Begin typing your search above and press return to search.

ఇందిరమ్మ చేసింది చారిత్రాత్మక తప్పిదమా ...చిదంబరం సంచలనం

ఈ దేశంలో ఐరన్ లేడీగా శ్రీమతి ఇందిరాగాంధీ ఎంతో గుర్తింపు పొందారు. ఆమె తన రాజకీయ చతురతో పాలనా పరంగా తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలతో ధైర్యంతో కూడిన చర్యలతో అంతర్జాతీయంగానూ పేరు గడించారు.

By:  Satya P   |   13 Oct 2025 9:13 AM IST
ఇందిరమ్మ చేసింది చారిత్రాత్మక తప్పిదమా ...చిదంబరం సంచలనం
X

ఈ దేశంలో ఐరన్ లేడీగా శ్రీమతి ఇందిరాగాంధీ ఎంతో గుర్తింపు పొందారు. ఆమె తన రాజకీయ చతురతో పాలనా పరంగా తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలతో ధైర్యంతో కూడిన చర్యలతో అంతర్జాతీయంగానూ పేరు గడించారు. ఒక వైపు ప్రపంచంలో అంతా పురుషాధీక్యమై దిగ్గజ నేతలు దేశాలు ఏలుతున్న సమయంలో ఇందిరాగాంధీ ఒక బలమైన మహిళా ప్రధానమంత్రిగా భారత్ గతిని ప్రగతిని చాటి చూపించారు ప్రత్యర్ధులను సైతం హడలెత్తించారు దాయాది పాక్ సైతం చూసేందుకు కూడా సాహసించ లేనంతగా ఆమె విదేశాంగ విధానాలు ఉండేవి. అమెరికా పెద్దన్న మాటలను సైతం కాదని ఆమె పాక్ మీద 1971లో చేసిన యుద్ధం అందులో సాధించిన సంచలన విజయం చరిత్ర పుటలలో పదిలంగా ఉన్నాయి.

అంతర్గత శక్తులకి బలి :

అంతర్జతీయంగా భారత్ కి పొంచి ఉన్న ముప్పుని ఎప్పటికప్పుడు గమనించి కౌంటర్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి తగిన సమయంలో ప్రయోగిస్తూ భారత్ ని అన్ని విధాలుగా ముందుంచిన ఇందిరాగాంధీని బయట శక్తులు ఏమీ చేయలేకపోయాయి. కానీ అంతర్గత శక్తులే తుద ముట్టించాయి. ఇది నిజంగా విషాదమే. ఉక్కు మహిళ గా ఉంటూ దేశాన్ని మరో అభ్యుదయం వైపుగా తీసుకుని వెళ్ళిన ఇందిరమ్మ అరవై ఆరేళ్ళకే తుది శ్వాస విడిచారు. ఆమె అప్పటికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. మరిన్ని ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీని విజయతీరాన నడిపించే సత్తా కలిగిన ఉన్న ఆమె నాలుగు దశాబ్దాల క్రితం ఈ దేశంలో సంచలనం సృష్టించిన ఆపరేషన్ బూస్టార్ వ్యవహారంలో చేసిన తప్పిందం మూలంగా భారీ మూల్యం చెల్లించుకున్నారా అన్నది కొత్తగా చర్చకు వస్తోంది.

సమిష్టి నిర్ణయంగా :

అసలు ఎపుడో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నది ఇపుడు ఎందుకు చర్చకు వస్తోంది అంటే దానికి కారణం కేంద్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం. ఆయన తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలీలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో మాట్లాడుతూ ఆపరేషన్ బ్లూ స్టార్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు ఆనాడు జరిగిన సైనిక చర్యను తప్పుడు నిర్ణయం గా అభివర్ణించారు అందుకు గానూ ఒక దేశ ప్రధాని తాను బలి అయ్యారు అని ఆయన అన్నారు.

ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే :

ఇంతకీ ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏమిటి అన్నది కనుక చూస్తే సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం 1984లో జూన్ నెలలో అతి పెద్ద సైనిక చర్య జరిగింది. బయట దేశాల మీద కాదు, సరిహద్దుల ఆవల అంతకంటే కాదు, అప్పటికి సరిగ్గా నాలుగేళ్ళుగా ఖలిస్థాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలని ఒక ఉద్యమం మొదలైంది. పంజాబ్ కేంద్రంగా సాగిన ఈ ఉద్యమం మూలంగా ప్రతీ రోజూ హింస ఆందోళన చోటు చేసుకునేవి. ఆనాటి దిన పత్రికకలో పతాక శీర్షికలుగా పంజాబ్ వార్తలే ఎకువగా ఉండేవి. ఇది పంజాబ్ లోని అమృత్‌సర్ లో గల స్వర్ణదేవాలయం కాంప్లెక్స్ నుంచి సిఖ్ దాందానీ తక్సల్ నాయకుడైన జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే, అతని అనుచరులను బయటకు రప్పించడానికి ఆనాటి భారత ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్య. దీని పేరు ఆపరేషన్ బ్లూ స్టార్. 1984 జూన్ 1వ తేదీ నుంచి 10 తేదీ వరకూ జరిగిన భారతీయ సైనిక చర్యగా ఇది చరిత్రలో ఉంది.

