వీడియోలు తీస్తే రూ.8.5 లక్షల జీతం.. ఇదేం ఉద్యోగం రా సామీ..
అయితే ఈ ఉద్యోగంలో కూడా ఒక పెద్ద సవాలు ఉందండోయ్.. పర్వతం మీద వాతావరణం క్షణాల్లో మారిపోతుందట. ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడం..
By: A.N.Kumar | 22 Aug 2026 11:58 AM ISTమనదేశంలో ప్రతీ సోమవారం పొద్దున్నే లేచి "ఛా.. మళ్లీ ఆఫీస్‌కు వెళ్లాలా?" అని నెత్తి కొట్టుకుంటూ ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుని హెచ్‌ఆర్‌కు పిచ్చి పిచ్చి సాకులు చెప్పే కార్పొరేట్ దాసులకు ఈ వార్త చెంపపెట్టు లాంటిది. మనం ఇక్కడ తొమ్మిది గంటల పాటు బాస్‌ల తిట్లు తింటూ కాఫీలు తాగుతూ సీవీలు అప్‌డేట్ చేస్తుంటే.. చైనాలో ఒక కుర్రాడు మాత్రం కేవలం ఆకాశంలో వెళ్లే మేఘాలను చూస్తూ వాటిని ఫోన్‌లో షూట్ చేస్తూ నెలకు రూ. 8.5 లక్షలు (60 వేల యువాన్లు) జేబులో వేసేసుకుంటున్నాడు. అవును మీరు విన్నది నిజమే.. మన కలల ఉద్యోగం నిజంగానే ఉనికిలో ఉంది.
చైనాలోని ప్రముఖ 'లావోజున్ మౌంటైన్' టూరిజం సంస్థ ‘క్లౌడ్ స్కేప్ అబ్జర్వర్’ అంటే మన భాషలో 'మేఘాల కాపలాదారు' అనే ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇస్తే ఏకంగా 3,500 మంది "మమ్మల్ని దయామయులై ఆదుకోండి" అంటూ అప్లై చేశారు. అందులో అదృష్టం వరించి 23 ఏళ్ల లి సించెన్ అనే కుర్రాడికి ఈ జాబ్ దక్కింది.
ఏం చేయాలి ఈ ఉద్యోగంలో?
ఏముంది.. ప్రశాంతంగా పర్వతం ఎక్కి నిలబడాలి. ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు మేఘాలు ఏ వైపు తిరుగుతున్నాయో వాటి ఆకారాలు ఎటు మారుతున్నాయో కెమెరాలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలి. బాస్ డెడ్‌లైన్లు లేవు.. జూమ్ కాల్స్ అసలే లేవు, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ల గొడవే లేదు. ఏడాదికి దాదాపు రూ. 1 కోటి జీతం. ఈ విషయం తెలిసాక, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమ కోడింగ్ బుక్స్ పక్కన పడేసి లైట్ హౌస్ పక్కన నిలబడే ఉద్యోగాలు ఎక్కడున్నాయో గూగుల్‌లో వెతుక్కుంటున్నారు.
సవాలు ఏంటో తెలుసా?
అయితే ఈ ఉద్యోగంలో కూడా ఒక పెద్ద సవాలు ఉందండోయ్.. పర్వతం మీద వాతావరణం క్షణాల్లో మారిపోతుందట. ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడం.. వర్షం పడటం లేదా పొగమంచు కమ్మేయడం జరుగుతుందట. అంటే.. గాలి వస్తే గొడుగు పట్టుకుని కెమెరా సరిగ్గా పట్టుకోవడమే అక్కడ పెద్ద 'టెక్నికల్ చాలెంజ్' అన్నమాట.. ఆఫీస్‌లో క్లయింట్ ఇచ్చే టాస్క్‌లతో పోలిస్తే ఈ మేఘాల సవాలు ఎంత ముద్దుగా ఉందో కదూ?
ఏది ఏమైనా "రోజంతా ఆకాశం వైపు చూస్తూ ఖాళీగా తిరుగుతున్నావు" అని ఇంట్లో తిట్టే తల్లిదండ్రులకు ఈ చైనా కుర్రాడి వార్త చూపించి "నేను ఖాళీగా లేను.. ఇంటర్నేషనల్ క్లౌడ్ అబ్జర్వర్ జాబ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా" అని చెప్పే ధైర్యాన్ని ఈ వార్త అందరికీ ఇచ్చింది.
