Begin typing your search above and press return to search.

పసితనంలో కసాయితనం...ఎవరిదీ పాపం ?

ఈ విధంగా ఆలోచిస్తే వ్యక్తులను తీర్చిదిద్దాల్సింది కుటుంబాలు, ఆ కుటుంబాలను మంచి మార్గంలో ఉంచేలా చూడాల్సింది సమాజంలోని వాతావరణం.

By:  Satya P   |   23 Aug 2025 8:57 AM IST
పసితనంలో కసాయితనం...ఎవరిదీ పాపం ?
X

సమాజం అన్నది కుటుంబాల సమూహం. కుటుంబాలు వ్యక్తుల సమూహం. ఈ విధంగా ఆలోచిస్తే వ్యక్తులను తీర్చిదిద్దాల్సింది కుటుంబాలు, ఆ కుటుంబాలను మంచి మార్గంలో ఉంచేలా చూడాల్సింది సమాజంలోని వాతావరణం. ఇలా ఒకదానికి ఒకటి అల్లుకుని సాగే ఈ అందమైన జీవన స్రవంతిలో ఎక్కడో అపశృతి చోటు చేసుకుంటోంది. అది ఈనాడు కాదు చాలా కాలంగా మెల్లగా మొదలై ఈ రోజు సమాజంలో అశాంతిని రాజేస్తోంది. ఫలితంగా కుటుంబాలు దెబ్బ తింటున్నాయి. వ్యక్తులు వినాశనం వైపుగా మళ్ళుతున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి వైపుగా సాగుతోంది.

పాశ్చాత్య ధోరణి అంటూ :

మనది కాని నాగరికత పాశ్చాత్య ధోరణి అంటూ గతంలో విమర్శలు ఉండేవి. అక్కడ చిన్న పిల్లవాడి చేతిలో తుపాకీ ఉంటుంది. అలా హింసా ప్రవృత్తి అక్కడ ఎక్కువ అని అనుకునేవారు. మనది చల్లని దేశం, శాంతియుత సమాజం అని గర్వించేవారు. దీపావళి తుపాకులు తప్పించి ఇక్కడ పెద్దలకు సైతం ఏమీ తెలియదని ఆనందించేవారు. కానీ కాలం మారింది అని కళ్ళ ముందు కనిపిస్తున్న సంఘటనలు తెలియచేస్తున్నాయి. కత్తులతో పసివాళ్ళు కరాళ నృత్యం చేస్తున్న దృశ్యాలు సైతం కకావికలం చేస్తున్నాయి. పసి వాళ్ళు అంతకా కసివాళ్ళుగా కసాయి వాళ్ళుగా ఎలా మారుతున్నారు అన్నదే ఇపుడు మేధావుల నుంచి అందరినీ దొలిచేస్తున్న ప్రశ్న.

జవాబు అందరికీ తెలుసు :

సమాజం ఎటు పోతోందో అని ప్రతీ వారూ నోరు విప్పితే గోడు పెడుతూంటారు. కానీ అందరికీ తెలిసిన విషయమే. దేవతా వస్త్రాల కధలా అంతా ఒకే మాట కూడబలుక్కుని అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా భ్రమించే కాలం కూడా కాదు ఇది. అంతకంటే ఎవరికీ అర్ధం కాని బ్రహ్మ పదార్థం అయితే కాదు. ప్రతీ వారికీ తెలుసు. ఏమి జరుగుతోందో కూడా ఇంకా బాగా తెలుసు. సమాజానికి తొలి యూనిట్ కుటుంబం అనుకుంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో ఈ రోజున ఆలోచిస్తే ఎవరైనా ఘొల్లున గోల పెట్టాల్సిందే.

