చైనాలో వైరల్ అవుతున్న ‘ప్రీ-మేడ్ చిల్డ్రన్’ ట్రెండ్.. పిల్లల బాల్యాన్ని చదువుతోనే నింపేస్తున్నారా?
సెలవులంటే మనకు గుర్తొచ్చేవి మామిడికాయలు, సైకిల్ రేసులు, పిన్నిగారింటి అల్లర్లు. కానీ ఈ ‘ప్రీ-మేడ్’ రెసిపీలో అవన్నీ అవుట్‌డేటెడ్.
By: A.N.Kumar | 15 Aug 2026 6:00 PM ISTప్యాకెట్ విప్పడం.. మైక్రోవేవ్‌లో పెట్టడం.. రెండు నిమిషాల్లో తినేయడం.. ‘ప్రీ-మేడ్ మీల్స్’ కథ మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు చైనాలో వంటకాల స్థానంలో పిల్లలను పెట్టేశారు.. అదేనండీ సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘ప్రీ-మేడ్ చిల్డ్రన్’ ట్రెండ్. పిల్లల బాల్యాన్ని చదువు అనే ఫ్రీజర్‌లో పెట్టి ఐదో తరగతిలోనే పదో తరగతి సిలబస్‌ను మైక్రోవేవ్ చేసి ర్యాంకుల రూపంలో బయటకు తీసే కొత్త రకం "రెడీ-టు-ఈట్" పెంపకమిది.
సెలవులంటే మనకు గుర్తొచ్చేవి మామిడికాయలు, సైకిల్ రేసులు, పిన్నిగారింటి అల్లర్లు. కానీ ఈ ‘ప్రీ-మేడ్’ రెసిపీలో అవన్నీ అవుట్‌డేటెడ్. వచ్చే ఏడాది సిలబస్ ఇప్పుడే నమలాలి.. అదనపు ట్యూషన్ల స్టీమ్‌లో ఉడకాలి.. ఎగ్జామ్ మోడ్‌లో 24/7 మరగాలి. పక్కింటి బబ్లూ కంటే మన బంటి రెండు చాప్టర్లు ముందే ఉండాలి.. అదీ అసలు సీక్రెట్ ఇంగ్రీడియంట్..
ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ vs సహజ బాల్యం
పిల్లలకు ఆటపాటలు.. సృజనాత్మకత.. కాసేపు హాయిగా నిద్రపోవడం అంటే... అయ్యో అవేమైనా మార్కులు తెచ్చిపెడతాయా ఏంటి? ‘పాయింట్ వన్’ శాతంలో ర్యాంకు పోతే సమాజం ఏమనుకుంటుంది? అందుకే తల్లిదండ్రులు తమ ప్రేమను డిజైనర్ కోచింగ్ సెంటర్ల ఫీజుల రూపంలో కురిపిస్తున్నారు. ఫలితంగా... బొమ్మలు పట్టుకోవాల్సిన చేతులు ర్యాంక్ కార్డులను మోస్తూ సృజనాత్మకతను బకెట్లో పడేసి యంత్రాల్లా మారే ‘పర్‌ఫెక్ట్ ప్రోడక్ట్స్’ తయారవుతున్నాయి.
ఈ అత్యంత సమర్థవంతమైన ‘ప్యాకేజింగ్’ వెనుక ఉన్న చిన్న సమస్య ఏమిటంటే పిల్లలు రోబోలు కారు. నిరంతర ఒత్తిడి, పోటీ మానసిక భావనలు వారిలోని ఆనందాన్ని పీల్చేస్తున్నాయి. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితానికి కొలమానం అనుకుంటే భవిష్యత్తులో ఆ ప్యాకెట్ ఓపెన్ చేశాక లోపల ‘అసలైన వ్యక్తిత్వం’ ఉందో లేదో వెతుక్కోవాల్సి వస్తుంది.
పిల్లలను ముందుగానే రెడీ చేసి మార్కెట్లో పెట్టే ‘ప్రీ-మేడ్’ మోజు స్వస్తి చెప్పాలి. చదువుతో పాటు ఆటలు, విశ్రాంతి, స్వయంగా నేర్చుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడే బాల్యం పరిపూర్ణమవుతుంది. లేదంటే భవిష్యత్తులో మనం చూసేది కేవలం సర్టిఫికెట్ల మోత తప్ప నవ్వుతూ జీవించే మనుషులను కాదు..
