Begin typing your search above and press return to search.

ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్ కాదు.. చైనా చేతిలో అంతకు మించిన అద్భుతం!

అవును... చైనా క్షిపణి రక్షణ వ్యవస్థలో అంతరిక్షం, సముద్రంతో పాటు గాలిలోనూ, నేలపైనా రకరకాల సెన్సర్లు ఉంటాయి.

By:  Raja Ch   |   15 Oct 2025 11:42 AM IST
ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్ కాదు.. చైనా చేతిలో అంతకు మించిన అద్భుతం!
X

ఇటీవల కాలంలో పలు సరిహద్దు దేశాల మధ్య ఉద్రిక్తతలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో దాదాపు అన్ని దేశాలు ప్రధానంగా వాటి వాటి ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగా... సరికొత్త క్షిపణులను తయారు చేసుకోవడంతో పాటు అత్యధుతమైన క్షిపణి రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో చైనా ఊహించని స్థాయిలో పెద్ద అడుగు వేసిందని తెలుస్తోంది.

అవును... చైనా క్షిపణి రక్షణ వ్యవస్థలో అంతరిక్షం, సముద్రంతో పాటు గాలిలోనూ, నేలపైనా రకరకాల సెన్సర్లు ఉంటాయి. ఇలా వేలాది సెన్సర్ల నుంచి అందే డేటాను అతి తక్కువ సమయంలోనే కలగలిపి ఒక సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరించాలి! ఈ క్రమంలో... డేటా ప్రాసెసింగ్‌ టెక్నాలజీలో తాము వేసిన ముందడుగు వల్ల ఈ అవరోధాన్ని అధిగమించగలిగామని, ఆ సవాల్ ను సాధించామని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గగనతల కవచం పేరు 'డిస్ట్రిబ్యూటెడ్‌ ఎర్లీ వార్నింగ్‌ డిటెక్షన్‌ బిగ్‌ డేటా ఫ్లాట్‌ ఫామ్‌'.

వివరాళ్లోకి వెళ్తే... ఇజ్రాయెల్‌ 'ఐరన్‌ డోమ్‌' పెర్ఫార్మెన్స్ ను ఇటీవల ప్రపంచం చూసిన సంగతి తెలిసిదే, ఇదే సమయంలో అంతకన్నా శక్తిమంతమైనదిగా చెబుతున్న అమెరికా 'గోల్డెన్‌ డోమ్‌' ప్రతిపాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికీ మించి, న భూతో న భవిష్యతీ అన్నట్లుగా మరో క్షిపణి రక్షణ వ్యవస్థను చైనా సిద్ధం చేస్తోంది. ఇది.. ప్రపంచంలోని ఏ మూలలోంచి క్షిపణిని ప్రయోగించినా ఇట్టే పసిగట్టి, తుత్తునియలు చేసేయగలిగినంత శక్తివంతమైనదని చెబుతున్నారు.

'సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌' పత్రిక కథనం ప్రకారం... ఈ కొత్త రక్షణ వ్యవథ ఏకంగా వెయ్యి క్షిపణులు చైనా పైకి దూసుకొచ్చినా వాటిని అత్యంత సమర్థంగా నిలువరించగలదు! దీంతో... యుద్ధరంగంలో ఇదో బిగ్ టర్నింగ్ పాయింట్ కానుందని చైనా రక్షణరంగ నిపుణుల విశ్లేషిస్తున్నారు. ఏకకాలంలో ప్రపంచం మొత్తంపై కన్నేసి ఉంచే మొట్టమొదటి క్షిపణి రక్షణ కవచం ఇదేనని చైనా పరిశోధకులు తెలిపినట్లు స్థానిక మీడియా వివరించింది.

వాస్తవానికి ప్రత్యర్థి ప్రయోగించే ఖండాంతర క్షిపణులు, ధ్వనితో పోలిస్తే 20 రెట్లు వేగంతో ప్రయాణిస్తాయి. అందువల్ల వాటిని గుర్తించి, అడ్డగించడానికి స్వల్ప సమయం మాత్రమే ఉంటుంది. దీనికోసం వందలాది ఉపగ్రహాలతో పాటు సముద్రంలోనూ, నేలపైనా, గాల్లోనూ వేలాది సెన్సర్లను ఏర్పాటు చేయాలి. అయితే తమ టెక్నాలజీలో తాము వేసిన ముందడుగు వల్ల ఈ సవాళ్లు సుసాధ్యం అయ్యాయని చైనా శాస్త్రవేత్తలు చెప్పినట్లు తెలుస్తోంది!

ఈ వ్యవస్థను నాన్జింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సహాయంతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీ.ఎల్.ఏ) నిర్మించి పరీక్షించింది. ఇది చైనాలో రక్షణ ఎలక్ట్రానిక్స్‌ కు అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఈ వ్యవస్థ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రవేశపెట్టిన యునైటెడ్ స్టేట్స్ "గోల్డెన్ డోమ్" ను మించి ఉంటుందని అంటున్నారు.

కాగా... మే 2025న ట్రంప్ 'గోల్డెన్ డోమ్' అని పిలువబడే $175 బిలియన్ల రక్షణ ప్రణాళికను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దీనికి నాలుగు పొరల రక్షణ ఉందని.. ఒకటి అంతరిక్షంలో, మూడు భూమిపై రక్షణ పొరలు ఉన్నాయని.. అమెరికా, అలాస్కా, హవాయి అంతటా రక్షణ బ్యాటరీలు ఉంచబడ్డాయి!