ప్రపంచానికి చైనా ‘గోల్డ్’ షాక్... తెరపైకి రూ.7 లక్షల కోట్ల వ్యవహారం!
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 30 July 2025 4:00 PM ISTగత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో 10 గ్రాముల పసిడి ధర లక్ష రూపాయలకు చేరువవుతోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చైనా నుంచి మరో షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదే జరిగితే పసిడి ధర నియంత్రణ మొత్తం చైనా చేతుల్లోకి వెళ్లిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అవును... చైనాకు సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగా... చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వను కనుగొన్నట్లు తెలిపింది. ఈ సమయంలో అంతా అనుకూలంగా జరిగితే.. పసిడి ధరను చైనానే డిసైడ్ చేసే రోజులు రాబోతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్..!
చైనాలోని హునాన్ ప్రావిన్స్ లోని పింగ్జియాంగ్ కౌంటీలో సుమారు 1,000 మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇది కూడా అత్యధిక నాణ్యత కలిగినదని తెలిపింది. దీని విలువ.. సుమారు 83 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.7 లక్షల కోట్లు) ఉండొచ్చని వెల్లడించింది.
ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ లో అత్యధికంగా 900 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు గుర్తించారు. దీంతో... ఇప్పటి వరకు ప్రపంచంలో కనుగొనబడిన అత్యంత భారీ బంగారు నిల్వగా దీనికి పేరుంది. అయితే... తాజాగా ఆ రికార్డును చైనా అధిగమించింది. ఈ నిక్షేపాలను హునాన్ జియోలాజికల్ బ్యూరోకు చెందిన శాస్త్రవేత్తల బృందం కనుగొంది.
వాస్తవానికి శాస్త్రవేత్తలు 2 కిలోమీటర్ల లోతులో బంగారు అవశేషాలను గుర్తించగా.. అక్కడ సుమారు 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని అంచనా వేశారు. అయితే ఆధునిక 3డీ మోడలింగ్ ఆధారంగా మరో 3 కిలోమీటర్ల లోతులో అధిక మొత్తంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అక్కడ ప్రతి మెట్రిక్ టన్నులో సగటున 138 గ్రాముల బంగారం ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా... చైనా ఇప్పటికే ప్రపంచ పసిడి మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో 2 వేల మెట్రిక్ టన్నులకు పైగా బంగారు నిల్వలు ఉన్నట్టు చెబుతారు. ఈ క్రమంలో ప్రపంచ బంగారు ఉత్పత్తిలో సుమారు 10 శాతం వాటాను ఆ దేశం కలిగి ఉంది. ఇక.. తాజాగా కనుగొన్న నిల్వలతో బంగారం మార్కెట్ మీద చైనా ప్రభావం భారీగా ఉండోచ్చని అంటున్నారు.
