న్యూ ట్రెండ్ : ముఖ్యమంత్రులే హోం మంత్రులు
ఈ దేశంలో కొత్త ట్రెండ్ పాలనలో సాగుతోంది. ముఖ్యమంత్రులే హోం వంటి పవర్ ఫుల్ శాఖలను స్వయంగా చూస్తున్నారు.
By: Satya P | 16 May 2026 11:47 PM ISTఈ దేశంలో కొత్త ట్రెండ్ పాలనలో సాగుతోంది. ముఖ్యమంత్రులే హోం వంటి పవర్ ఫుల్ శాఖలను స్వయంగా చూస్తున్నారు. నిజానికి రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ కీలకమైన శాఖగా నంబర్ టూగా హోం శాఖ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ తో ముడి పడి ఉన్న ఈ శాఖ ఎంతో ఇంపార్టెంట్ గా ఉంటుంది. రాజకీయంగా కూడా ఈ శాఖకు ఉన్న గ్లామర్ వేరుగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలీ అంటే హోం మంత్రి అంటే వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ అని గతంలో చెప్పుకునే వారు. సీనియర్ మోస్ట్ లీడర్ కి ఈ శాఖ కట్టబెట్టేవారు. అయితే మారిన ట్రెండ్ లో చూస్తే ముఖ్యమంత్రులే ఇంతటి బరువైన శాఖను చూస్తున్నారు. తామే ఆ భారాన్ని మోస్తున్నారు. ముందే చెప్పినట్లుగా లా అండ్ ఆర్డర్ ఇపుడు రాజకీయాలను ప్రభుత్వాల తలరాతను శాసిస్తోంది. దాంతో పాటు ప్రభుత్వంలో నంబర్ టూ గా వేరెవరికో చాన్స్ ఇచ్చి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అదేదో వన్ టూ రెండూ తామే ఉండాలన్న ఆలోచన కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తోంది. అందులే దేశంలో సగం రాష్ట్రాలలో ముఖ్యమంత్రులే హోం మంత్రులుగా ఉంటున్నారు.
విజయ్ చేతికే హోం :
దళపతిగా వెండి తెరను ఏలిన విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కీలక శాఖలను మంత్రులకు కేటాయించారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మాత్రమే ఈ నెల 10న ప్రమాణం చేశారు. వారందరికీ తాజాగా ఆయన శాఖలు ప్రకటించారు. అందులో కీలకమైన హోం శాఖను విజయ్ తన వద్దనే ఉంచుకోవడం విశేషం. దాంతో ఆయన హోం, పోలీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ప్రత్యక్ష బాధ్యతలను స్వయంగా నిర్వహించనున్నారు. ఒక విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యలతో పాటు హోం శాఖ కూడా కీలకమే కానీ విజయ్ మాత్రం ప్రతిష్టగా తీసుకుని తమిళనాడులో లా అండ్ ఆర్డర్ కి తానే పూర్తి బాధ్యత వహించాలని అనుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి సైతం :
ఇక తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మొదటి నుంచి తన వద్దనే హోం శాఖను ఉంచుకున్నారు. తెలంగాణా కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక ఆసక్తితో శ్రద్ధతో ఈ శాఖను రెండున్నరేళ్ళుగా చూస్తున్నారు.ఆయన స్వయంగా హోం శాఖను నిర్వహిస్తూ రాష్ట్రంలోని శాంతిభద్రతలు సాధారణ పరిపాలన విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. అలా గట్టి హోం మంత్రిగానే పేరు తెచ్చుకున్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర హోం మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా తన విధులతో పాటు ఈ పదవిని కూడా నిర్వహిస్తున్నారు. ఒక చాలెంజ్ గా ఆయన స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ని నడిపిస్తున్నారు.
సువేందు అధికారి కూడా :
మమతా బెనర్జీని దించేసి పశ్చిమ బెంగాల్ కి తొమ్మిదవ ముఖ్యమంత్రిగా తాజాగా ప్రమాణం చేసిన సువేందు అధికారి హోం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన రాష్ట్ర హోం కొండ ప్రాంతాల వ్యవహారాల విభాగ శాఖలను చూస్తున్నారు. బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ కత్తి మీద సాము లాంటిది. దాంతో పాటు ఢీ అంటే ఢీ గా రాజకీయం సాగుతుంది. దాంతో సువేందు అధికారి ఈ అతి ముఖ్య బాధ్యతలను తానే భుజాల మీద వేసుకున్నారు.
పదేళ్ళు సీఎం ప్లస్ హోం :
ఇక దక్షిణాన కేరళం రాష్ట్రానికి నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ మొదటి రెండవ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాలు రెండింటిలోనూ హోం మంత్రిగా తానే పనిచేశారు.ఆయన హోం శాఖతో పాటు సాధారణ పరిపాలన, నిఘా సమాచార సాంకేతిక శాఖలను కూడా తన వద్దే ఉంచుకుని రాష్ట్రాన్ని ముందుకు నడిపారు. ఇదే తీరున చూస్తే మధ్యప్రదేశ్‌కు ప్రత్యేకంగా హోం మంత్రి ఎవరూ లేరు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వయంగా హోం శాఖను నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్‌కు ప్రత్యేకంగా హోం మంత్రిని తీసుకోలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హోం శాఖను నిర్వహిస్తున్నారు.
వీరంతా అదే దారిలో :
అంతే కాదు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రస్తుతం హోం వ్యవహారాలు న్యాయ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయన మార్చి 2022 లో మంత్రివర్గాన్నిఏర్పాటు చేసినప్పటి నుంచి హోం మంత్రిత్వ శాఖ తన వద్దనే ఉంచుకున్నారు. బీహార్ కి కొత్త ముఖ్యమంత్రి అయిన సామ్రాట్ చౌదరి హోం, సాధారణ పరిపాలన, క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్, పౌర విమానయానం, ఎన్నికలు వంటి కీలకమైన, అత్యంత ప్రాధాన్యత గల పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇతర క్యాబినెట్ మంత్రులకు ప్రత్యేకంగా కేటాయించని అన్ని శాఖలను కూడా ఆయన తన వద్దే ఉంచుకున్నారు. ఇలా అనేక మంది ముఖ్యమంత్రులు హోం శాఖ తమ వద్దనే ఉంచుకున్నారు.
