చైనా అణు శక్తి ప్రదర్శన.. ప్రపంచ శాంతికి సవాల్
ప్రస్తుతం అమెరికా–చైనా మధ్య దక్షిణ చైనా సముద్రం, తైవాన్ వంటి అంశాలపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
By: A.N.Kumar | 4 Sept 2025 3:00 AM ISTబీజింగ్‌లో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో చైనా ప్రదర్శించిన అణు ఆయుధాలు, అత్యాధునిక రక్షణ సాంకేతికతలు ప్రపంచ భద్రతా వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా డీఎఫ్–5సీ (DF-5C) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రదర్శన.. దాని అపారమైన సామర్థ్యాలతో అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది.
* 20,000 కి.మీ రేంజ్.. చైనా వ్యూహాత్మక సంకేతం
ప్రపంచంలో అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా మధ్య అణు సామర్థ్యాల పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. ఈ సమయంలో చైనా ప్రదర్శించిన డీఎఫ్–5సీ క్షిపణి 20,000 కిలోమీటర్ల (12,427 మైళ్లు) రేంజ్ కలిగి ఉంది. ఈ అపారమైన పరిధి కేవలం అమెరికా మాత్రమే కాకుండా.. భూగోళంలోని ఏ దేశాన్నైనా చేరుకోగలదు. దీని ద్వారా చైనా "ప్రపంచం మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం" తనకు ఉందని బహిరంగంగా ప్రకటించినట్లు అయింది. ఈ క్షిపణిలోని మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (MIRV) టెక్నాలజీ ఒకే క్షిపణి నుండి అనేక అణు వార్‌హెడ్‌లను వివిధ లక్ష్యాలపై ప్రయోగించే వీలు కల్పిస్తుంది. గతంలో అమెరికా, రష్యా వద్ద మాత్రమే ఉన్న ఈ సాంకేతికతను ఇప్పుడు చైనా కూడా కలిగి ఉండటం గమనార్హం.
* వ్యూహాత్మక సమతుల్యతపై ప్రభావం
ప్రస్తుతం అమెరికా–చైనా మధ్య దక్షిణ చైనా సముద్రం, తైవాన్ వంటి అంశాలపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చైనా తన సైనిక శక్తిని ప్రదర్శించడం, ఇతరులపై మానసిక ఒత్తిడి పెంచే వ్యూహంగా భావించవచ్చు. భారతదేశం వంటి పొరుగు దేశాలకు కూడా ఇది ఆందోళన కలిగించే అంశమే. ఈ క్షిపణులు భూగర్భ స్థావరాలను సైతం ఛేదించగలవని చైనా ప్రకటించడం, భద్రతా లెక్కలను పూర్తిగా మార్చివేస్తుంది. ఈ ప్రదర్శన ద్వారా చైనా తన భూమి, సముద్రం, గగనతలం నుండి అణు దాడులు చేయగల న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యాన్ని బలోపేతం చేసిందని చాటి చెప్పింది. ఈ ఆయుధ ప్రదర్శనలు కేవలం రక్షణ కోసమే కాకుండా, అంతర్జాతీయ రాజకీయాలలో చైనా ఒక అగ్రశక్తిగా ఎదిగిందని ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశ్యంతో కూడా ఉన్నాయి.
* ఇతర ఆధునిక ఆయుధాలు
కేవలం క్షిపణులు మాత్రమే కాకుండా చైనా ఈ పరేడ్‌లో లేజర్ సిస్టమ్స్, హైపవర్‌డ్ మైక్రోవేవ్ సిస్టమ్స్, స్మార్ట్ ట్యాంక్స్, భారీ సముద్ర డ్రోన్లు, హైపర్‌సోనిక్ క్షిపణులు వంటి అత్యాధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించింది. ఇది చైనా తన సైనిక శక్తిని సాంకేతికంగా తదుపరి స్థాయికి తీసుకెళ్లిందని స్పష్టం చేస్తుంది. ప్రపంచం ప్రస్తుతం బహుళ ధ్రువాల వైపు కదులుతోంది. ఈ నేపథ్యంలో చైనా ప్రదర్శించిన ఆయుధ శక్తి భవిష్యత్తులో కొత్త అణు ఆయుధ పోటీకి దారి తీయవచ్చని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
