Begin typing your search above and press return to search.

చైనాకే కాదు.. యావత్ ప్రపంచానికి ఒక గుణపాఠం

ఒక దేశం తన ప్రజలకు ఎంత మంది పిల్లలు ఉండాలో నిర్ణయించగలదా..? ఒకప్పుడు ఈ ప్రశ్నకు చైనా ధైర్యంగా ‘అవును’ అని చెప్పింది.

By:  Tupaki Political Desk   |   5 Jan 2026 4:00 PM IST
చైనాకే కాదు.. యావత్ ప్రపంచానికి ఒక గుణపాఠం
X

ఒక దేశం తన ప్రజలకు ఎంత మంది పిల్లలు ఉండాలో నిర్ణయించగలదా..? ఒకప్పుడు ఈ ప్రశ్నకు చైనా ధైర్యంగా ‘అవును’ అని చెప్పింది. దశాబ్దాల పాటు అమలైన వన్‌ చైల్డ్ పాలసీ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. జనాభా పెరుగుదల ఆపితే అభివృద్ధి వేగం పెరుగుతుందన్న నమ్మకం ఆ నిర్ణయానికి బలం. కానీ ఇప్పుడు అదే దేశం పూర్తిగా విరుద్ధమైన పాలసీలతో వెళ్తోంది. ‘పిల్లలు పుట్టాలి, కుటుంబాలు పెద్దవిగా మారాలి’ అని పిలుపునిస్తోంది. ఇది కేవలం పాలసీ మార్పు కాదు చైనా ఎదుర్కొంటున్న లోతైన జనాభా సంక్షోభానికి ప్రతిస్పందన.

ప్రభుత్వ విధానలతో ప్రజల హైరానా

ఇటీవల చైనా తీసుకున్న చర్యలు చూస్తే ఈ ఆందోళన ఎంత తీవ్రమైందో అర్థమవుతుంది. కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ వంటి గర్భ నిరోధక సాధనాలపై 13 శాతం పన్ను విధించడమే కాకుండా, పిల్లల సంరక్షణకు సంబంధించిన ఖర్చులపై పన్ను మినహాయింపులు ప్రకటించింది. పిల్లలు పెంచితే ఆర్థికంగా లాభం ఉంటుందన్న సందేశాన్ని ప్రభుత్వం స్పష్టంగా పంపిస్తోంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న డబ్బు ఇస్తే ప్రజలు పిల్లలు కనడానికి సిద్ధపడతారా? చైనా ప్రభుత్వం ఇప్పుడు బేబీ బూమ్ గురించి మాట్లాడుతున్నా, గతం ఇంకా ప్రజల జ్ఞాపకాల నుంచి దూరం కాలేదు. వన్‌ చైల్డ్ పాలసీ కాలంలో కుటుంబాలపై జరిగిన ఒత్తిడి, బలవంతపు గర్భస్రావాలు, జరిమానాలు ఇవి కోట్లాది మందిని మానసికంగా ప్రభావితం చేశాయి. ‘పిల్లలు ఎక్కువైతే నేరం’ అన్న భావన తరతరాలుగా మెదళ్లలో నాటుకుపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా ‘ఇంకా పిల్లలు కావాలి’ అని చెప్పడం ఇప్పటికి ఇప్పటికి మారే విషయం కాదు.

మారిన పరిస్థితులు సహకరిస్తాయా?

మరొక ముఖ్యమైన అంశం జీవన విధానం మారిపోయింది. పట్టణీకరణ పెరిగింది, విద్యా స్థాయి పెరిగింది, మహిళలు ఉద్యోగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబం అంటే భద్రతగా భావించిన సమాజం, ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తోంది. పిల్లల పెంపకం ఖర్చు మాత్రమే కాదు, సమయం, కెరీర్‌పై ప్రభావం కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం పన్ను మినహాయింపులు ఇచ్చినంత మాత్రాన నిర్ణయాలు మారవు. చైనా ఎదుర్కొంటున్న అసలు సమస్య జనాభా తగ్గుదలతో పాటు వృద్ధాప్య జనాభా వేగంగా పెరగడం. యువత సంఖ్య తగ్గితే, కార్మిక శక్తి బలంగా తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. పెన్షన్లు, హెల్త్‌కేర్ ఖర్చులు పెరుగుతాయి. ఈ భయమే ప్రభుత్వాన్ని బేబీ బూమ్ పాలసీ వైపు నడిపిస్తోంది. కానీ పాలసీ మార్పులు, ప్రోత్సాహకాలు ఇవి లక్షణాలకు చికిత్స మాత్రమే. మూలకారణం ప్రజల మనస్తత్వంలో ఉంది.

ప్రభుత్వం తగ్గుతున్న విశ్వాసం..

ఇక్కడే ‘ఎంపిక & విశ్వాసం’ అనే అంశం ముందుకు వస్తుంది. ప్రజలకు నిజమైన ఎంపిక ఉందా..? ప్రభుత్వం నేడు చెప్పేది రేపు మళ్లీ మార్చుకోదన్న విశ్వాసం ఉందా? గతంలో ఒక పాలసీతో జీవితాలను నియంత్రించిన ప్రభుత్వం, ఇప్పుడు విరుద్ధంగా మాట్లాడితే ప్రజలు అనుమానం వ్యక్తం చేయడం సహజం. ‘ఈ రోజు పిల్లలు కనమంటారు, రేపు మళ్లీ ఆపమంటారా?’ అనే ప్రశ్న ప్రతి యువ జంట మనసులో బలంగా నాటుకుంది. అందుకే చైనా సమస్య డబ్బు కంటే లోతైనది. ఇది నమ్మకానికి సంబంధించినది. సమాజంలో పిల్లలు కనడం గౌరవంగా, భద్రంగా, భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుందన్న విశ్వాసం కలగాలి. ఉద్యోగ భద్రత, వర్క్–లైఫ్ బ్యాలెన్స్, చైల్డ్‌కేర్ సదుపాయాలు, విద్యా వ్యవస్థ ఇవన్నీ కలిసి పని చేయాలి. కేవలం పన్ను రాయితీలు చిన్న భాగమే.

చైనాకే కాదు.. యావత్ ప్రపంచానికి ఒక గుణపాఠం

ఈ పరిణామం ప్రపంచానికి కూడా ఒక పాఠం. జనాభా విధానాలు సంఖ్యల ఆట కాదు. అవి ప్రజల జీవితాలపై చూపే ప్రభావం. ఒకసారి మనస్తత్వం మారితే, దాన్ని తిరిగి మార్చడం అత్యంత కష్టం. చైనా ఇప్పుడు అదే సత్యాన్ని ఎదుర్కొంటోంది. చివరికి ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. జనాభాను చట్టాలతో నియంత్రించవచ్చు, కానీ పెంచలేం. ప్రజల మనసులు మారకుండా జనాభా మారదు. నమ్మకం తిరిగి రాకపోతే, ఏ బేబీ బూమ్ పాలసీ అయినా కాగితాలపైనే మిగిలిపోతుంది.