Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రాజ్ భవన్ స్కూల్లో టాయిలెట్లు.. మీ ఊహకే అందని టెక్నాలజీ!

హైదరాబాద్ లోని గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ లో ప్రభుత్వం నిర్వహించే ఇస్కూల్ ఒకటి ఉంది. మిగిలిన సర్కారీ స్కూళ్లకు భిన్నంగా ఈ స్కూల్ నిర్వహణ సాగుతూ ఉంటుంది.

By:  Garuda Media   |   13 Nov 2025 9:45 AM IST
హైదరాబాద్ రాజ్ భవన్ స్కూల్లో టాయిలెట్లు.. మీ ఊహకే అందని టెక్నాలజీ!
X

హైదరాబాద్ లోని గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ లో ప్రభుత్వం నిర్వహించే ఇస్కూల్ ఒకటి ఉంది. మిగిలిన సర్కారీ స్కూళ్లకు భిన్నంగా ఈ స్కూల్ నిర్వహణ సాగుతూ ఉంటుంది. ఏకంగా గవర్నర్ అడ్డాలో నిర్వహించే ఈ స్కూల్లో పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్కూల్లో ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లు.. ఇందుకోసం వినియోగించిన సాంకేతికత చూస్తే.. వావ్ అనుకోకుండా ఉండలేరు. ఊహకు అందనంత అడ్వాన్స్ టెక్నాలజీతో దీన్ని ఏర్పాటు చేశారు.

అన్నింటికి మించిన ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇందులో ఒకసారి పది వేల లీటర్ల నీటికి నింపిన తర్వాత.. మళ్లీ ఏడాది వరకు నీళ్ల అవసరం లేకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. అంటే.. నీటిని ఆదా చేయటమే కాదు.. ఇందులో వినియోగించే నీళ్లు ఎప్పటికప్పుడు రీసైకిల్ అయ్యే ఏర్పాటు ఇందులో ఉంది. చైనా నుంచి తీసుకొచ్చిన సాంకేతికతతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ అత్యాధునిక బయో టాయిలెట్లను ఆడ్మినిస్ట్రేవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సింఫుల్ గా చెప్పాలంటే ఆస్కీ సంస్థ వీటిని అందజేసింది.

ఇంతకూ ఇదెలా పని చేస్తుందన్న విషయంలోకి వెళితే.. ఈ బయో టాయిలెట్లకు కాస్త దూరంలో భూమిలో మూడు ట్యాంకులు ఏర్పాటు చేస్తారు. కంటైనర్ లో పది వేల లీటర్ల నీటిని నింపుతారు. ఒకసారి టాయిలెట్ ను వినియోగించిన తర్వాత ఘన వ్యర్థాలు రెండో ట్యాంక్ లోకి చేరతాయి. అక్కడ బయో ప్రాసెస్ అయ్యాక స్వల్ప పరిమాణంలో మిగిలే వ్యర్థాలు మూడో ట్యాంకులోకి చేరతాయి.

ఆర్నెల్లకు ఒకసారి మూడో ట్యాంక్ లోని వ్యర్థాలను బూడిదగా మారుస్తారు. టాయిలెట్ వినియోగించిన సమయంలో వినియోగించే నీరు తొలి సెప్టిక్ ట్యాంక్ లో చేరతాయి. ఈ ట్యాంక్ సామర్థ్యం వెయ్యి లీటర్లు. అది నిండిన తర్వాత సెన్సర్ల ద్వారా రీసైక్లింగ్ జరుగుతుంది. ఇలా రీసైక్లింగ్ తో శుభ్రపడిన నీటిని తిరిగి ఫ్లష్ చేసేందుకు ఉపయోగించేలా ట్యాంక్ లోకి చేరతాయి. ఒకసారి పదివేల లీటర్ల నీటితో నింపిన ఫ్లష్ ట్యాంక్ లోకి ఇలా పలుమార్లు రీసైకిల్ అయిన నీరు చేరుతుంది. ఇలా ఏడాది పాటు మళ్లీ నీటిని నింపే అవసరం లేకుండా ఉంటుంది.

ఇదంతా చదివిన తర్వాత వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు ఎంత? దీని నిర్వహణకు అయ్యే పైసల సంగతేంటి? అన్న సందేహం కలగొచ్చు. అక్కడికే వస్తున్నాం. ఈ బయో టాయిలెట్ల ఏర్పాటు.. నిర్వహణ కు రూ.70 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని ఆస్కీ సంస్థ భరించింది. బయో టాయిలెట్లను రాజ్ భవన్ లోని సర్కారీ స్కూల్ కు అందించింది. రాబోయే రోజుల్లో లుంబినీ పార్కు.. టీవర్క్స్ వద్ద ఇదే తరహా బయో టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఈ తరహా టెక్నాలజీని దేశంలోనే మొదటిసారి వినియోగిస్తున్నట్లుగా ఆస్కీ చెబుతోంది.