Begin typing your search above and press return to search.

వీడియో వైరల్.. మనిషి కంటే ముందే గమ్యం చేరుకున్న రోబో.. ఆశ్చర్యపోతున్న జనం..

ఈ హాఫ్ మారథాన్ (21.1 కి.మీ) ఫలితాలు మనిషి శక్తికి, యంత్రం సామర్థ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించాయి.

By:  Tupaki Political Desk   |   20 April 2026 2:00 PM IST
వీడియో వైరల్.. మనిషి కంటే ముందే గమ్యం చేరుకున్న రోబో.. ఆశ్చర్యపోతున్న జనం..
X

పరుగు పందెంలో మనిషిని రోబో ఓడించింది.. ఇందులో విశేషం ఏంటి అనుకుంటున్నారా? రోబో పరుగు చక్రాకలతో కాదు.. కాళ్లతో అందుకే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో రోబోలు మనతో కలిసి జీవించడమే కాదు.., మనకంటే వేగంగా కూడా వెళ్లగలవు అని చెప్పేందుకు చైనాలో జరిగిన ఈ ‘హాఫ్ మారథాన్’ గొప్ప ఉదాహరణ. 21 కిలోమీటర్ల దూరాన్ని ఒక మనిషి కంటే దాదాపు 17 నిమిషాల ముందే రోబో పూర్తి చేయడం చూస్తుంటే, టెక్నాలజీ ఏ స్థాయిలో దూసుకుపోతుందో అర్థమవుతోంది.

21 కిలోమీటర్ల పరుగును 50 నిమిషాల్లోనే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ రంగంలో చైనా తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నంలో మరో మైలురాయిని అధిగమించింది. బీజింగ్‌లో నిర్వహించిన ‘యిజువాంగ్ హాఫ్ మారథాన్’లో మనుషులు, రోబోలు కలిసి పోటీ పడడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మారథాన్లలో మనుషులు తమ సత్తువ నిరూపించుకుంటారు, కానీ ఇక్కడ ‘హానర్’ సంస్థ రూపొందించిన లైటినింగ్ రోబో గాలి వేగంతో పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఈ హాఫ్ మారథాన్ (21.1 కి.మీ) ఫలితాలు మనిషి శక్తికి, యంత్రం సామర్థ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించాయి. ఈ పరుగు పందెంలో మొదటి స్థానం లైటినింగ్ రోబో - 50 నిమిషాల 26 సెకన్లతో దక్కించుకుంది. ఇక రెండు, మూడో స్థానాల్లో ఇతర హ్యుమనాయిడ్ రోబోలు (51 నిమిషాలు, 53 నిమిషాలు) ఉన్నాయి. మనుషుల అత్యుత్తమ సమయం గంట 7 నిమిషాల 47 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నారు. అంటే, రోబోలు మనిషి కంటే 17 నిమిషాల ముందే గమ్యాన్ని చేరుకున్నాయి. ఇది కేవలం వేగం మాత్రమే కాదు.., యంత్రాల స్థిరత్వానికి నిదర్శనం.

లిక్విడ్ కూలింగ్, స్పెషల్ లెగ్స్

ఒక యంత్రం అంత వేగంగా పరిగెత్తాలంటే అది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ‘హీట్’. లైటినింగ్ రోబో ఇంజినీర్లు దీనిని పరిష్కరించడానికి అద్భుతమైన వ్యూహాన్ని అనుసరించారు. సాధారణంగా గేమింగ్ ఫోన్లలో వాడే ‘అడ్వాన్స్డ్ లిక్విడ్ కూలింగ్’ సిస్టమ్‌ను ఈ రోబోలో అమర్చారు. దీనివల్ల పరుగులో వెలువడే వేడిని నియంత్రించి, మోటార్లు సమర్థవంతంగా పనిచేసేలా చేశారు. పరుగు కోసం ప్రత్యేకంగా 90 నుంచి 95 సెంటీ మీటర్ల పొడవుతో కాళ్లను రూపొందించారు. ఇవి మనిషి అడుగుల కంటే ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో కవర్ చేసేలా సహాయపడ్డాయి. రోడ్డుపై ఉన్న ఎగుడుదిగుడులను తట్టుకుంటూ, పడిపోకుండా స్థిరంగా పరిగెత్తడానికి శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్లను వాడారు.

మనుషులపై ప్రభావం

ఈ విజయం కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాదు. రోబోలు మనుషుల కంటే వేగంగా, ఎలాంటి సాంకేతిక ఇబ్బంది లేకుండా పరిగెత్తగలవని నిరూపితమైంది. అత్యవసర సమయాల్లో ప్రమాదకర ప్రాంతాలకు మనుషుల కంటే వేగంగా చేరుకొని సాయం అందించడానికి ఇలాంటి రోబోలు ఉపయోగపడతాయి. పట్టణ ప్రాంతాల్లో తక్కువ సమయంలో వస్తువులను చేరవేసేందుకు 'రన్నింగ్ రోబోలు' ప్రత్యామ్నాయంగా మారవచ్చు.

రోబోలు మనుషులను అధిగమించడం సాంకేతికంగా గొప్ప విషయమే అయినా, ఇది మానవ ఉపాధిపై చూపే ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పనిలోనే కాకుండా, క్రీడల్లో కూడా రోబోలు ఇలాంటి రికార్డులు సృష్టించడం వల్ల భవిష్యత్తులో మారథాన్లు కేవలం 'రోబోల రేసులు'గా మారిపోతాయేమోనన్న అనుమానం కలుగుతోంది.

చైనా సాధించిన ఈ విజయం రోబోటిక్స్ రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. మనిషి మెదడు సృష్టించిన యంత్రం, అదే మనిషి శారీరక శక్తిని సవాల్ చేయడం విచిత్రంగా ఉన్నా.. అది నేటి వాస్తవం. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో కూడా రోబోల కోసం ప్రత్యేక విభాగం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.