మొబైల్ ఐఎంఈఐ నెంబరు మారిస్తే అంత కఠిన శిక్ష
ప్రతి ఒక్కరికి పేరు ఎలా ఉంటుందో.. మనం వాడే మొబైల్ ఫోన్ కు ఒక పేరు ఉంటుంది. అయితే.. అది డిజిటల్ రూపంలో ఉంటుంది.
By: Garuda Media | 18 Nov 2025 4:00 PM ISTప్రతి ఒక్కరికి పేరు ఎలా ఉంటుందో.. మనం వాడే మొబైల్ ఫోన్ కు ఒక పేరు ఉంటుంది. అయితే.. అది డిజిటల్ రూపంలో ఉంటుంది. దాన్నే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్కిప్ మెంట్ ఐడెంటిటీ (సింఫుల్ గా చెప్పాలంటే ఐఎంఈఐ)గా చెప్పొచ్చు. పదిహేను అంకెలు ఉండే ఈ ఐఎంఈఐను కొందరు మార్చేస్తుంటారు. దీనిపై తాజాగా టెలికం విభాగం (డాట్) కీలక హెచ్చరిక చేసింది.
ఐఎంఈఐను మార్చటం నాన్ బెయిలబుల్ నేరాల కిందకు వస్తుందని స్పష్టంచేసింది అంతేకాదు.. ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి మూడేళ్ల వరకు జైలుశిక్షను విధించటం.. రూ.50 లక్షల వరకు ఫైన్ లేదంటే.. రెండు శిక్షల్ని ఒకేసారి కలిపి విధించొచ్చన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఐఎంఈఐ విషయంలో చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో కావాలని.. ఈ విషయంలో ఏ చిన్న తప్పునకు అవకాశం ఇవ్వొద్దంటూ సెల్ ఫోన్ తయారీ సంస్థలు.. బ్రాండ్ యజమానులు.. దిగుమతిదారులు.. అమ్మకాల్ని నిర్వహించే నిర్వాహకులకు స్పష్టం చేసింది.
ధ్రువీకరణ మార్చిన సెల్ ఫోన్.. మోడెమ్.. మాడ్యుల్.. సిమ్ బాక్సులు ఉద్దేశపూర్వకంగా కలిగి ఉండటం నేరంగా పేర్కొంది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలు కలిగి ఉండటం కూడా నేరమన్న విషయాన్ని డాట్ స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ తరహా పరికరాలు కలిగి ఉండటం టెలికాం సైబర్ సెక్యూరిటీ చట్ట నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. దేశీయంగా తయారు చేసి అమ్మే సెల్ ఫోన్.. మోడమ్.. మాడ్యూల్.. సిమ్ బాక్సుల ఐఎంఈఐ నంబర్ ను ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొంది. దిగుమతిదారులు సైతం డివైస్సేతు పోర్టల్ లో నమోదు చేయాలని పేర్కొంది. కొందరు ఐఎంఈఐ ను ట్యాంపరింగ్ కు పాల్పడుతుంటారు. అలాంటిది ఎంత తీవ్రమైన నేరమన్న విషయాన్ని గుర్తించటం తప్పనిసరి.
