దేశ అధ్యక్షుడిపై తిరుగుబాటుకు కుట్ర..చైనా సైనికాధికారి అరెస్టు
దీంతో పాటు జాంగ్ యూక్సియా ప్రమోషన్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు, కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్నట్టు, ఆయుధ కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
By: A.N.Kumar | 26 Jan 2026 7:00 PM ISTనెంబర్ వన్ స్థానం నుంచి అమెరికాను నెట్టేసి.. ఆ స్థానంలోకి రావాలని ప్రయత్నిస్తున్న చైనాకు ఇది షాకింగ్ వార్తే. ఎందుకంటే ఆ దేశంలోని అత్యున్నత స్థాయి సైనిక అధికారి.. తమ దేశ రహస్యాలను అమెరికాకు అందించినట్టు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. దీంతో ఈ వార్త చైనాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనరల్ జాంగ్ యూక్సియా.. చైనాలోని సెంట్రల్ మిలిటరీ కమీషన్ చైర్మన్. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అత్యంత ఉన్నత స్థాయి అధికారి. కానీ చైనా అణ్వాయుధ ప్రోగ్రామ్ కు సంబంధించిన కీలక సాంకేతిక డేటాను అమెరికాకు లీక్ చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ లో కథనం వెలువడింది. దీంతో పాటు జాంగ్ యూక్సియా ప్రమోషన్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు, కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్నట్టు, ఆయుధ కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో జాంగ్ యూక్సియాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
జిన్ పింగ్ సన్నిహితుడు..
అధ్యక్షుడు జిన్ పింగ్ కు జాంగ్ యూక్సియా అత్యంత సన్నిహితుడు. జిన్ పింగ్ ప్రభుత్వం పై సైనిక తిరుగుబాటుకు కుట్రపన్నారనే ఆరోపణలు కూడా రావడంతో, జాంగ్ తో పాటు మరికొందరు అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపైన చైనా స్పందించకపోయినప్పటికీ.. అమెరికాలోని చైనా ఎంబసీ అధికారి స్పందించారు. చైనా కమ్యునిస్టు పార్టీ అవినీతి నిర్మూలనకు చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా జాంగ్ యూక్సియా పై దర్యాప్తు సాగుతోందని వివరించారు.
చైనా మిలటరీలో కలవరం..
చైనా చాలా విషయాల్లో అమెరికాతో పోటీ పడుతోంది. అమెరికాను అధిగమించాలని ప్రయత్నిస్తోంది. అందుకే అమెరికా చైనాపై అన్ని రకాల ఆంక్షలు విధించింది. కానీ చైనా ఏమాత్రం తగ్గకుండా అమెరికా వ్యతిరేకులతో చేతులు కలిపింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్ పైన ట్రంప్ ఒత్తిడి తీసుకురావడంతో చైనా తన చమురు కొనుగోలును మరింత పెంచింది. అదే సమయంలో బ్రిక్స్ లో కీలక భూమిక పోషిస్తోంది. ప్రపంచ దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెరికాకు సవాల్ విసురుతోంది. దీంతో చైనాను కట్టడి చేయడానికి అమెరికా వెనుజులాను ఆక్రమించింది. చైనా పేరు చెప్పి గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించే ప్రయత్నం చేసింది. ఇరాన్ చైనాకు చమురు అమ్ముతుందనే అక్కసుతో ఆ దేశ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇవన్నీ కాకుండా ఆ దేశ సైనిక వ్యవస్థలోని అత్యంత ఉన్నత స్థాయి అధికారిని కొనుగోలు చేసినట్టు ఆరోపణలు రావడం.. అమెరికా ఏ స్థాయిలో చైనాను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుందన్న విషయం అర్థమవుతుంది.
అణ్వాయుధ సమాచారం ఎందుకు ?
న్యూక్లియర్ వెపన్స్ విషయంలో చైనా అమెరికా తర్వాతి స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. కాబట్టి చైనా న్యూక్లియర్ వెపన్స్ విషయంలో తమను అధిగమించకూడదన్న ఉద్దేశంతో అమెరికా ఆ దేశ అణ్వాయుధ సమాచారాన్ని రాబట్టి ఉంటుందన్న విశ్లేషణ ఉంది. ప్రపంచంలో ఇప్పుడు అమెరికాకు ధీటుగా నిలబడుతున్న ఏకైక దేశం చైనానే. కాబట్టి చైనాను తగ్గించి.. తమ స్థానం సుస్థిరం చేసుకోవాలన్న ప్రయత్నంలో అమెరికా ఉన్నట్టు కనిపిస్తోంది.
