ప్రాక్టీస్‌లో విద్యార్థినిని హగ్ చేసుకున్న యంత్రం.. షాక్ కు గురైన ప్రపంచం.. ప్రోగ్రామింగ్ వైఫల్యమా?
దాదాపుగా 20 సంవత్సరాల క్రితం 2004లో ‘ఐ రోబోట్’ అనే ఒకసినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
By: Tupaki Political Desk | 27 April 2026 11:02 AM ISTదాదాపుగా 20 సంవత్సరాల క్రితం 2004లో ‘ఐ రోబోట్’ అనే ఒకసినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మానవ అవసరాల కోసం తయారు చేసే రోబోట్లు సొంతంగా ఆలోచించడం నేర్చుకుంటే కలిగే వినాశనాల గురించి.. రజనీకాంత్ ‘రోబో 2.0’ కూడా ఇదే చెప్తుంది. చైనాలోని షాన్సీ ప్రావిన్సులో జరిగిన ఈ ఘటన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హ్యూమనాయిడ్ రోబోల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీశాయి. మనిషికి సాయంగా ఉండాల్సిన యంత్రం, తన ప్రోగ్రామింగ్‌ను కాదని ఒక విద్యార్థినిని ఆలింగనం చేసుకోవడం వెనుక ఉన్న సాంకేతిక లోపాలు ఉన్నాయా? లేదా ఇతర వ్యక్తులు ఈ రోబోను నియంత్రించారా? అన్నదానిపై ప్రపంచం మాట్లాడుకుంటుంది.
చైనాలోని ఒక విశ్వవిద్యాలయంలో సాంకేతిక అద్భుతం కాస్తా ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. నృత్య ప్రదర్శన కోసం శిక్షణ పొందుతున్న ఒక హ్యూమనాయిడ్ రోబో, తన పక్కనే ఉన్న విద్యార్థినిని ఆకస్మికంగా ఆలింగనం చేసుకోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి ఆందోళనకు గురి చేసింది. సాధారణంగా రోబోలు నిర్ణయించిన ‘కోడింగ్’ ప్రకారం మాత్రమే పనిచేస్తాయి. కానీ, ఈ రోబో తన పరిమితులను దాటి ప్రవర్తించడం చూస్తుంటే, ఏఐ వ్యవస్థలు మన నియంత్రణను కోల్పోతున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోబోల సామాజిక ప్రవర్తనపై భద్రతాపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలేం జరిగింది?
ఈ ఘటనపై రోబోను తయారు చేసిన సంస్థ, విశ్వవిద్యాలయ సిబ్బంది ఇచ్చిన వివరణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రదర్శన సమయంలో పెద్ద సంఖ్యలో డ్రోన్లు కూడా పనిచేస్తుండడంతో, వాటి రేడియో తరంగాలు రోబో కంట్రోల్ సిగ్నల్స్ ఇంటర్ఫరెన్స్ (సంకేతాల అంతరాయం) అడ్డుకున్నాయని తెలిపింది. దీనివల్ల రోబో సెన్సార్లు తప్పుడు సంకేతాలను స్వీకరించి అసాధారణంగా స్పందించాయన్నది వారి వాదన. నృత్యంలోని కదలికలను గుర్తించే క్రమంలో, పక్కన ఉన్న మనిషిని వస్తువుగానో లేదంటే తనతో డ్యాన్స్ చేసే భాగస్వామిగానో తప్పుగా గుర్తించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రోబోలోని ‘కంప్యూటర్ విజన్’ వ్యవస్థలో ఏర్పడిన చిన్న తప్పు ఇలాంటి అనూహ్య చర్యకు దారితీసింది అని శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
హ్యూమనాయిడ్ రోబోలతో ముప్పు!
రోబో తయారు చేసిన మొదటి నాళ్లలో పూర్తిగా కోడింగ్ ప్రకారమే పని చేసేవి. రా రావడం.. పో అంటే పోవడం.. ఇలా చేయడం వల్ల ప్రతి విషయం చెప్పలేక.. వివరించలేక ఇబ్బంది కాలిగేది.. దీంతో శాస్త్రవేత్తలు హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేశారు. ఇవి రా అంటే రావడమే కాదు.. యజమాని ఎందుకు పిలిచారని గ్రహించి తదనుగుణంగా పని చేస్తుంది. అంటే సొంతంగా ఆలోచిస్తున్నదన్నమాట. అలా ఆలోచణలో ఏదైనా తప్పు జరిగితే తీవ్రమైన ప్రమాదం ఉంటుంది.
ఏ రోబో అయినా లోహాలతో తయారు చేస్తారు.. అవి మనిషిని ఆత్మీయంగా కౌగిలించుకోవాలని అనుకున్నా కూడా.. వాటి బలం వల్ల అవతలి వ్యక్తికి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఈ ఘటనలో సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల విద్యార్థిని సురక్షితంగా బయటపడింది. రోబోలను ఎవరైనా హ్యాక్ చేసి తమకు కావలసినట్లుగా నియంత్రించే అవకాశం ఉందా? అన్నది మరో పెద్ద ప్రశ్న. చైనా మీడియాలో కూడా దీనిపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది.
చైనాలో జరిగిన ఈ ఘటనతో రోబోలకు 'భావోద్వేగాలు' లేవు, కానీ అవి మనుషులను అనుకరించేలా ప్రోగ్రామ్ చేయబడతాయి. రోబో తనంతట తానుగా ప్రవర్తించిందా లేదంటే ఎవరైనా ప్రాంక్ చేయడానికి దానిని రిమోట్‌తో నియంత్రించారా? అన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. రోబోలు మనుషులతో ఎంత దగ్గరగా ఉండాలి? అవి మనుషులను తాకవచ్చా? అనే అంశాలపై కఠినమైన 'రోబోటిక్ ఎథిక్స్' నిబంధనలు ఉండాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
చైనాలో జరిగిన ఈ ఘటన హెచ్చరిక వంటిది. ఏఐ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, అది చివరకు ఒక ప్రోగ్రామ్ మాత్రమే. సంకేతాల అంతరాయం లేదా చిన్న కోడింగ్ లోపం వల్ల రోబోలు అసాధారణంగా ప్రవర్తించవచ్చు. భవిష్యత్తులో మన ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరకముందే, వాటి భద్రతా వ్యవస్థలను వంద శాతం పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. మనిషిని పోలిన మనిషిని తయారు చేయడం గొప్ప విషయమే కావచ్చు, కానీ అది 'మర మనిషి' అని మర్చిపోతేనే ప్రమాదం. యంత్రాల ప్రవర్తన ఎప్పుడూ మనిషి నియంత్రణలోనే ఉండాలి. అప్పుడే సవ్యమైన విధంగా వాడుకోవచ్చు.
