ఇరాన్ ను నమ్మించి హ్యాండ్ ఇచ్చిన రష్యా, చైనా
ఇరాన్ పై అమెరికా దాడి నేపథ్యంలో .. మిత్ర దేశాలైన రష్యా, చైనా మద్దతిస్తాయని చాలా మంది ఊహించారు. కానీ చైనా, రష్యాలు స్పందన వరకే పరిమితమయ్యాయి.
By: A.N.Kumar | 4 March 2026 12:00 AM ISTఇరాన్ పై అమెరికా దాడి నేపథ్యంలో .. మిత్ర దేశాలైన రష్యా, చైనా మద్దతిస్తాయని చాలా మంది ఊహించారు. కానీ చైనా, రష్యాలు స్పందన వరకే పరిమితమయ్యాయి. మద్దతు మాత్రం కరువైంది. ఈ పరిస్థితి కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. దేశాల మధ్య రక్షణ, వాణిజ్య ఒప్పందాలు మాటల వరకే పరిమితమా ?. దీనికి కారణం ఏంటి ? అన్న చర్చ అంతర్జాతీయంగా నడుస్తోంది.
ముడి చమురే ఆయువు :
అమెరికా వ్యతిరేక గ్రూపులో చైనా, రష్యా కీలక పాత్ర పోషిస్తాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో వ్యూహాత్మక వాణిజ్య, రక్షణ, రాజకీయ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చైనా అమెరికాతో పోటీగా తన అనుకూల దేశాల్లో ఒక వ్యవస్థను నిర్మించుకుంది. అమెరికాపై తక్కువ ఆధారపడటమే చైనా వ్యూహం. తద్వారా అమెరికాకు తలొగ్గకుండా ఉండాలన్నది ఆలోచన. అందులో భాగంగానే వెనుజులా, ఇరాన్ తో పాటు అమెరికా వ్యతిరేక దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుని, పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. అందుకే అమెరికా చైనాను నేరుగా ఢీకొట్టకుండా.. చైనాతో కీలక ఒప్పందాలు ఉన్న దేశాలను టార్గెట్ చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నది ముడి చమురు. ముడి చమురే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆయువు. ముడి చమురు, దాని సరఫరా వ్యవస్థపై ఎవరైతే పట్టు సాధిస్తారో వారే ఆధిపత్యాన్ని సాధించగలుగుతారు. అందుకే ఇరాన్, వెనుజువెలా, రష్యాతో చైనా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. దీనిని గమనించిన అమెరికా ముందుగా వెనుజులాపై దాడి చేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఇరాన్ పై అణు పరీక్షల పేరుతో దాడి మొదలుపెట్టింది. కానీ రష్యా జోలికి వెళ్లలేదు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తోంది. రష్యాతో ఉన్న అణ్వాయుధాలే అమెరికా అటు వైపు చూడటానికి భయపడేలా చేసిందన్న వాదన ఉంది.
కరువైన మద్దతు :
అమెరికాకు వ్యతిరేకంగా వెనుజులా, ఇరాన్ తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా, రష్యాలు.. ఆ దేశాల విషయంలో అమెరికా చర్యలను మాత్రం తిప్పికొట్టడంలేదు. కేవలం ఖండనలకు పరిమితమవుతున్నారు. దీనికి వెనుక కీలక వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. కమ్యూనిస్టు ప్రభుత్వమైనా, క్యాపిటలిస్టు ప్రభుత్వమైనా, నేషనలిస్టు ప్రభుత్వమైనా.. ముందుగా ప్రాధాన్యత ఇచ్చేది దేశ ప్రయోజనాలకే. యుద్ధంలోకి దిగితే తమకొచ్చే లాభం ఏంటి ?. నష్టం ఏంటి ? అన్న విషయాలను బేరీజు వేసుకుంటాయి. దానికి అనుగుణంగా స్పందిస్తాయి. అంతే తప్పా.. మిత్రదేశానికి కష్టమొచ్చిందని, స్వంత ప్రయోజనాలను తాకట్టు పెట్టి యుద్ధరంగంలోకి వెళ్లవు. నాటో కూటమిలాగా రష్యా, చైనా, వెనుజులా, ఇరాన్ మధ్య ఒప్పందం లేదు. వీటి మధ్య ఉన్నవి పరస్పర ప్రయోజనకారమైన ఒప్పందాలు. కాబట్టే రష్యా,చైనా ఆశించిన స్థాయిలో స్పందించడంలేదు. దీనితో పాటు ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ తో ఏళ్లపాటు యుద్ధం కొనసాగిస్తోంది. యుద్ధమంటే.. గెలవడం, ఓడటం, ప్రాణాలు పోవడమే కాదు. దేశ ప్రజల ఆర్థిక స్థితిని దిగజార్చడం. ఇప్పటికే రష్యా యుద్ధ పరిణామాలను ఎదుర్కొంటోంది. వీటిని కాదని ఇరాన్ కు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు. చైనా కూడా ఇదే బాటలో ఉంది. త్వరలో ట్రంప్ బీజింగ్ పర్యటనకు వెళ్లబోతున్నారన్న వార్తలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్ విషయంలో అతిగా స్పందిస్తే.. చైనా ప్రయోజనాలు దెబ్బతినవచ్చన్నఆలోచనతో సైలెంట్ గా ఉందన్న వాదన ఉంది.
ఒప్పందాలు మాటలకే పరిమితమా ?
దేశాల మధ్య రక్షణ, వాణిజ్య, రాజకీయ ఒప్పందాలు కేవలం మాటలకే పరిమితమా ? . మిత్రదేశం ఆపదలో ఉంటే ఆదుకోలేరా అన్న ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పవచ్చు. ఎవరికైనా స్వప్రయోజనాలే ముఖ్యం. ఉదాహరణకు అమెరికా, పాకిస్థాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇండియాతో అమెరికాకు సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్ చైనాకు సంబంధాలు ఉన్నాయి. అమెరికా ఇరాన్ సుప్రీం లీడర్ ని హతమార్చిందని పాకిస్థాన్ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇక్కడ పాకిస్థాన్ కు తన ప్రయోజనాలు ముఖ్యం. అంతే కానీ సాటి ముస్లిం దేశమన్న సానుభూతి కాదు. పరిస్థితులను బట్టి దేశాల మధ్య సంబంధాలు మారుతాయి. అమెరికా, ఇజ్రాయిల్ తో ఉన్న సంబంధాలే.. ఇరాన్ విషయంలో ఇండియా స్పందించకపోవడానికి కారణం. ఆయా దేశాల్లోని పౌరులు మాత్రమే భావోగ్వేదంతో స్పందిస్తారు. కానీ ఆయా ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వాలకు దేశ ప్రయోజనాలే పరమావధి.
