Begin typing your search above and press return to search.

ఇరాన్ కు మిస్సైల్ లాంఛర్లు.. అమెరికాను అదును చూసి కొడుతున్న చైనా, పాకిస్తాన్

తమ భూభాగాన్ని ఏ రకమైన మూడో దేశ ఆయుధ రవాణాకు అనుమతించడం లేదని, ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న కల్పిత వార్తలని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

By:  A.N.Kumar   |   30 July 2026 4:00 PM IST
ఇరాన్ కు మిస్సైల్ లాంఛర్లు.. అమెరికాను అదును చూసి కొడుతున్న చైనా, పాకిస్తాన్
X

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరుకుంటున్న వేళ గ్లోబల్ జియోపాలిటిక్స్‌లో కొత్త చర్చ మొదలైంది. చైనా నుంచి ఇరాన్‌కు భారీ స్థాయిలో మిస్సైల్ లాంచర్లు సరఫరా అవుతున్నాయని.. ఇవి పాకిస్థాన్ భూభాగం మార్గంగా ఇరాన్‌కు చేరనున్నాయని అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

$60-70 మిలియన్ల భారీ ఆయుధ ఒప్పందం?

వివిధ అంతర్జాతీయ కథనాల ప్రకారం... చైనా, ఇరాన్ మధ్య సుమారు 60 నుంచి 70 మిలియన్ డాలర్ల (దాదాపు ₹500 కోట్లకు పైగా) విలువైన రక్షణ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 400 మిస్సైల్ లాంచర్లను ఇరాన్‌కు చైనా సరఫరా చేయనుందని.. అందులో మొదటి విడత షిప్‌మెంట్ వచ్చే వారంలోనే ఇరాన్‌కు చేరుకోనుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ ఆయుధాల రవాణాకు పాకిస్థాన్ భూభాగాన్ని కారిడార్‌గా ఉపయోగిస్తున్నారనే వార్తలు సైనిక నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఈ నివేదికలపై ఇప్పటివరకు ఎలాంటి స్వతంత్ర అంతర్జాతీయ సంస్థల ధ్రువీకరణ లేదు.

ఆరోపణలను ఖండించిన చైనా, పాకిస్థాన్

ఈ ప్రచారంపై చైనా, పాకిస్థాన్ దేశాలు తక్షణమే స్పందించాయి. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని.. భౌగోళిక రాజకీయాల్లో అలజడి సృష్టించేందుకు జరుగుతున్న కుట్ర అని రెండు దేశాల విదేశాంగ శాఖలు ఖండించాయి. ఇరాన్‌కు ఎలాంటి మిస్సైల్ లాంచర్లు సరఫరా చేయడం లేదని, తమ రక్షణ ఎగుమతులు ఎప్పుడూ అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఉంటాయని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

తమ భూభాగాన్ని ఏ రకమైన మూడో దేశ ఆయుధ రవాణాకు అనుమతించడం లేదని, ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న కల్పిత వార్తలని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ప్రాంతీయ భద్రతపై ప్రభావం.. భవిష్యత్ పరిణామాలు

ఒకవేళ ఈ ఆయుధ ఒప్పందం గనుక నిజమైతే అది మిడిల్ ఈస్ట్ లో సైనిక సమతుల్యతను తలకిందులు చేసే అవకాశం ఉంది. ఇరాన్ సైనిక సామర్థ్యం పెరిగితే అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా నిరసించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో పాకిస్థాన్ పేరు రావడం వల్ల దక్షిణాసియా ప్రాంతీయ భద్రతపై కూడా దీని నీడ పడే ప్రమాదం ఉంది.

ప్రస్తుతానికి ఈ పరిణామాలపై అధికారిక స్పష్టత పరిమితంగానే ఉంది. అంతర్జాతీయ మీడియా కథనాలు ఒకవైపు, సంబంధిత దేశాల ఖండనలు మరోవైపు ఉన్న నేపథ్యంలో... ప్రపంచ దేశాల కళ్లు ఇప్పుడు చైనా, ఇరాన్, అమెరికా వ్యూహాత్మక అడుగులపైనే నెలకొన్నాయి.