Begin typing your search above and press return to search.

బాల్య వివాహాల్లో భారత్ టాప్.. యునిసెఫ్ నివేదికలో సంచలన నిజాలు

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలపై చర్చ జరుగుతుంటే, మన దేశాన్ని తీవ్రంగా కలవరపెట్టే ఒక షాకింగ్ నిజం బయటపడింది.

By:  Madhu Reddy   |   12 Oct 2026 12:27 PM IST
బాల్య వివాహాల్లో భారత్ టాప్.. యునిసెఫ్ నివేదికలో సంచలన నిజాలు
X

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలపై చర్చ జరుగుతుంటే, మన దేశాన్ని తీవ్రంగా కలవరపెట్టే ఒక షాకింగ్ నిజం బయటపడింది. అసలు పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో, వాళ్ళ చేతికి పుస్తకాలు ఇవ్వాల్సిన పీరియడ్‌లో పెళ్లి పీటలెక్కిస్తున్నారు. తాజాగా యునిసెఫ్ విడుదల చేసిన ఒక నివేదిక చూస్తే గుండె తరుక్కుపోతుంది. ప్రపంచంలో బాల్య వివాహాల సమస్య భారత్‌లో ఎంత తీవ్రంగా ఉందో ఈ నివేదిక స్పష్టం చేసింది. అసలు చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరగడానికి ప్రధాన కారణాలేంటో చూద్దాం..

షాకింగ్ నిజాలు.. యునిసెఫ్ రిపోర్ట్:

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 సెకన్లకు ఒక బాల్య వివాహం జరుగుతోందని యునిసెఫ్ తన నివేదికలో స్పష్టం చేసింది. మన దేశంలో 20 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతుల్లో కోట్లాది మంది చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్నవారే ఉన్నారు. ముఖ్యంగా 17 ఏళ్ల లోపు, కొన్నిచోట్ల 15 ఏళ్ల లోపే బాలికలకు పెళ్లిళ్లు చేయడం మన దేశంలో ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరమైన విషయం. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న చైల్డ్ మ్యారేజెస్‌లో మూడో వంతు మన భారత్‌లోనే ఉండటం గమనార్హం.

ఏయే రాష్ట్రాల్లో ఈ దురాచారం ఎక్కువ?:

మన దేశంలో బాల్య వివాహాల ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఇంకా వుంది . ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఈ సామాజిక సమస్య ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇక జాతీయ సగటుతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో బాలికలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడం కొద్దిగా ఎక్కువైపోయిందని నివేదికలు చెబుతున్నాయి.

అసలు ఈ దుస్థితికి కారణాలు ఏమిటి?:

ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరగడానికి ముఖ్య కారణం పేదరికం, ఆర్థిక భారమే. ఆడపిల్లలను సమాజంలో బరువుగా భావించడం, పెద్దయ్యాక కట్నాలు ఇవ్వలేమనే భయంతో చిన్నప్పుడే పెళ్లి చేసి పంపిస్తుంటారు. అలాగే సరైన చదువు లేకపోవడం లేదా మధ్యలోనే బడి మానేయడం వల్ల ఈ సమస్య 48 శాతం వరకు పెరిగిపోతోంది. ఇక దీనికి తోడు కొన్ని పాత ఆచారాలు, అమ్మాయిల భద్రత గురించి తల్లిదండ్రులలో ఉండే అనవసర భయాలు దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

కఠిన చట్టాలు.. శిక్షలు ఏంటి?:

భారతదేశంలో బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. ఇక ఈ చట్టాన్ని ఉల్లంఘించి పెళ్లి జరిపించినా లేదా సహకరించినా 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇది బెయిల్‌ పొందలేని నేరం కావడంతో చట్టం చాలా కఠినంగా ఉంటుంది.

ఇక మొత్తానికి, పసి ప్రాయంలోనే పిల్లల జీవితాలతో చెలగాటమాడే ఈ బాల్య వివాహాలనే మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇక ప్రభుత్వం 2030 నాటికి దేశాన్ని సంపూర్ణంగా 'బాల్య వివాహ ముక్త్ భారత్' గా మార్చాలని కఠిన చర్యలు చేపడుతోంది. చదువుతోనే ఈ మార్పు సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలని ఆశిద్దాం.