Begin typing your search above and press return to search.

చేవెళ్ల ఘోరం: ఒకే కుటుంబంలో ముగ్గురు కూతుళ్ల మృతి.. తాండూరును ముంచిన విషాదం!

హైదరాబాద్–బీజాపూర్ హైవేపై మిర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

By:  A.N.Kumar   |   3 Nov 2025 1:41 PM IST
చేవెళ్ల ఘోరం: ఒకే కుటుంబంలో ముగ్గురు కూతుళ్ల మృతి.. తాండూరును ముంచిన విషాదం!
X

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వస్తున్న లారీ ఢీకొట్టడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 నెలల శిశువుతో పాటు మహిళలు, విద్యార్థినులు ఉండటం హృదయ విదారకం.

*ఒకే కుటుంబంలో ముగ్గురు కుమార్తెల దుర్మరణం

ఈ దారుణ ప్రమాదం తాండూరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుటుంబాన్ని అంతులేని శోకసంద్రంలో ముంచింది. ఆయన ముగ్గురు కుమార్తెలు తనూష, సాయి ప్రియ, నందిని ఈ దుర్ఘటనలో మృతిచెందారు. అక్కాచెల్లెళ్లు ముగ్గురూ హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో ఉన్నత విద్య చదువుకుంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన వారు, క్షణాల్లోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తాండూరు పట్టణాన్ని దుఃఖంలో ముంచేసింది.

డ్రైవర్‌గా పనిచేస్తూ నలుగురు కూతుర్లను అల్లారుముద్దుగా పెంచుకుంటూ, ఉన్నత విద్య చదివించాలని కలలు కన్న ఎల్లయ్య గౌడ్ ఆశలు ఈ ప్రమాదంలో ఆవిరయ్యాయి. ఇప్పటికే ఒక కుమార్తెకు వివాహం జరిపిన ఆయన, మిగిలిన ముగ్గురు చదువుకుంటున్న సమయంలో ఈ ఘోరం జరగడం కుటుంబ సభ్యులను, బంధువులను కన్నీరుమున్నీరు చేసింది.

మరో విద్యార్థిని బలి.. మిర్జాగూడ వద్దే ప్రమాదం

యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిలరెడ్డి అనే ఎంబీఏ విద్యార్థిని కూడా ఈ ప్రమాదంలో మృతిచెందింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఆత్మహృదయకర దృశ్యాలను చూసి బోరున విలపించారు.

హైదరాబాద్–బీజాపూర్ హైవేపై మిర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తప్పుడు దిశలో (రాంగ్ రూట్‌లో) వేగంగా వస్తూ లారీ బస్సును ఢీకొట్టడంతో ఇంతమంది అమాయక ప్రాణాలు బలయ్యాయి.

* రోడ్డు భద్రతపై ప్రశ్నార్థకం

ఒక క్షణికావేశం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాల జీవితాలు చిద్రమయ్యాయి. ఈ ఘోర దుర్ఘటన మరోసారి రోడ్డు భద్రత ప్రాముఖ్యతను, వాహనదారుల బాధ్యతను గుర్తు చేసింది. విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ చేవెళ్ల దుర్ఘటనతో తాండూరు పట్టణం ఇప్పుడంతా విషాదంలో మునిగి ఉంది.