Begin typing your search above and press return to search.

ఢిల్లీ విషయంలో బాధపడుతున్న బీజింగ్.. తామున్నామంటూ హామీ..

ఢిల్లీ మరోసారి పొగమంచు ముసురులో చిక్కుకుంది. ప్రతి ఉదయం పచ్చని కిరణాలు కాకుండా ధుమ్ము, ధూళితో నిండిన ఆకాశం మాత్రమే స్థానికులకు కనిపిస్తోంది.

By:  Tupaki Political Desk   |   6 Nov 2025 12:00 AM IST
ఢిల్లీ విషయంలో బాధపడుతున్న బీజింగ్.. తామున్నామంటూ హామీ..
X

ఢిల్లీ మరోసారి పొగమంచు ముసురులో చిక్కుకుంది. ప్రతి ఉదయం పచ్చని కిరణాలు కాకుండా ధుమ్ము, ధూళితో నిండిన ఆకాశం మాత్రమే స్థానికులకు కనిపిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) 400 దాటిపోవడంతో ప్రజలు శ్వాసించడమే కష్టంగా మారింది. ఈ సమయంలో ఊహించని విధంగా చైనా నుంచి ఓ సానుభూతి స్వరం వినిపించింది. భారత్ లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూజింగ్ తన ‘X’లో ఇలా రాశారు. ‘మేమూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఆ అనుభవాన్ని భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ త్వరలో ఈ పొగమంచు నుంచి బయటపడుతుంది.’ ఇది కేవలం ఒక డిప్లొమాటిక్‌ వ్యాఖ్య మాత్రమే కాదు. కొందరి దృష్టిలో ఇది రెండు దేశాల మధ్య పర్యావరణ సహకారానికి నూతన సంకేతంగా కూడా కనిపించింది.

ఇప్పుడు శుభ్రమైన బీజింగ్‌..

ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్‌, షాంఘై నగరాలు ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరాలుగా గుర్తింపుపొందాయి. కానీ చైనా తన విధానాల్లో కఠినమైన మార్పులు చేసింది. ఫ్యాక్టరీలపై కఠిన పర్యవేక్షణ, కార్బన్ ఉద్గారాలపై పరిమితులు, అధిక జరిమానాలు, పునరుత్పాదక ఇంధనాలపై విస్తృత పెట్టుబడులు పెట్టింది. దీంతో కొన్ని సంవత్సరాల్లోనే పొగమంచుతో ఉండే రాజధాని బీజింగ్‌, ఇప్పటి ప్రపంచ పర్యావరణ నియంత్రణకు ఉదాహరణగా మారింది. గాలి నాణ్యత ప్రమాణాలను కేవలం ప్రకటించలేదు. వాటిని కఠినంగా అమలు చేసింది. అలా చైనా నగరాలు మెల్లగా నీలి ఆకాశాన్ని తిరిగి చూశాయి.

అదే మార్గంలో ఢిల్లీ వెళ్లగలదా..?

ఢిల్లీకి సమస్య కొత్తది కాదు. ప్రతి శీతాకాలంలో పొలాల్లో స్టబుల్ బర్నింగ్‌,వాహనాల నుంచి వచ్చే పొగ, కర్మాగారాల ఉద్గారాలు, నిర్మాణ వ్యర్థాలు కలిసి నగరాన్ని పొగమంచు అనే దుప్పటితో కప్పేస్తాయి. భారత్‌ ఇప్పటికే పునరుత్పాదక ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర విద్యుత్ వంటి రంగాల్లో వేగంగా అడుగులు వేస్తోంది. కానీ సమస్య మూలాలను విధానాల అమలులో ఉన్న బలహీనతలు, ప్రాంతీయ రాజకీయాలు, సమన్వయ లోపాలు ఇంకా పూర్తిగా తేల్చుకోలేదు.

చైనా సహకారం..

పర్యావరణ రక్షణకు రెండు దేశాలు కలసి పనిచేస్తే దాని ప్రయోజనం కేవలం రాజకీయ సంబంధాలకే కాదు.. ప్రజల ఆరోగ్యాలపై ఉంటుంది. కానీ ఈ ప్రతిపాదన వెనుక చైనాకి ఉన్న వ్యూహాత్మక ఆసక్తిని కూడా భారత్‌ జాగ్రత్తగా పరిశీలించాలి. వాయు కాలుష్య నియంత్రణ కంటే ముందుగా డేటా షేరింగ్‌, టెక్నాలజీ ట్రాన్స్ఫర్‌, పర్యావరణ మోడలింగ్‌ వంటి అంశాలపై స్పష్టత అవసరం.

మైండ్‌సెట్ కూడా మారాలి

వాయు కాలుష్యం కేవలం శాస్త్రీయ సమస్య కాదు.. అది మన జీవన విధానం, మన దైనందిన నిర్ణయాలకు సంబంధించిన విషయం. సమాజం నుంచి పాలసీ వరకు బాధ్యత నుంచి అవగాహన వరకు,ఈ సంక్షోభం మనందరినీ ఒకే ప్రశ్న అడుగుతోంది. మనం శ్వాసించే గాలి మన భవిష్యత్తుకి సరిపోతుందా..? చైనా చెప్పినట్లుగా, ‘మేమూ ఆ దారిన నడిచాం’ అంటే, భారత్‌ కూడా తన మార్గాన్ని సరిగ్గా ఎంచుకుంటే ఒకరోజు ఢిల్లీ ఆకాశం కూడా మళ్లీ నీలంగా కనిపిస్తుంది.