Begin typing your search above and press return to search.

చైనా కోసం పాకిస్థాన్ గాడిదల వ్యాపారం.. అగ్రిమెంట్ ఇదే!

ఈ ప్రాజెక్ట్ కింద.. మొదటి 3 నుండి 5 సంవత్సరాల వరకు సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంది.

By:  Raja Ch   |   30 Sept 2025 4:00 AM IST
చైనా కోసం పాకిస్థాన్  గాడిదల వ్యాపారం..  అగ్రిమెంట్  ఇదే!
X

తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ కు చైనా సరికొత్త అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా... తమ కోసం గాడిదలను పెంచే పని అప్పగించింది. దీనికోసం చైనాకు చెందిన ఓ కంపెనీ పెట్టుబడులతో పెషావర్‌ లో 37 మిలియన్ డాలర్లతో భారీ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా ఏటా 80 వేల గాడిదలను చైనాకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.

అవును... చైనా కోసం పాకిస్థాన్ గాడిదలను పెంచే సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆహార భద్రతా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఏటా 80,000 గాడిదలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న చైనా కంపెనీ పెట్టుబడితో దేశవ్యాప్తంగా 40 ఆధునిక పొలాలు స్థాపించబడతాయని చెబుతున్నారు. దీనివల్ల చాలా మందికి ఉపాధి లభించనుంది.

ఈ ప్రాజెక్ట్ కింద.. మొదటి 3 నుండి 5 సంవత్సరాల వరకు సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రతి నెలా 10,000 గాడిదల మాంసం చైనాకు ఎగుమతి చేయవలసి ఉంటుంది. దీనికోసం పెషావర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గాడిదల పెంపకానికి ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి చైనాలో గాడిద మాంసానికి, ఎముకలకు మంచి డిమాండ్ ఉంటుందట. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు చేయాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్ ఆహార భద్రత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే స్థానికంగా మాత్రం గాడిద మాంసం అమ్మకాలపై నిషేధం ఉంటుందని అంటున్నారు.