Begin typing your search above and press return to search.

అమెరికా దాడి చేస్తే ప్రతిదాడే.. చైనా సిద్ధమవుతోంది..

అమెరికా నుంచి వచ్చే ఏదైనా సైనిక దాడిని ఎదుర్కొనేందుకు చైనా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోందా? తాజాగా సోషల్ మీడియా అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న కథనాలు ఈ ప్రశ్నలకు బలం చేకూర్చుతున్నాయి.

By:  A.N.Kumar   |   12 Jan 2026 7:34 PM IST
అమెరికా దాడి చేస్తే ప్రతిదాడే.. చైనా సిద్ధమవుతోంది..
X

అమెరికా నుంచి వచ్చే ఏదైనా సైనిక దాడిని ఎదుర్కొనేందుకు చైనా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోందా? తాజాగా సోషల్ మీడియా అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న కథనాలు ఈ ప్రశ్నలకు బలం చేకూర్చుతున్నాయి. సాధారణ కార్గో నౌకలకే డ్రోన్లు, క్షిపణి లాంచర్లు అమర్చి వాటిని ఆయుధ నౌకలుగా మార్చే దిశగా చైనా అడుగులు వేస్తోందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

జోంగ్డా 79 నౌకపై అనుమానాలు

మారిటైమ్ ట్రాకర్ సైట్ల సమాచారం ప్రకారం జోంగ్డా 79 అనే కార్గో షిప్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ హెలికాప్టర్ కనిపించింది. ఇది సాధారణ వాణిజ్య నౌక వద్ద సైనిక హెలికాప్టర్ కనిపించడం అరుదైన విషయం. దీంతో ఈ నౌకను క్షిపణులు ప్రయోగించే ఆయుధ నౌకగా చైనా మార్చుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

డ్రోన్లు, క్షిపణుల లాంచింగ్‌కు సన్నాహాలు

ఈ కార్గో నౌకపై మాడ్యులార్ ఎలక్ట్రోమాగ్నటిక్ క్యాటపల్ట్ సిస్టమ్‌ను అమర్చినట్టు కథనాలు చెబుతున్నాయి. దీనిని ఫైటర్ డ్రోన్లను లాంచ్ చేయడానికి ఉపయోగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు రాడార్ వ్యవస్థలు, ఇతర లాంచింగ్ మాడ్యూళ్లు కూడా నౌకపై కనిపించడంతో ఇది పూర్తిస్థాయి ఆయుధ నౌకగా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తైవాన్ చుట్టూ ఉద్రిక్తతల నడుమ

ఇటీవల తైవాన్ చుట్టూ చైనా భారీగా నౌకాదళ వైమానిక విన్యాసాలు చేపట్టిన సంగతి తెలిసిందే. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను పెద్ద సంఖ్యలో మోహరించి శక్తి ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో కార్గో నౌకల సైనికీకరణపై వార్తలు రావడం ప్రాంతీయ భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోంది.

చైనా–అమెరికా నౌకాదళాల పోటీ

మీడియా కథనాల ప్రకారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళంగా అవతరించింది. చైనా వద్ద ప్రస్తుతం 370కి పైగా యుద్ధ నౌకలు ఉండగా.. అమెరికా వద్ద సుమారు 290 మాత్రమే ఉన్నాయి. సాంకేతికంగా ఇంకా అమెరికాకే ఆధిక్యం ఉన్నప్పటికీ ఆ అంతరాన్ని తగ్గించే దిశగా చైనా వేగంగా విస్తరిస్తోంది.

4000 వాణిజ్య నౌకలే బలంగా?

చైనా వద్ద సుమారు 4000 వాణిజ్య నౌకలు ఉన్నాయి. వీటిని అవసరమైతే తక్కువ సమయంలోనే యుద్ధ నౌకల తరహాలోకి మార్చే సామర్థ్యం ఉండటం విశేషం. ఇదే జరిగితే యుద్ధ సమయంలో చైనా అకస్మాత్తుగా భారీ నౌకాదళాన్ని రంగంలోకి దించే అవకాశం ఉందని రక్షణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

భవిష్యత్తులో ఏమవుతుంది?

కార్గో నౌకల సైనికీకరణ నిజమైతే ఇది సముద్ర యుద్ధాల్లో కొత్త అధ్యాయానికి నాంది కావొచ్చు. సంప్రదాయ యుద్ధ నౌకలతో పాటు వాణిజ్య నౌకలే ఆయుధ వేదికలుగా మారితే అంతర్జాతీయ సముద్ర భద్రత, వాణిజ్య రవాణాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం.

మొత్తంగా చూస్తే… అమెరికా దాడి జరిగితే వెంటనే ప్రతిదాడి చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే చైనా లక్ష్యమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం మొత్తం ఇప్పుడు చైనా అడుగులను ఆసక్తిగా పరిశీలిస్తోంది.