చెన్నైలో దారుణ హత్య.. మహిళ మృతదేహ భాగాలతో బిర్యానీ!?
ఓ మహిళను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఆధారాలను మాయం చేసేందుకు అందులోని కొన్ని భాగాలను బిర్యానీ పాత్రలో ఉడికించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
By: A.N.Kumar | 23 Aug 2026 5:20 PM ISTచెన్నైలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఓ మహిళను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఆధారాలను మాయం చేసేందుకు అందులోని కొన్ని భాగాలను బిర్యానీ పాత్రలో ఉడికించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన మృతదేహ భాగాలను ఓ సూట్‌కేస్‌లో పెట్టి రైలులో తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఓ దంపతులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆగ్రాలో బయటపడిన కేసు
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎరుపు రంగు సూట్‌కేస్‌లో మానవ మృతదేహ భాగాలను గుర్తించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగ్రా రైల్వే స్టేషన్‌లో సూట్‌కేస్‌ను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూట్‌కేస్ చెన్నై నుంచి రైలులో పంపినట్లు ఆధారాలు లభించడంతో కేసు చెన్నైకి చేరింది.
దీంతో చెన్నై పోలీసులు రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను విస్తృతంగా పరిశీలించారు. సుమారు 350కుపైగా కెమెరాల ఫుటేజీలను తనిఖీ చేసినట్లు సమాచారం. అందులో ఓ వ్యక్తి ఓ మహిళ కలిసి సూట్‌కేస్‌ను రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి రైలులో ఉంచినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం వారి కదలికలను అనుసరించిన పోలీసులు గుడువాంచేరి ప్రాంతానికి చేరుకున్నారు.
ఇంట్లో రక్తపు మరకలు.. వంటగదిలో బిర్యానీ పాత్ర
అనుమానితుల నివాసంగా భావిస్తున్న ఇంటికి పోలీసులు వెళ్లినప్పుడు అక్కడ రక్తపు మరకలు కనిపించినట్లు సమాచారం. వంటగదిలో పెద్ద బిర్యానీ పాత్ర కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా చేయడంతో పాటు హత్యకు సంబంధించిన ఆధారాలను నాశనం చేసేందుకు కొన్ని శరీర భాగాలను ఆ పాత్రలో ఉడికించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో మృతురాలిని ఒడిశాకు చెందిన హయాత్ నిషాగా గుర్తించినట్లు సమాచారం. ఆమె భర్త నుంచి విడిపోయిన తర్వాత చెన్నైలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు 19 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు తాంబరంలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించినట్లు సమాచారం.
దంపతులపై అనుమానం
హయాత్ నిషాతో కలిసి నివసిస్తున్న ఓ దంపతులే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత విభేదాలు, ఆర్థిక వ్యవహారాలు లేదా ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం అనుమానిత దంపతులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అదే సమయంలో మృతదేహానికి సంబంధించిన మిగిలిన భాగాలను కూడా పోలీసులు వెతుకుతున్నారు. ముఖ్యంగా బాధితురాలి తలను గుర్తించడం దర్యాప్తులో కీలకంగా మారింది.
సీసీటీవీ ఫుటేజీ, రక్తపు మరకలు, ఇంట్లో లభించిన వస్తువులు, రైలులో లభించిన సూట్‌కేస్ వంటి ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాతే హత్య వెనుక ఉన్న అసలు కారణం, ఘటన ఎలా జరిగింది, మృతదేహాన్ని ఎందుకు ముక్కలు చేశారనే విషయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
