చార్లీ కిర్క్ ను అందుకే చంపాడట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
అమెరికా కన్జర్వేటివ్ ఉద్యమంలో ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందిన చార్లీ కిర్క్ (31) హత్య కేసు విచారణలో ఆశ్చర్యపరిచే విషయాలు బయటకొస్తున్నాయి.
By: A.N.Kumar | 17 Sept 2025 4:06 PM ISTఅమెరికా కన్జర్వేటివ్ ఉద్యమంలో ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందిన చార్లీ కిర్క్ (31) హత్య కేసు విచారణలో ఆశ్చర్యపరిచే విషయాలు బయటకొస్తున్నాయి. టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ వ్యవస్థాపకుడైన కిర్క్‌ను సెప్టెంబర్ 10న ఉటా వ్యాలీ యూనివర్సిటీలో అమెరికన్ కమ్‌బ్యాక్ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసంగం చేస్తున్న వేళ కాల్చి చంపారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగానే కాల్పులు జరగడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘టైలర్ రాబిన్‌సన్ (22)’ను పోలీసులు కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆయన ప్రణాళికాబద్ధంగానే కిర్క్‌ను చంపాడని నిర్ధారణ అయింది. రాబిన్‌సన్ తన ట్రాన్స్‌జెండర్ భాగస్వామితో చేసిన చాటింగ్‌లోనే హత్య ఉద్దేశ్యాలను వెల్లడించినట్లు కోర్టు పత్రాల్లో ఉంది.
“అతనిపై (కిర్క్‌పై) ద్వేషం భరించలేకపోతున్నా. కొన్ని ద్వేషాలు ఎప్పటికీ తగ్గవు” అని రాబిన్‌సన్ తన భాగస్వామికి మెసేజ్ చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాదు, హత్యకు వారం రోజుల ముందే కిర్క్‌ను చంపాలన్న ప్రణాళికను కాగితంపై రాసుకున్నాడు. కంప్యూటర్ కీబోర్డ్ కింద “అవకాశం దొరికితే కిర్క్‌ను అంతమొందిస్తా” అని రాసిన నోట్ కూడా దొరికింది.
కాల్పుల ఘటన తర్వాత రాబిన్‌సన్ తన భాగస్వామికి మెసేజ్ పంపి, ఇది సరదా కాదని స్పష్టం చేశాడు. “హత్య తర్వాత దాచిన రైఫిల్‌ను తీసుకోవాల్సి ఉంది. నేను చిక్కుకుపోయాను. ఇందులోకి నిన్ను లాగినందుకు క్షమించు” అని పేర్కొన్నాడు. అంతేకాదు, తాను పట్టుబడితే నువ్వు ఏమీ చెప్పొద్దని హెచ్చరించాడు.
ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించిన దర్యాప్తు సంస్థలు రాబిన్‌సన్‌ను వాషింగ్టన్ కౌంటీ జైలుకు తరలించాయి. హత్యకు ఉపయోగించిన రైఫిల్‌ను ఘటనా స్థల సమీపంలోని పొదల్లో దాచిన చోటు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతనిపై ఏడు కేసులు నమోదు కాగా, దోషిగా తేలితే మరణశిక్ష తప్పదని న్యాయవర్గాలు చెబుతున్నాయి.
రాబిన్‌సన్ తల్లి ప్రకారం.. కొంతకాలంగా తన కొడుకు ట్రాన్స్‌జెండర్ భాగస్వామితో ఉన్న సంబంధాల వల్ల ఆలోచనల్లో మార్పు వచ్చిందని, రాజకీయంగా వామపక్ష భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడని తెలిపారు.
రాబిన్సన్ ప్రియుడు లాన్స్ ట్విగ్స్, అతడి మెసేజ్‌లను ఫెడరల్ దర్యాప్తుదారులకు అందజేయడంతో కేసులో కొత్త కోణాలు బయటపడ్డాయి. అదేవిధంగా, పోలీసులు రాబిన్సన్ ఇంటిపై సోదాలు నిర్వహించి, వదిలేసిన తుపాకీకి సంబంధించిన షెల్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసింగ్‌పై ప్రత్యేక ఎచింగ్‌లు ఉన్నట్లు గుర్తించారు.
మరోవైపు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ స్పందిస్తూ, రాబిన్‌సన్ డిస్‌కార్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో కొందరితో జరిపిన చాటింగ్‌లను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఈ కేసు అమెరికాలో పెద్ద చర్చనీయాంశమైంది. కన్జర్వేటివ్ భావజాలం, అలాగే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీపై కిర్క్ చేసిన విమర్శలే ఈ హత్యకు మూలకారణమని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. కోర్టు పత్రాల్లో బయటపడిన వాస్తవాలు అమెరికా రాజకీయాల్లో మళ్లీ భిన్నాభిప్రాయాల దిశగా మంటలు రేపుతున్నాయి.
