Begin typing your search above and press return to search.

బుద్దిపోనిచ్చుకోని చైనా.. పాక్ కు ఆహ్వానం.. మోడీకి లేదు

జపాన్‌పై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ చైనా ప్రతీ ఏటా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి మరింత ఆర్భాటంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

By:  A.N.Kumar   |   28 Aug 2025 6:20 PM IST
బుద్దిపోనిచ్చుకోని చైనా.. పాక్ కు ఆహ్వానం.. మోడీకి లేదు
X

బీజింగ్‌లో జరగనున్న చైనా 80వ విక్టరీ పరేడ్ చుట్టూ ఇప్పటికే రాజకీయ చర్చలు రగులుతున్నాయి. జపాన్‌పై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ చైనా ప్రతీ ఏటా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి మరింత ఆర్భాటంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 3, 2025న జరిగే ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా ఆహ్వాన పత్రాలు పంపించారు.

* పాక్ ప్రధానికి ఆహ్వానం.. భారత్‌కు నిరాకరణ

చైనా ఆహ్వానించిన 26 దేశాధినేతల జాబితాలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రత్యేకంగా ప్రస్తావన పొందారు. అంతేకాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తదితర నేతలు కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. అయితే ఆశ్చర్యకరంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందలేదు. దీంతో ఈ ఘన వేడుకలో భారత్ ప్రాతినిధ్యం ఉండకపోవడం ఖాయమైంది.

- SCO సదస్సుకు మోదీ హాజరు

ఇదే సమయంలో అదే వారం చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే ఈ సమావేశం SCO చరిత్రలోనే అతిపెద్దదిగా ఉండనుందని చైనా ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా 20 దేశాల నేతలు ఈ సదస్సులో హాజరవుతారు.

- భారత్–చైనా సంబంధాల నేపథ్యం

గత కొన్ని ఏళ్లుగా భారత్–చైనా సంబంధాలు గట్టిగా పరీక్షకు గురవుతున్నాయి. 2018లో మోదీ చివరిసారి చైనాను సందర్శించారు. ఆ తర్వాత జిన్‌పింగ్ భారత్‌ పర్యటించారు. కానీ 2020లో లద్దాఖ్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

- అమెరికా సుంకాలతో కొత్త మలుపు

ఇక మరోవైపు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం కూడా చర్చనీయాంశమైంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని కారణంగా భారత్ వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించారు. ఆగస్టు 27 నుంచి అమలులోకి వచ్చిన ఈ నిర్ణయం, భారత్ నుంచి అమెరికాకు జరిగే 48 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం చూపనుంది.

- రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సమీకరణలు

ఈ పరిణామాల నేపథ్యంలో చైనాలో జరగనున్న SCO సమావేశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. అమెరికా వైఖరిపై పలు దేశాలు వ్యతిరేకంగా స్పందించే అవకాశముంది. చైనా–పాక్ సాన్నిహిత్యం, భారత్‌కు ఎదురవుతున్న ఆర్థిక–దౌత్యపరమైన సవాళ్లు రాబోయే కాలంలో అంతర్జాతీయ రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపనివి కావు.

మొత్తం మీద చైనా విక్టరీ పరేడ్‌లో పాక్ ప్రధానికి ఆహ్వానం ఇవ్వడం, మోదీని పక్కన పెట్టడం వెనుక ఉన్న రాజకీయ సంకేతాలపై ప్రపంచ దృష్టి పడింది.