పరిశీలిస్తామని తెలిపారు. “చర్చల ద్వారా పరిష్కారం సాధించే దిశగా భారత్ సిద్ధంగా ఉంది,” అని ఆయన అన్నారు.

వాణిజ్య సంబంధాల పరంగా చైనా భారత్‌కు రెండవ అతిపెద్ద భాగస్వామి. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో చైనాకు భారత ఎగుమతులు 14.5% తగ్గి 14.25 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో చైనాతో దిగుమతులు 11.52% పెరిగి 113.45 బిలియన్ డాలర్లకు చేరడంతో, వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ప్రస్తుతం భారత్‌లో EV రంగానికి వేగంగా పెరుగుతున్న మద్దతు, ‘మేడ్ ఇన్ ఇండియా’ విధానాలు చైనాకు తలనొప్పిగా మారాయి. ఈ ఫిర్యాదు అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్-చైనా పోటీకి కొత్త కోణం తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.