Begin typing your search above and press return to search.

కూరగాయల సంత కాదు.. 'పెళ్లిళ్ల సంత'.. చైనాలో వెరైటీ మ్యారేజ్ మార్కెట్ హంగామా

ఈ మార్కెట్‌లో విచిత్రమేమిటంటే.. పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలు, అమ్మాయిలు ఇక్కడ కనిపించరు.. కేవలం వారి "బయోడేటా" కాగితాలు మాత్రమే గొడుగులకు వేలాడుతుంటాయి.

By:  A.N.Kumar   |   22 Aug 2026 7:00 PM IST
కూరగాయల సంత కాదు.. పెళ్లిళ్ల సంత.. చైనాలో వెరైటీ మ్యారేజ్ మార్కెట్ హంగామా
X

సంతకు వెళ్తే తోటకూర, బెండకాయలు దొరుకుతాయి. కానీ చైనాలోని షాంఘై పీపుల్స్ పార్క్‌కు వెళ్తే మాత్రం.. చక్కటి ఉద్యోగం, సొంత ఇల్లు, చేతినిండా జీతం ఉన్న అల్లుళ్లు, కోడళ్లు రెడీగా దొరుకుతారు.. అవును మీరు విన్నది నిజమే. అక్కడికి వెళ్లి గొడుగులు తెరిస్తే చాలు.. వాటిపై చదువు, ఉద్యోగం, నెల జీతం, ఆస్తుల వివరాలతో కూడిన ప్రొఫైళ్లు దర్శనమిస్తాయి. ప్రొడక్ట్ కేటలాగ్ చూసి వస్తువులు కొన్నంత ఈజీగా.. అక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సంబంధాలు వెతికేస్తున్నారు.

గొడుగుపై ప్రొఫైల్.. బేరసారాల్లో పేరెంట్స్

ఈ మార్కెట్‌లో విచిత్రమేమిటంటే.. పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిలు, అమ్మాయిలు ఇక్కడ కనిపించరు.. కేవలం వారి "బయోడేటా" కాగితాలు మాత్రమే గొడుగులకు వేలాడుతుంటాయి. వారి తల్లిదండ్రులే ఇక్కడ ప్రధాన కస్టమర్లు. "మా అబ్బాయికి నెలకు లక్ష ఆదాయం... మీ అమ్మాయికి ఇల్లు ఉందా?" అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కంటే దారుణంగా బేరాలు ఆడుతుంటారు. ఆ పక్కనే వెళ్లేవారికి ఇది పెళ్లిళ్ల సంతలా కాకుండా ఏదో కార్పొరేట్ కంపెనీల హెచ్.ఆర్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లా అనిపిస్తే అందులో వింతేమీ లేదు.

సాలరీ స్లిప్ ఉంటేనే సైన్-అప్

అయితే ఈ హడావుడి వెనుక చైనా యువత ఎదుర్కొంటున్న పెద్ద తలనొప్పి దాగి ఉంది. చైనాలో పెళ్లి చేసుకోవాలంటే ప్రేమ, దొండపండు లాంటి మనసులు ఉంటే సరిపోవు.. సొంత ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నెలకు 5 వేల యువాన్లు సంపాదించే అబ్బాయికి, కనీసం 10 వేలు సంపాదించే పిల్ల కావాలనే డిమాండ్లు... పెళ్లి కాకముందే గృహోపకరణాలు, పిల్లల భవిష్యత్తు ఖర్చుల లెక్కలు. ఆధునిక జీవన వ్యయం పెరిగిపోవడంతో "పెళ్లి అంటేనే ఒక పెద్ద ఫైనాన్షియల్ రిస్క్" అనే భావన.

సింగిల్‌గా ఉంటేనే హ్యాపీ అంటున్న యంగ్ జనరేషన్!

తల్లిదండ్రులేమో పార్కుల్లో గొడుగులు పట్టుకుని "మా వాడు లెక్చరర్.. మా అమ్మాయి సాఫ్ట్‌వేర్" అని కేకలు వేస్తుంటే చైనా యంగ్ జనరేషన్ మాత్రం "మాకొద్దు ఈ పెళ్లి గోల.. సింగిల్‌గానే హ్యాపీ" అంటూ ఎస్కేప్ అవుతున్నారు. కెరీర్, పర్సనల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని భావిస్తూ వివాహ వ్యవస్థకు దూరంగా జరుగుతున్నారు.

షాపింగ్ మాల్‌లో డిస్కౌంట్ సేల్ చూసినట్లు పార్కులో ప్రొఫైళ్లు చూసి భాగస్వామిని ఎంచుకోవడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియదు కానీ.. సామాజిక ఒత్తిళ్లు, పెరిగిన ఖర్చుల నడుమ చైనాలో పెళ్లి అనేది ఒక పెద్ద 'బిజినెస్ డీల్'గా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.