అప్పట్లో క్లాస్ మేట్స్ కట్ చేస్తే.. ఈసారి అనూహ్య రీతిలో కలిశారు
రీల్ కు మించిన రియల్ సీన్లు కొన్ని అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే.
By: Garuda Media | 24 Nov 2025 12:00 PM ISTరీల్ కు మించిన రియల్ సీన్లు కొన్ని అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. క్లాస్ మేట్స్ గా ఉంటూ.. లైఫ్ లోని లక్ష్యాలు సాధించేందుకు ఎవరి దారి వారు చూసుకోవటం ఎక్కడైనా జరిగేదే. కానీ.. పాతికేళ్ల తర్వాత అనూహ్యంగా కలవటం ఒక ఎత్తు అయితే.. ఒకే విషయానికి సంబంధించి కలిసి పని చేయాల్సి రావటానికి మించింది ఇంకేం ఉంటుంది? ఈ ఉదంతం గురించి తెలిసిన తర్వాత దేవుడికి మించిన స్క్రిప్టు రైటర్ ఎవరుంటారు? అన్న భావన కలుగకమానదు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
కేరళలోని ఎరన్నూర్ లోని చాలకుడికి చెందిన ప్రసాద్ నంబూద్రి.. మేలూర్ కు చెందిన షోజు ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ 1997 నుంచి 1999 వరకు ఐటీఐలో కలిసి చదువుకున్నారు. రెండేళ్ల తర్వాత ఉన్నతచదువుల కోసం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత వీరిద్దరికి ఎలాంటి కాంటాక్టు లేదు. అనూహ్యంగా వీరిద్దరూ శబరిమలలో కలిశారు. ఇద్దరూ అయ్యప్ప స్వామి సేవలో పని చేస్తుండటం విశేషం.
సరిగ్గా 26 ఏళ్ల తర్వాత శబరిమలలో వీరిద్దరూ పని చేస్తూ ఒకరికొకరు తారసపడ్డారు. దీంతో పాత స్నేహితులు మళ్లీ ఒక్కటయ్యారు. ఇక్కడ షోజు ఏఎస్ఐగా శబరిమలలో భద్రతా బాధ్యతలు చూస్తుంటే.. నంబూద్రి యాత్రికులను నియంత్రించటం.. స్వామి దర్శనం అయ్యేలా చూసే మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నంబూద్రి ఈసారి ఈ పదవికి ఎంపికయ్యారు.
సాంకేతికంగా చూస్తే.. మేల్శాంతిగా పని చేసే నంబూద్రికి యాజు భద్రతను కల్పిస్తున్నట్లుగా చెప్పాలి. అంటే.. చిన్ననాటి స్నేహితుడికి భద్రతను కల్పించటం చిన్ననాటి మిత్రుడికి బాధ్యతగా మారింది. షోజు ప్రస్తుతం త్రిస్సైర్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. నంబూద్రి వచ్చే ఏడాది వరకు ఈ మేల్శాంతిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఎప్పుడు ఎవరిని కలపాలన్నది దేవుడికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదంటూ వీరిద్దరి గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా.. దశాబ్దాల క్రితం విడిపోయిన చిన్ననాటి దోస్తులు.. ఇప్పుడు ఒకేచోట ఒకే లక్ష్యం కోసం పని చేస్తుండటం.. స్నేహితుడి సెక్యూరిటీ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉండటం విశేషం కాక ఇంకేంటి?
