చైనా సైనిక ఆస్తులలో కీలక అప్ డేట్... ఏమిటీ 'ఫుజియాన్'!
ప్రపంచ వ్యాప్తంగా పేద దేశాలు తిండికోసం, బట్ట కోసం ఆరాటపడుతుంటే.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు మాత్రం వాటి సైనిక సంపత్తిని పెంచుకోవటంపైనే కీలకంగా దృష్టి సారిస్తున్నాయి.
By: Raja Ch | 8 Nov 2025 1:00 AM ISTప్రపంచ వ్యాప్తంగా పేద దేశాలు తిండికోసం, బట్ట కోసం ఆరాటపడుతుంటే.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు మాత్రం వాటి సైనిక సంపత్తిని పెంచుకోవటంపైనే కీలకంగా దృష్టి సారిస్తున్నాయి. ఈ విషయంలో ప్రధానంగా అమెరికా, చైనా, రష్యాలు నిత్యం పోటీ పడుతుంటాయని అంటారు. ఈ క్రమంలో తాజాగా చైనా సైనిక ఆస్తులలో కొత్త శక్తి వచ్చి చేరింది.
అవును... నావికా దళంలో అమెరికాతో పోటీ పడేందుకు చైనా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది. అందులోభాగంగా అత్యంత సామర్థ్యం కలిగిన 'ఫుజియాన్' (టైప్-003) యుద్ధ నౌకను తాజాగా ప్రారంభించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ విమాన వాహన నౌకను చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రారంభించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇందులో భాగంగా... హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో దీనికి సంబంధించిన వేడుకలు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ సందర్భంగా జిన్ పింగ్ యుద్ధ నౌకను పరిశీలించినట్లు తెలిపింది.
ఫుజియాన్ ప్రత్యేకతలివే!:
ఫుజియాన్ చైనాకు చెందిన మూడో అత్యంత అధునాతన యుద్ధ నౌక. విద్యుదయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన "ఎమాల్స్" ను ఇందులో వినియోగించారు. 316 మీటర్ల పొడవు, 80వేల టన్నుల బరువు ఉన్న ఈ ఫుజియాన్ కు సుమారు 50 విమానాలను మోసే సామర్థ్యం ఉంది. దీనిపై నుంచి జెట్ లు వేగంగా, సురక్షితంగా టేకాఫ్ అవ్వగలుగుతాయి.
వాస్తవానికి అక్టోబర్ లోనే జెట్ లు జే-15టీ, జే-35, కాంగ్ జింగ్-600 వంటి వ్యవస్థను ఉపయోగించి తమ మొదటి ప్రయోగాలు, ల్యాండింగ్ లను పూర్తి చేశాయి. ఇదే క్రమంలో ఈ నౌక 100 రోజులకు పైగా సముద్ర పరీక్షలను పూర్తి చేసింది.
"ఎమాల్స్" అంటే ఏమిటి?:
ఎమాల్స్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్.. సాంప్రదాయ ఆవిరి కాటపుల్ట్ లకు బదులుగా విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి యుద్ధ విమానాలను విమాన వాహక నౌకల నుండి టేకాఫ్ చేయడానికి సహాయపడే సాంకేతికత. ఇది జెట్ లను మరింత త్వరగా, సురక్షితంగా, సమర్ధవంతంగా ప్రయోగించడానికి అనుమతిస్తుంది.
ఈ నేపథ్యంలో ఫుజియాన్ తో చైనా తన విమాన వాహక నౌకలను హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో మోహరించవచ్చని అంటున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతాలలో ఇప్పటికే బలమైన నావికాదళ ఉనికి ఉంది.
అమెరికాను అధిగమించిన చైనా!:
ఈ ఎమాల్స్ వ్యవస్థను అమెరికాకు చెందిన ‘గెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ శ్రేణి విమాన వాహన నౌక మాత్రమే వాడుతుంది. అయితే.. మరో విమాన వాహక నౌకను నిర్మించేందుకు చైనా సన్నాహాలు మొదలుపెట్టింది! ఇది టైప్-004గా ఇది రానుందని అంటున్నారు.
ఇదే సమయంలో.. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం చైనా ఇప్పుడు 234 యుద్ధనౌకలను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నావికాదళంగా మారింది. ఈ క్రమంలో... 219 నౌకలను కలిగి ఉన్న యుఎస్ నావికాదళాన్ని డ్రాగన్ అధిగమించింది!
