మాటల తూటాలు: కాంగ్రెస్‌కు.. 'చిదం.. భారం'!
ఒక నాయకుడు పార్టీకి ప్రయోజనకరంగా ఉండాలి. అంతో ఇంతో ఆయన వల్ల లాభం కూడా ఉండాలి.
By: Garuda Media | 13 Oct 2025 7:30 PM ISTఒక నాయకుడు పార్టీకి ప్రయోజనకరంగా ఉండాలి. అంతో ఇంతో ఆయన వల్ల లాభం కూడా ఉండాలి. పోనీ.. లాభం మాట లేకపోయినా.. పార్టీకి నష్టం కలిగిస్తే.. పార్టీని ఇరుకున పడేలా చేస్తే.. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు.. పార్టీ విషయంలో విమర్శలు గుప్పించి.. ప్రత్యర్షథులకు ఆయుధాలు అందిస్తే..? ఇదే.. వ్యవహారం కాంగ్రెస్‌లో ప్రధాన చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడు.. కేంద్రంలో ఆర్థిక, రక్షణ, హోం వంటి బలమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన కుంభకోణం చిదంబరం కాంగ్రెస్‌కు భారంగా మారారు.
గత 15 రోజుల్లో చిదంబరం చేసిన రెండు కీలక అంశాలకు సంబంధించి చేసిన కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీని బోనులో నిలబెట్టాయి. బీజేపీ నాయకులకు నిప్పులు చెరిగేలా.. అవకాశం కల్పించాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వతంత్రం ఉంటుంది. కానీ.. అది పార్టీకి మేలు చేసేలా ఉండాలే తప్ప.. కీడు చేసేలా ఉండకూడదు. చిదంబరం.. ఈ విషయం తెలియని నాయకుడు అయితే.. కాదు. అయినా.. ఆయన వ్యాఖ్యలు చేశారంటే.. పెద్ద వ్యూహమే ఉందని పార్టీ వర్గాల్లోనే చర్చకు వచ్చింది.
ఇవీ వ్యాఖ్యలు..
1) ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల 26/11 అనంతరం.. తాము పాకిస్థాన్‌పై పెద్ద ఎత్తున విరుచుకుపడాలని భావించామని.. కానీ, అమెరికా ఒత్తిడి తలొగ్గి.. వెనక్కి తగ్గామని చిదంబరం 10 రోజుల కిందట వ్యాఖ్యానిం చారు. దీంతో అప్పటి వరకు ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రధాని మోడీపై అమెరికా ఒత్తిడి ఉందం టూ.. కాంగ్రెస్ చేసిన విమర్శలకు సొంత పార్టీ నేతే చెక్ పెట్టినట్టు అయింది.
2) ఆపరేసన్ బ్లూ స్టార్ ద్వారా.. 1984లో ఖలిస్థానీ తీవ్ర వాదులపై అప్పటి ప్రధాని ఇందిరమ్మ సైనిక చర్య తీసుకుని తప్పు చేశారని చిదంబరం తాజాగా వ్యాఖ్యానించారు. దీని వల్ల ఆమె మూల్యం చెల్లించుకున్నా రని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. దేశం కోసం.. సైనిక చర్య తీసుకున్నారని.. ఈ క్రమంలోనే ఇందిర ప్రాణాలు అర్పించారని కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. తాజాగా చిదంబరం చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఎదురు దాడికి దిగింది. సైనిక చర్యల వెనుక.. ఇందిర అహం ఉందని పేర్కొంది. దేశం కాదు.. వ్యక్తిగత కక్షతోనే ఆమె ఈ చర్యలకు దిగారని పేర్కొంది.
ఎందుకిలా?
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ పుంజుకునే పరిస్తితిలో ఉంది. మరో వైపు.. వచ్చేఏడాది తమిళనాడు ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అనూహ్యంగా పార్టీని డైలమాలో పడేస్తూ.. ప్రత్యర్థి బీజేపీకి ఆయుధాలు ఇస్తూ.. చిదంబరం వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. అయితే.. దీనికి కారణం.. బీజేపీని ఆయన మెప్పించేందుకే నని పరిశీలకులు చెబుతున్నారు. చిదంబరం కుమారుడు కార్తీపై ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి. వీటి విచారణ ఈ నెలలో పుంజుకోనుంది. ఈ క్రమంలో ఆయన పరోక్షంగా బీజేపీకి మేలు చేసి.. తన కుమారుడిని రక్షించుకునే చర్యలకు దిగినట్టు అనుమానిస్తున్నారు.
చర్యలు తీసుకోలేని పరిస్థితి..
సీనియర్ మోస్ట్ నాయకుడు చిదంబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు మంట పట్టిస్తున్నాయి. అయినా.. చర్యలు తీసుకునే పరిస్థితిలో ఆ పార్టీలేదు. కేవలం తాజాగా హెచ్చరికలకు మాత్రమేపరిమితం అయింది. దీనికి కారణం.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే.. బీజేపీ మరింత విరుచుకుపడే అవకాశం ఉంది. నిజాలు చెప్పారు కాబట్టే.. చిదంబరాన్ని బయటకు పంపించారని.. వ్యాఖ్యానించే అవకాశం ఉంది. అదేసమయంలో వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలపైనా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సుతిమెత్తగా హెచ్చరించడం తప్ప.. ఇప్పుడున్న పరిస్థితి లో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
