ఇంజనీరింగ్ అద్భుతం.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. వీడియో!
ఇంజినీరింగ్ అద్భుతాల విషయంలో చైనా మరో ఘనత సాధించింది. ఇందులో భాగంగా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనను ప్రారంభించింది.
By: Raja Ch | 29 Sept 2025 4:10 PM ISTఇంజినీరింగ్ అద్భుతాల విషయంలో చైనా మరో ఘనత సాధించింది. ఇందులో భాగంగా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనను ప్రారంభించింది. గుయ్ ఝౌ ప్రావిన్స్ లో బీపన్ నది లోయపై 625 మీటర్ల (2,051 అడుగులు) ఎత్తులో ఈ 'హువాజియాంగ్ గ్రాండ్ కన్యాన్' వంతెనను నిర్మించింది. ఇది ఓ ఇంజినీరింగ్ అద్భుతం!
అవును... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిను చైనా ప్రారంభించింది. దీని నిర్మాణాన్ని 2022లో ప్రారంభించగా.. కేవలం మూడేళ్లలోపే పూర్తి చేశారు. దీని నిర్మాణానికి 280 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2400 కోట్లు) ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. ఈ వంతెన పొడవు 2,890 మీటర్లు.
ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 22,000 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఇది మూడు ఈఫిల్ టవర్ల బరువుతో సమానం! ఈ వంతెన ప్రారంభంతో రెండు వైపులా మధ్య ప్రయాణ సమయం రెండు గంటల నుంచి రెండు నిమిషాలకు తగ్గిందని ప్రాంతీయ రవాణా విభాగం చీఫ్ జాంగ్ యిన్ తెలిపారు. ఆర్థిక, వాణిజ్య పురోగతికి ఇది ఊతమిస్తుందన్నారు.
ప్రస్తుతం ఈ వంతెన డ్రోన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రపంచంలో రెండు అతిపెద్ద వంతెన (డ్యూజ్ బ్రిడ్జ్) కూడా ఇదే ప్రావిన్స్ లో ఉంది. ప్రపంచంలోనే 100 అత్యంత ఎత్తయిన వంతెనల్లో దాదాపు సగం చైనాలోనే ఉన్నట్లు చెబుతున్నారు.
