Begin typing your search above and press return to search.

సీఈసీపై చర్యలు తీసుకోవడం కష్టమా? మరి సీఈసీ రాజీనామా చేయాలంటే ఏం జరగాలి?

భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానమైనది.

By:  A.N.Kumar   |   26 Sept 2026 5:12 PM IST
సీఈసీపై చర్యలు తీసుకోవడం కష్టమా?   మరి సీఈసీ రాజీనామా చేయాలంటే ఏం జరగాలి?
X

భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానమైనది. దేశంలో నిష్పాక్షికంగా, ఎలాంటి రాజకీయ లేదా ప్రభుత్వ ఒత్తిళ్లకు లోనుకాకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థపైనే ఉంటుంది. అందుకే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) తో పాటు ఇతర కమిషనర్లకు రాజ్యాంగపరంగా.. చట్టపరంగా అత్యున్నత స్థాయి ప్రత్యేక రక్షణలు కల్పించారు. ఇటీవల ప్రస్తుత సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఈ రక్షణల పరిధి ఎంతవరకు ఉంటుంది, వారిపై ఎలాంటి సందర్భాల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అంశాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.

సాధారణ ప్రభుత్వ అధికారుల మాదిరిగా సీఈసీపై నేరుగా చర్యలు తీసుకోవడం లేదా వారిని పదవి నుంచి తొలగించడం సాధ్యపడదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం సీఈసీకి అత్యున్నత స్థాయి భద్రత ఉంటుంది. వీరిని పదవి నుంచి తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి అనుసరించే అత్యంత సంక్లిష్టమైన పార్లమెంటరీ ప్రక్రియనే చేపట్టాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో తీవ్రమైన దురు ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమైనప్పుడు మాత్రమే పార్లమెంటులోని రెండు సభల్లో లోక్‌సభ, రాజ్యసభ ప్రత్యేక మెజారిటీతో తీర్మానం నెగ్గాలి. ఆ తర్వాత మాత్రమే భారత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా సీఈసీని తొలగించే అవకాశం ఉంటుంది.

దీనికి తోడు ‘ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం, 2023’ ప్రకారం సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్లు తమ అధికారిక విధుల నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు, చేసిన చర్యలకు సంబంధించి సివిల్ లేదా క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి ప్రత్యేక రక్షణ లభిస్తుంది. ఈ చట్టపరమైన ఇమ్యూనిటీ వారు పదవిలో ఉన్న సమయంలోనే కాకుండా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా వర్తిస్తుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అయితే అధికారిక విధుల పరిధి దాటి వ్యక్తిగత స్థాయిలో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే పూర్తి స్థాయి ఇమ్యూనిటీ వర్తిస్తుందా లేదా అనేది న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలలో నిర్లక్ష్యం వహిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే రాజ్యాంగపరమైన అధికారం అత్యున్నత న్యాయస్థానానికి ఉంటుంది. అయితే క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలంటే అటార్నీ జనరల్ లేదా సంబంధిత చట్టపరమైన అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొడవడం తప్పనిసరి.

ఇక సీఈసీ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా లేఖను నేరుగా భారత రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. రాజీనామా ఆమోదం పొంది పదవి ఖాళీ అయిన తర్వాత చట్టం ప్రకారం ప్రధానమంత్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నూతన సీఈసీని నియమిస్తారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా సాగేందుకు ఎన్నికల సంఘం స్వతంత్రత అత్యంత కీలకం. అందుకే రాజ్యాంగ నిర్మాతలు వారికి ఇటువంటి కఠినమైన రక్షణలు కల్పించారు. అయితే అదే సమయంలో అధికార దుర్వినియోగం జరగకుండా జవాబుదారీతనం ఎలా ఉండాలి.. రాజ్యాంగ వ్యవస్థల పరిధి ఎంతవరకు ఉండాలనే ప్రశ్నలపై సుప్రీంకోర్టు చేపట్టే విచారణ భవిష్యత్తులో కీలకమైన మార్గదర్శకంగా మారనుంది.