అంతిమ మార్గంగా సైనిక చర్య :

వివరాల్లోకి వెళ్తే కనుక 1982 జూలైలో పంజాబ్ కు చెందిన అకాళీదళ్ పార్టీ అధినేత హరిచంద్ సింగ్ లోంగోవాల్, జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలేను అరెస్టు నుంచి తప్పించుకునేందుకు గాను స్వర్ణ దేవాలయంలో ఉండవల్సిందిగా ఆహ్వానించారని చెబుతారు. ఆ విధంగా అందులో ఉంటూ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని కట్టడి చేసేందుకు అనేక ప్రయత్నాలు సాగిన పిమ్మట ఇక అంతిమ మార్గంగా ఈ సైనిక చర్యకి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది.

సీరియస్ గానే యాక్షన్ :

ఖలిస్తాన్‌ను స్వతంత్ర సిక్కు రాజ్యంగా రూపొందించడానికి అప్పటికి మూడు నాలుగేళ్ళుగా ప్రయత్నాలు సాగుతున్నాయని పక్కా ఆధారాలు నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అందించాయి. అంతే కాదు ఈ రకమైన దేశంలో విచ్చిన్నం చేసే శక్తులకు దాయాది దేశం నుంచి ప్రోత్సాహం ఉందని కూడా ఆధారాలు కూడా సాధించారని చెబుతారు. అంతే కాదు ఆనాడు సోవియట్‌ యూనియన్ అందించిన సమాచారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ సిక్కులకు సీఐఏ రహస్యంగా మద్దతు ఇస్తున్నారని భావించి పంజాబ్‌లోకి సైన్యాన్ని తరలించాలనే నిర్ణయానికి వచ్చారని చెబుతారు. అలా 1984 జూన్ 1న తీవ్రవాదులతో చర్చలు విఫలమైన తర్వాత ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్‌ను ప్రారంభించాలని సైన్యాన్ని ఆదేశించారు. ఈ సైనిక చర్యతో ఎంతో మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాదు అవతల వైపు వేర్పాటు వాదులు పెద్ద సంఖ్యలో హతమయ్యారు.

ఇందిర దారుణ హత్య :

ఆపరేష బ్లూ స్టార్ జరిగిన నాలుగు నెలల వ్యవధిలో శ్రీమతి ఇందిరాగాంధీ ఢిల్లీలోని తన అధికార నివాసంలో దారుణ హత్యకు గురి అయ్యారు. ఆపరేషన్ బ్లూ స్టార్ కి ప్రతీకారంగానే ఇది జరిగిందని అంటారు. 1984 అక్టోబర్ 31న ఇందిరమ్మ అలా మరణించారు. ఆమె దేశం విడిపోకూడదు అని వేర్పాటు వాదులపైన సాగించిన సైనిక చర్యకు చివరికి ఆమె బలి కావాల్సి వచ్చింది

సమిష్టి నిర్ణయం అయినా తప్పే :

ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి నాలుగు దశాబ్దాల పై దాటిన తరువాత బాధ్యతాయుతమైన హోం మంత్రిగా పనిచేసిన వారు కాంగెస్ సీనియర్ నేత చిదంబరం ఈ నిర్ణయం ఒక తప్పిదం అని అంటున్నారు. అంతే కాదు ఇది ఇందిరమ్మ స్వయంగా తీసుకున్నది కాదని ఆనాడు సైనిక అధికారులు లోకల్ పోలీస్ ఇంటలిజెన్స్ అంతా కలసి తీసుకున్న నిర్ణయం అయినా బలి అయింది మాత్రం ఇందిరమ్మ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ జరగకపోయి ఉంటే వేరే విధంగా అయినా ఖలీస్థాన్ వేర్పాటువాదులను స్వర్ణ దేవాలయం నుంచి బయటకు తెచ్చి సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ఇదొక బిగ్ డిబేట్ గా మళ్ళీ జనం ముందుకు వచ్చింది అని భావించాలి.