ప్రపంచం చేతిలోకి :

ఈ రోజు పసివాడు గుక్కపెడితే చేతిలో స్మార్ట్ ఫోన్ పెడుతున్నారు. ఆ మాత్రం మాట నడక వస్తే చాలు స్మార్ట్ ఫోన్ కోసం అల్లరి చేసే చిన్నారులను పెంచుతున్న సమాజంలో అంతా ఉన్నారు. ఇక స్మార్ట్ ఫోన్ అంటేనే ప్రపంచం చేతిలో ఉన్నట్లు. అందులో మంచి చెడ్డా అంతా పుష్కలంగా ఉంటుంది. పెద్దలకు అయితే వివేచన విచక్షణ ఉంటుంది ఏది చూడాలి ఏది చూడకూడదు అన్న అవగాహన వారికి ఉంటుంది. కానీ కల్లా కపటం తెలియని పిల్లలకు ఏమి తెలుసు వారి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ అనేది అణు బాంబు కంటే అత్యంత ప్రమాదం అని అది వారి భవితనే కాదు కుటుంబాలను సమాజాన్ని భస్మీపటలం చేస్తుందని ఏమి తెలుసు. అందుకే స్మార్ట్ ఫోను వ్యసనానికి పసి హృదయాలు బానిసలుగా మారుతున్నాయి. వాటిలో చెడు ఎక్కువగా ఆకర్షిస్తూండడంతో సమాజం మీదనే తమ ప్రయఒగాలను చేస్తున్నాయి.

హంతకుడుగా మారిన బాలుడు :

ముక్కు పచ్చలారలేదు. కానీ ఘోరం చేశాడు. సాటి చిన్నారి ప్రాణం తీశాడు. లెక్క పెట్టి మరీ 20 దాకా కత్తి పోట్లు కసిగా పొడిచాడు. ఆ బాలిక చనిపోయిందని నిర్ధారించుకునేంతవరకూ కత్తికి పనిచెబుతూ ఉన్నాడంటే కరడు కట్టిన నేరస్తుడు మీసాలు కూడా రాని ఆ కుర్రాడిలో ఎలా చొరపడ్డాడు అన్నదే అంతా ఆలోచించాలిన విషయం. హైదరాబాద్‌‌లోని కూకట్‌పల్లి, సంగీత్ నగర్‌లో సంచలనం సృష్టించిన పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించడంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ దారుణ మారణ కాండను పదవ తరగతి చదువుతున్న బాలుడు చేశాడని సహస్ర అనే బాలికను దారుణంగా హత్య చేశాడని చెబుతున్నారు.

దొంగతనం హత్య అన్నీ ట్రైనింగ్ :

దొంగతనం ఎలా చేయాలి, అడ్డు వస్తే హత్య ఎలా చేయాలి అంతా ట్రైనింగ్ అయ్యాడు ఆ బాలుడు. దానికి సాధనాలుగా ఏవి మారి ఉంటాయో వేరేగా చెప్పాల్సినది లేదు. చేతిలో ఫోన్ చాలు అన్ని విషయాలు చెబుతుంది. అలా సమాచారం అంతా ఒకటికి పదిమార్లు మననం చేసుకుని ఈ ఘాతుకం చేశాడు ఆ బాలుడు. విషాదం ఏమిటి అంటే ముక్కు పచ్చలారని సహస్ర మరణించింది మరో ముక్కుపచ్చలారని బాలుడు హంతకుడు అయ్యాడు. ఇలా అందమైన బాల్యం ఇంతలా క్రూరత్వానికి గురి కావడం అంటే కారకులు ఎవరో ఆలోచించాలి.

బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నారు :

సంపాదన మోజులో పడడమో లేక తమ గురించే ఎక్కువ ఆలోచిస్తూ బిడ్డలను నిర్లక్ష్యం చేస్తున్నారు తల్లిదండ్రులు. అంతే కాదు వారి బాగోగులు పట్టించుకోకుండా వారికి డబ్బులు ఇస్తూ చేతికి ఫోన్లు ఇస్తూ వీరే పెంచుతున్నారు. అలా పిల్లలను గాలికి వదిలేసిన పాపానికి ఫలితమే ఇలా ఉంటుందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తూ పోతే మాత్రం సమాజంలో ఎవరికీ రక్షణ ఉండదు. ఆఖరుకు ఇంట్లో డబ్బులు ఇవ్వలేదనో కూర నచ్చలేదనో కన్న వారిని సైతం హత్య చేసే పసితనం కూడా బయల్దేరుతుంది. తస్మాత్ జాగ్రత్త