Begin typing your search above and press return to search.

పల్లెటూరి బాణం.. ఆసియా స్వర్ణ లక్ష్యం.. తండ్రి నమ్మకాన్ని గెలిపించిన 'చికిత' స్ఫూర్తి గాథ

చికిత స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నప్పటి నుంచే విలువిద్య ఆర్చరీ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది.

By:  A.N.Kumar   |   30 Sept 2026 11:44 AM IST
పల్లెటూరి బాణం.. ఆసియా స్వర్ణ లక్ష్యం.. తండ్రి నమ్మకాన్ని గెలిపించిన చికిత స్ఫూర్తి గాథ
X

కలలు కనే కళ్లకు పేదరికం.. గ్రామీణ నేపథ్యం అడ్డంకి కావని... తండ్రి నమ్మకానికి.. కూతురి కష్టానికి తోడు సరైన దిశానిర్దేశం తోడైతే సరిహద్దులు దాటి విజయం వరిస్తుందని చికిత ప్రయాణం నిరూపిస్తోంది. పల్లెటూరి మట్టిలో మొలకెత్తిన ఒక చిన్న ఆశ.. తండ్రి ప్రోత్సాహంతో మహావృక్షమై.. నేడు ఆసియా క్రీడల వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసేలా చేసింది. నాన్న నమ్మకాన్ని గెలిపిస్తూ.. తన విల్లు నుంచి వదిలిన ప్రతి బాణాన్ని స్వర్ణ లక్ష్యం వైపు నడిపించిన ఆ కూతురి విజయ గాథ.. విలువిద్యలోనే కాదు.. జీవితంలో గెలవాలని తపించే ప్రతీ ఒక్కరి గుండెల్లో కొత్త ఆశల దీపాలను వెలిగిస్తోంది..

పట్టుదల, నిరంతర శ్రమ, అచంచలమైన లక్ష్యం ఉంటే పుట్టిన ఊరు ఎంత చిన్నదైనా.. కనే కలలు మాత్రం ఆకాశమంత పెద్దవిగా ఉండొచ్చని నిరూపిస్తున్నారు తెలంగాణకు చెందిన యువ ఆర్చరీ క్రీడాకారిణి చికిత తానిపర్తి. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభను కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించిన భారత్ ఆర్చరీ జట్లలో కీలక భాగస్వామిగా నిలిచి తెలుగు నేల గర్వపడేలా చేశారు.

సాధారణ నేపథ్యం.. అసమాన సంకల్పం

చికిత స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నప్పటి నుంచే విలువిద్య ఆర్చరీ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తిని కేవలం ఒక హాబీగా వదిలేయకుండా ఆమెను ఒక అంతర్జాతీయ ఛాంపియన్‌గా తీర్చిదిద్దడంలో తండ్రి శ్రీనివాసరావు పాత్ర అమూల్యం. ఆర్చరీపై ఉన్న మక్కువతో కుమార్తెలోని సహజ సిద్ధమైన ప్రతిభను గుర్తించిన ఆయన చిన్న వయసులోనే ఆమెకు తగిన శిక్షణ ఇప్పిస్తూ ప్రతి అడుగులోనూ ప్రోత్సహించారు.

కెరీర్‌ను మలుపు తిప్పిన శిక్షణ

లక్ష్యాన్ని చేరుకోవడం వెనుక ఎంతో త్యాగం, కఠోర శ్రమ దాగి ఉంటాయి. చికిత కూడా అదే బాటలో నడిచారు. ప్రతిరోజూ మైదానంలో గంటల తరబడి సాధన చేస్తూ సాంకేతికతను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగారు. 2022లో సోనిపట్‌లోని ప్రతిష్టాత్మక ఆర్చరీ అకాడమీలో చేరడం ఆమె క్రీడా జీవితానికి ఒక కీలక మలుపుగా మారింది. అక్కడి నిపుణులైన శిక్షకుల మార్గదర్శకత్వంలో ఆమె ప్రతిభకు మరింత పదును పెరిగింది.

విజయాల పరంపర

ఈ కఠోర సాధనకు ఫలితాలు త్వరగానే లభించాయి. 2025 ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లో చికిత స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని అంతర్జాతీయ క్రీడా రంగా దృష్టిని ఆకర్షించారు. ఆ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తాజాగా ఆసియా క్రీడల వేదికపై డబుల్ గోల్డ్ సాధించిన జట్లలో భాగమై భారతదేశ పతాకాన్ని ఎగురవేశారు.

ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదాత

సుల్తాన్‌పూర్ వంటి చిన్న గ్రామం నుంచి బయలుదేరి ఆసియా క్రీడల స్వర్ణ పీఠాన్ని అధిరోహించిన చికిత ప్రయాణం కేవలం ఒక క్రీడాకారిణి విజయం మాత్రమే కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ప్రోత్సాహం.. తల్లిదండ్రుల మద్దతు ఉంటే ఏ రంగంలోనైనా ప్రపంచ స్థాయికి ఎదగొచ్చని చాటిచెప్పిన స్ఫూర్తి గాథ. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ, మరెన్నో పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ చికితకు అభినందనలు తెలియజేద్దాం..