Begin typing your search above and press return to search.

భూమ్మీద ఏ ప్రాంతాన్ని అయినా టార్గెట్ చేసే చైనా అణ్వస్త్ర క్షిపణి ఇదే

ఇప్పటివరకు బలమైన ప్రతిదేశం ఏదో ఒక సందర్భంలో తన ఆయుధ సంపత్తిని ప్రపంచానికి పరిచయం చేసిన వైనాల్ని చూస్తున్నాం.

By:  Garuda Media   |   4 Sept 2025 9:39 AM IST
భూమ్మీద ఏ ప్రాంతాన్ని అయినా టార్గెట్ చేసే చైనా అణ్వస్త్ర క్షిపణి ఇదే
X

ఇప్పటివరకు బలమైన ప్రతిదేశం ఏదో ఒక సందర్భంలో తన ఆయుధ సంపత్తిని ప్రపంచానికి పరిచయం చేసిన వైనాల్ని చూస్తున్నాం. అందుకు భిన్నంగా ప్రతి దేశం ఒక్కసారి ఉలిక్కి పడి చైనా వైపు చూసేలా తమ ఆయుధ సంపత్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. తాజాగా నిర్వహిస్తున్న విక్టరీ డేను పురస్కరించుకొని తమ అమ్ములపొదిలో ఉన్న ఆయుధ సంపత్తి వివరాల్ని వెల్లడించటం ద్వారా తమ సత్తా ఏమిటో అర్థమయ్యేలా చేయటమే కాదు.. తమతో ఎవరూ పెట్టుకోవటమే బెటర్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

రెండో ప్రపంచ యుద్దంలో జపాన్ సేనల్ని మట్టికరిపించటం ద్వారా తొలిసారి చైనా విదేశీ దురాక్రమణలన్ని విజయవంతంగా అడ్డుకుంది. అలా జరిగి 80 ఏళ్లు పూర్తవుతున్న వేళ భారీ పరేడ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు మీడియా కంటికి కూడా చిక్కని ఎన్నో అత్యాధునిక ఆయుధాల్ని పరిచయం చేయటం ద్వారా చైనా అంటేనే అందరికి గగుర్పాటుకు గురయ్యేలా చేశారు.

పరేడ్ లో ప్రదర్శించిన ఆయుధాల్లో పలు శక్తివంతమైన ఆయుధాల్ని కూడా ప్రదర్శించారు. అందులో అత్యంత కీలకమైనది డీఎఫ్ 5సీను. దీని టార్గెట్ ఎంతో తెలుసా? అక్షరాల 20వేల కిలోమీటర్లు.. అంటే ఈ భూమండలం మీద ఏ ప్రాంతాన్ని అయినా టార్గెట్ చేసే వీలు ఈ అణ్వస్త్ర క్షిపణికి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా శత్రువును శబ్దం కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకొచ్చే ఈ క్షిపణి టార్గెట్ ను ఛేదించగలదు. శత్రు దేశాలు స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందని చెబుతున్నారు. అంతేకాదు ఒకేసారి పది వేర్వేరు దిశల్లోని లక్ష్యాల్ని ఛేదించేలా దీన్ని రూపొందించారు. అంటే.. దీన్ని ప్రయోగించే వేళలో వేర్వేరు పది దిశల్లోని టార్గెట్ లను ఛేదించేలా పది వార్ హెడ్ లను ప్రయోగించే సత్తా దీని సొంతం.

ఈ పరేడ్ లో ప్రదర్శించిన మరిన్ని అత్యాధునిక ఆయుధాలు చూస్తే.. చైనా వార్ హుె శక్తివంతమైందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజా పరేడ్ లో అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణులు.. నూతన తరం ఆయుధాలు.. యుద్ధ ట్యాంకులు.. జలాంతర డ్రోన్లు.. ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు.. ఐదోతరం ఆయుధాల్ని ప్రదర్శించింది డ్రాగన్ దేశం. భారీ ఎత్తున సాగిన ఈ పరేడ్ ను తిలకించేందుకు లక్షలాది ప్రజలు హాజరు కావటం గమనార్హం.

చైనా ప్రదర్శించిన అత్యాధునిక ఆయుధాల్లో ముఖ్యమైనవి చూస్తే..

- శత్రువుల ఆయుధాల్ని.. ఆయుధ వ్యవస్థల్ని ముక్కలు ముక్కలుగా కోసేసే శ్వేతవర్ణ భారీ ఎల్ వై 1 లేజర్ ఆయుధం. పెద్ద హెచ్ జెడ్ 155రకం వాహనం నుంచి దీన్ని ప్రయోగిస్తారు. ఈ ఆయుధం సముద్రజలాలపై యుద్ధాన్ని సమూలంగా మార్చేస్తుందని చెబుతారు.

- గాల్లో నుంచి ప్రయోగించే చిన్నపాటి జేఎల్ 1 అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి

- అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఇతర వేరియంట్లు డీఎఫ్ 51, డీఎఫ్ 31.

- వైజే 17 యాంటీషిప్ మిస్సైల్.. డీఎఫ్ 61 క్షిపణి

- 5వేల కి.మీ. దూరాన్ని ఛేదించే డీఎఫ్ 26డీ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి

- యుద్ద విమానాలు జే 20, జే 20ఏ.. జే 20ఎష్.. జే 35ఏ

- శత్రువులకు తమ జాడ చిక్కకుండా రహస్యంగా ఎగిరి వచ్చే ఐదో తరం అన్ని వేరియంట్ల యుద్ధ విమానాల్ని ఈ పరేడ్ లో ప్రదర్శించారు. ఇలా తమకున్న అన్ని వేరియంట్లను ఒకే పరేడ్ లో ప్రదర్శించటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

- సీజే 1000 వాహనం నుంచి ప్రయోగించే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. నౌక నుంచి ప్రయోగించే క్రూయిజ్ మిస్సైల్.. గగనతలం నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు.

- నీటిలో నిఘా అవసరాల కోసం వాడే డ్రోన్లు.

- గగనతల రక్షణ వ్యవస్థ.. ఎలక్ట్ట్రానిక్ ఉపకరణాలైన హెచ్ క్యూ 20, హెచ్ క్యూ 22ఏ.. హెచ్ క్యూ 29. ఇందులో హైపర్ సోనిక్ గ్లౌడ్ క్షిపణిని సైతం అడ్డుకునే సత్తా హెచ్ క్యూ 19 సొంతంగా చెప్పాలి.

- టైప్ 100యుద్ధ ట్యాంకులు.. వీటి ప్రత్యేకత ఏమంటే.. తమను తాము కో ఆర్డినేట్ చేసుకుంటూ దాడులు చేయటం వీటి స్పెషల్.

- 12వేల కిలోమీటర్లు ప్రయాణించే డాంగ్ ఫెంగ్ 61 ఖండాంతర క్షిపణి.

- 60 అడుగుల పొడవైన సముద్ర డ్రోన్ ఏజేఎక్స్ 002.

- నౌకల్ని నీటిలో ముంచేసే క్షిపణలు.. లాంగ్ రేంజ్ బాంబర్ లు

- హెచ్ ఎస్ యూ 100 అండర్ వాటర్ డ్రోన్లు

- ఏఐతో దాడి చేసే డ్రోన్లు.. జీజే 11 స్టెల్త్ డ్రోన్లు