Begin typing your search above and press return to search.

చిన్నారి పెళ్లికూతుళ్లే కాదు.. పెళ్లి కొడుకులు కూడా.. సర్వే చెప్పిన నిజం

అబ్బాయిల విషయానికి వస్తే మైనర్లుగా ఉన్నప్పుడే జరుగుతున్న పెళ్లిళ్లు 15.9 శాతమైతే.. అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పెళ్లిళ్లు దాదాపు 19 శాతంగా గుర్తించారు.

By:  Garuda Media   |   8 Jun 2026 9:15 AM IST
చిన్నారి పెళ్లికూతుళ్లే కాదు.. పెళ్లి కొడుకులు కూడా.. సర్వే చెప్పిన నిజం
X

అప్పుడెప్పుడో వచ్చిన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ జెన్ జీ బ్యాచ్ కు అయితే ఆ పాత సీరియల్ తెలీదు. అందులో ఇద్దరు మైనర్లకు పెళ్లి చేయటం.. ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు.. ఏళ్లకు ఏళ్లుగా సాగిన ఈ సీరియల్ దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మాత్రమే కాదు.. ఆ సీరియల్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సీరియల్ లో కీ పాయింట్ అయిన బాల్య వివాహాలకు సంబంధించి తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ..ఆరోగ్య సర్వే షాకింగ్ గణాంకాలతో పాటు.. పలు విస్మయానికి గురి చేసే అంశాల్ని వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సర్వేను విడుదల చేసింది.

అందులో అతి ముఖ్యమైన అంశం.. చట్టబద్ధమైన వయసు తీరకుండానే.. మైనర్లు ఉండగానే పెళ్లిళ్లు చేస్తున్న తీరు దేశ వ్యాప్తంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఆందోళన కలిగించేలా ఉంటే.. కొన్ని రాష్ట్రాల్లో ఫర్లేదన్నట్లుగా ఉంది. కానీ.. మొత్తంగా మాత్రం పెళ్లికి అవసరమైన చట్టబద్ధమైన వయసు లేకుండానే పెళ్లిళ్లు చేస్తున్న సంఖ్య పెరుగుతున్న పరిస్థితి. ఈ రిపోర్టు ప్రకారం దేశంలో 15.9 శాతం మంది అబ్బాయిలు తాము మైనర్లుగా ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా.. పట్టణ, నగర ప్రాంతాల్లో కాస్త తక్కువగా ఈపెళ్లిళ్లు జరుగుతున్నాయి.

అబ్బాయిల విషయానికి వస్తే మైనర్లుగా ఉన్నప్పుడే జరుగుతున్న పెళ్లిళ్లు 15.9 శాతమైతే.. అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పెళ్లిళ్లు దాదాపు 19 శాతంగా గుర్తించారు. పట్టణ.. నగర ప్రాంతాల్లో మాత్రం 9.7 శాతం ఉన్నట్లు తేల్చారు. మైనర్ అబ్బాయిల పెళ్లిళ్లు అత్యధికంగా జరిగే రాష్ట్రంగా బిహార్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలోని 25-29 వయసున్న పురుషుల్లో సుమారు 29.6 శాతం మంది తమ పెళ్లిళ్లు 21 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే జరిగిపోయినట్లుగా వెల్లడించారు. అంటే.. మైనర్ వివాహాల జాతీయ సగటుకు రెట్టింపు ఒక్క బిహార్ లోనే నమోదు కావటం గమనార్హం.

మరి తెలుగు రాష్ట్రాల సంగతేంటి?అన్న ప్రశ్న రావొచ్చు. ఆ విషయంలోకి వెళితే.. ఆశ్చర్యకరంగా ఏపీలో 9.7 శాతం ఉంటే.. తెలంగాణలో 5.7 శాతం మాత్రమే ఉండటం విశేషం. అంటే.. మైనర్ అబ్బాయిలకు పెళ్లిళ్లు చేసే విషయంలో తెలంగాణ కంటే ఏపీనే ముందు ఉండటం గమనార్హం. ఇదే తరహాలో మైనర్ అబ్బాయిలకు పెళ్లిళ్లు జరుగుతున్న ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. రాజస్థాన్ లో 28.5 శాతం ఉంటే.. మధ్యప్రదేశ్ లో 25 శాతం.. గుజరాత్ లో 24.3 శాతం అబ్బాయిలకు మైనర్లుగా ఉన్నప్పుడే పెళ్లిళ్లు జరిగిన విషయాన్ని గుర్తించారు.

సాధారణంగా బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. మరి..ఈ అంశంపై జాతీయ సర్వే ఏం చెప్పిందన్న విషయంలోకి వెళితే.. అమ్మాయిల సంగతి పక్కన పెడితే.. అబ్బాయిల విషయంలో మాత్రం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే అబ్బాయిలకు మైనార్టీ తీరకుండా పెళ్లిళ్లు చేసే ట్రెండ్ భారీగా కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా ఒడిశా రాష్ట్రం గురించి చెప్పొచ్చు. ఆ రాష్ట్రంలో మైనర్ బాలుల వివాహాలు 12.5 శాతంగా ఉంటే.. పట్టణ ప్రాంతాల్లో 15.1 శాతంగా.. గ్రామీణ ప్రాంతంలో 12.1 శాతంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. మొత్తంగా చూస్తే.. చిన్నారి పెళ్లికూతుళ్ల సమస్యే కాదు.. చిన్నారి పెళ్లికొడుకులు కూడా ఎక్కువగానే ఉన్న కొత్త విషయాన్ని తాజా సర్వే తేల్చి చెప్పిందని చెప్పాలి.