Begin typing your search above and press return to search.

భారత్ తో యుద్ధానికి చైనా సర్వసన్నద్ధం.. యుద్ధ విమానాల మోహరింపుతో బుక్కైంది

మళ్ళీ మొదలైంది డ్రాగన్ మార్క్ డ్రామా.. బోర్డర్ దగ్గర వాతావరణం చల్లగానే ఉన్నా చైనా సైనిక వర్గాల గుండెల్లో మాత్రం ఏదో ప్లాన్ ఉడుకుతున్నట్లుంది. "

By:  A.N.Kumar   |   30 July 2026 11:36 PM IST
భారత్ తో యుద్ధానికి చైనా సర్వసన్నద్ధం.. యుద్ధ విమానాల మోహరింపుతో బుక్కైంది
X

మళ్ళీ మొదలైంది డ్రాగన్ మార్క్ డ్రామా.. బోర్డర్ దగ్గర వాతావరణం చల్లగానే ఉన్నా చైనా సైనిక వర్గాల గుండెల్లో మాత్రం ఏదో ప్లాన్ ఉడుకుతున్నట్లుంది. "మేం చాలా మంచోళ్ళం.. శాంతి కాముకులం" అని పైకి స్వీట్ కబుర్లు చెప్తూనే వెనుక మాత్రం జింజియాంగ్, టిబెట్ ఎయిర్‌బేస్‌లలో ఏకంగా 12 J-20 'స్టెల్త్' ఫైటర్ జెట్లను మోహరించిందట. పాపం రాడార్లకు చిక్కకుండా గాల్లో మాయమైపోదామని చైనా ప్లాన్ చేస్తే, 'వాంటోర్' అనే కమర్షియల్ శాటిలైట్ వచ్చి ఫోటోలు తీసి రచ్చ రచ్చ చేసింది. పాపం చైనా... "దాక్కుందాం అనుకుంటే, కెమెరా ముందు నిలబెట్టేశారేంటిరా నాయనా!" అని లోలోపల లబోదిబోమంటుందేమో!

రాడార్‌కు చిక్కవు సరే... కెమెరాకు దొరికితే ఎలా?

ఈ J-20 విమానాల గురించి చైనా ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. "ఇది ఐదో తరం అద్భుతం, రాడార్లకు అసలు కనపడదు, గాల్లోనే మాయమైపోతుంది" అని గొప్పులు చెప్పుకుంటుంది. కానీ లద్దాక్ బార్డర్‌కు కేవలం 245 కిలోమీటర్ల దూరంలో ఇన్ని విమానాలను తెచ్చి లైన్‌లో పెట్టేసరికి అంతరిక్షంలో తిరిగే మామూలు శాటిలైట్లు కూడా "హై చైనా బొమ్మలు చూశారా!" అంటూ క్లిక్ అనిపించేశాయి. రాడార్ కళ్ళు గప్పి రావాలనుకున్న చైనా స్టీల్త్ టెక్నాలజీ, ఇప్పుడు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో కవర్ పేజీ ఫోటోగా మారి నవ్వులపాలవుతోంది.

అసలు ఈ మోహరింపు సైనిక వ్యూహమా? లేక గిల్లికజ్జాలా?

చైనా ప్రతిసారీ ఇలాంటి చిన్న చిన్న జిమ్మిక్కులు చేయడం అలవాటే. బోర్డర్ దగ్గర నాలుగు టెంట్లు వేయడం, కొన్ని జెట్లను తెచ్చి రన్‌వే మీద నిలబెట్టడం... భారత్ స్పందన ఏంటో చూద్దామని ఎదురుచూడటం.. కానీ మన భారత్ కూడా ఏమీ తక్కువ తినలేదు. చైనా అక్కడ ఎయిర్‌బేస్‌లు ఆధునీకరిస్తుంటే భారత్ లద్దాక్, అరుణాచల్ ప్రదేశ్‌లలో రఫేల్స్, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, రాడార్ నెట్‌వర్క్‌లతో 'రండి చూసుకుందాం' అన్నట్లుగా సిద్ధంగానే ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ 12 జెట్ల మోహరింపు నిజంగా యుద్ధ సన్నాహమా? లేక "మా దగ్గర కూడా ఖరీదైన బొమ్మలున్నాయి" అని చూపించుకోవడానికి చైనా చేసిన చిన్న పాటి పబ్లిసిటీ స్టంటా? అనేదానిపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు నోరు విప్పలేదు. ఇటు భారత వైమానిక దళం కూడా దీనిపై పెద్దగా కంగారుపడకుండా సైలెంట్‌గా సీరియస్‌గా వాచ్ చేస్తోంది.

రక్షణ నిపుణుల సలహా.. డ్రామాలు చూసి డీప్‌గా వెళ్ళకండి

రక్షణ నిపుణులు మాత్రం ఈ పరిణామాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. "చైనా ఇలాంటి సీన్లు తరచూ రీ-రిలీజ్ చేస్తుంటుంది, అంతమాత్రాన రేపే యుద్ధం వచ్చేస్తుందని కంగారు పడక్కర్లేదు" అని చెప్తున్నారు. సరిహద్దుల్లో ఫోటోషూట్‌లు చేయడం చైనాకు అలవాటే కాబట్టి మనం కూడా దౌత్యపరమైన పరిణామాలను గమనిస్తూ కూల్‌గా ఉండటమే మంచిది. ఏది ఏమైనా "మాయావి" అని బిల్డప్ ఇచ్చిన జే-20 జెట్లు... ఇప్పుడు నెట్టింట అందరికీ కనిపిస్తూ 'పబ్లిక్ ప్రాపర్టీ' అయిపోయాయి..