Begin typing your search above and press return to search.

చైనా-బంగ్లాదేశ్ ఒప్పందం.. భారత్‌కు కొత్త వ్యూహాత్మక సవాల్!

భారత్‌కు అత్యంత కీలకమైన, సున్నితమైన సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో చైనా తన ఉనికిని చాటుకోవడం న్యూఢిల్లీ భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

By:  A.N.Kumar   |   27 Jun 2026 12:46 PM IST
చైనా-బంగ్లాదేశ్ ఒప్పందం.. భారత్‌కు కొత్త వ్యూహాత్మక సవాల్!
X

దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో వ్యూహాత్మక చదరంగం సరికొత్త మలుపు తిరిగింది. బంగ్లాదేశ్, చైనాల మధ్య తాజాగా కుదిరిన ఎకనమిక్ కారిడార్ ఒప్పందం కేవలం ఒక వాణిజ్య భాగస్వామ్యం మాత్రమే కాదు.. ఇది ఉపఖండంలో ప్రాంతీయ భద్రతా సమీకరణాలను వేగంగా మార్చేసే పరిణామం. భారత్‌కు అత్యంత కీలకమైన, సున్నితమైన సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో చైనా తన ఉనికిని చాటుకోవడం న్యూఢిల్లీ భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

వెనకడుగు వేసిన భారత్.. అందిపుచ్చుకున్న చైనా

భారత సరిహద్దుకు, ముఖ్యంగా కోల్‌కతాకు కేవలం 188 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక మొంగ్లా ఓడరేవు అభివృద్ధికి 2015లోనే భారత్-బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే మన అధికార యంత్రాంగంలో ఉండే జాప్యం, క్షేత్రస్థాయిలో పనుల మందగమనం వల్ల ఈ ప్రాజెక్టు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. 2025లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం భారత్‌కు పెద్ద దౌత్యపరమైన ఎదురుదెబ్బ. సరిగ్గా ఇదే అవకాశాన్ని చైనా అందిపుచ్చుకుంది. భారత్ వదిలేసిన స్థానాన్ని చైనా తన పెట్టుబడులతో భర్తీ చేయడం బీజింగ్ చాణక్య నీతికి నిదర్శనం.

'స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్' వ్యూహం మరింత బలోపేతం

చైనా తన ప్రతిష్టాత్మక 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్' లో భాగంగా భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాన్ని చాలా కాలంగా అమలు చేస్తోంది. పాకిస్థాన్‌లో గ్వాదర్, శ్రీలంకలో హంబన్‌టోటా, మయన్మార్‌లో క్యౌక్‌ప్యూ ఓడరేవులను ఇప్పటికే తన గుప్పిట్లోకి తీసుకున్న చైనా.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని మొంగ్లా ప్రాంతంలో అడుగుపెట్టింది. దీనివల్ల బంగాళాఖాతంలో చైనా నౌకాదళం లేదా నిఘా వ్యవస్థల ఉనికి గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఇది కేవలం ఆర్థిక, పారిశ్రామిక కారిడార్ అని బంగ్లాదేశ్ చెప్తున్నప్పటికీ, భవిష్యత్తులో చైనా ఇక్కడ "ద్వంద్వ వినియోగ" మౌలిక వసతులను ఏర్పాటు చేసే ముప్పు ఉంది.

ఇలాంటి సాంకేతిక నిఘా వ్యవస్థలు ఏర్పాటైతే, భారత తూర్పు తీరంలోని నౌకాదళ కదలికలు, రక్షణ క్షిపణి పరీక్షలు, వాణిజ్య మార్గాలపై చైనా సులభంగా కన్నేయగలదు. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెద్ద సవాల్.

భారత్ మున్ముందు ఏం చేయాలి?

బంగ్లాదేశ్ తన ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టామని సమర్థించుకోవచ్చు. కానీ శ్రీలంక వంటి దేశాలు చైనా అప్పుల ఉచ్చులో పడి తమ సార్వభౌమత్వాన్ని ఎలా ప్రమాదంలో పడేసుకున్నాయో చరిత్ర చెప్తోంది.

ఇప్పటికైనా భారత్ తన పొరుగు దేశాలతో ఉన్న దౌత్య సంబంధాలను, ప్రాజెక్టుల అమలు వేగాన్ని పునఃసమీక్షించుకోవాలి. కేవలం నిరసనలు తెలపడం సరిపోదు.. పొరుగు దేశాలకు చైనా కంటే నమ్మకమైన, వేగవంతమైన ఆర్థిక, భద్రతా ప్రత్యామ్నాయాలను భారత్ చూపించగలిగినప్పుడే బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని, భద్రతను కాపాడుకోగలదు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో చైనా అడుగులను భారత్ ఎంత వ్యూహాత్మకంగా అడ్డుకుంటుందనే దానిపైనే మన తూర్పు తీర భద్రత ఆధారపడి ఉంటుంది.