ఉద్యోగులు కంపెనీలు మారితేనే భారీ హైక్ వస్తుందా?
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన శ్రష్టి అనే యువతి కెరీర్ ప్రయాణం ఈ చర్చను మళ్ళీ రాజేసింది.
By: A.N.Kumar | 29 Sept 2026 7:00 AM ISTప్రతి రోజూ ఉదయాన్నే ఆఫీసు బాట పట్టే సగటు ఉద్యోగి మనసులో ఒకే ఒక్క ఆశ ఉంటుంది. "ఈ ఏడాదైనా నా కష్టానికి తగిన ఫలితం దక్కుతుందా? నా శ్రమకు తగ్గట్టుగా జీతం పెరుగుతుందా?" అని... ప్రతిరోజూ గంటల తరబడి చెమటోడ్చి.. వీకెండ్స్‌ను సైతం త్యాగం చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కానీ ఏడాది చివర్లో చేతికి వచ్చే 5 లేదా 10 శాతం ఇన్‌క్రిమెంట్ చూసినప్పుడు.. కళ్ళలో నీళ్లు తిరగని ఉద్యోగి ఉండడంటే అతిశయోక్తి కాదు. మన శ్రమను గుర్తించలేదా అనే వేదన.. కుటుంబ అవసరాలు తీర్చలేకపోతున్నామనే బాధ మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది... "ఒకే కంపెనీని నమ్ముకుని ఉండిపోవడమే మనం చేస్తున్న పొరపాటా? కంపెనీ మారితేనే మన జీవితాలు మారతాయా?" అన్న సందేహాలు బోలెడు ఉన్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన శ్రష్టి అనే యువతి కెరీర్ ప్రయాణం ఈ చర్చను మళ్ళీ రాజేసింది. ఐదేళ్ల క్రితం కేవలం రూ. 5 లక్షల వార్షిక ప్యాకేజీతో (ఎల్.పీఏ) తన ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రష్టి.. ఈరోజు రూ. 30 లక్షల ప్యాకేజీకి చేరుకుంది. అంటే దాదాపు ఆరు రెట్ల ఎదుగుదల.. మొదటిసారి కంపెనీ మారినప్పుడు ఏకంగా 100 శాతం హైక్ రాగా.. ఆ తర్వాత ప్రతి మార్పులో 30 నుండి 50 శాతం జీతం పెరిగింది. ఇది కేవలం ఒక శ్రష్టి కథ మాత్రమే కాదు... ఎంతోమంది ఐటీ, టెక్ రంగ ఉద్యోగుల గుండెచప్పుడు.
ఒక కంపెనీలో ఏళ్లకు ఏళ్లు కష్టపడినా రాని గుర్తింపు, జీతం... ఒకే ఒక్క ఆఫర్ లెటర్‌తో వేరే కంపెనీ ఎలా ఇవ్వగలుగుతోంది? ఎందుకంటే మనం ఉన్న చోటే ఉంటే అది 'అలవాటుగా' మారిపోతుంది.. కానీ కొత్త చోటికి వెళ్తేనే మన 'మార్కెట్ విలువ' ఏంటో తెలుస్తుంది. నైపుణ్యాలకు డిమాండ్ ఉన్న ఈ రోజుల్లో జీతం పెరగడానికి కంపెనీలు మారడం ఒక బలమైన ఆయుధంగా మారింది.
అయితే కేవలం డబ్బు కోసమే తరచూ ఉద్యోగాలు మారడం అంత శ్రేయస్కరం కాదు. అతిగా కంపెనీలు మారితే రెజ్యూమేలో స్థిరత్వం లోపించి భవిష్యత్తుపై దెబ్బపడే ప్రమాదం ఉంది. పైగా ఆఫర్ లెటర్‌లో కనిపిచే సిటిసి అంతా చేతికి రాకపోవచ్చు. ఇన్ హ్యాండ్ శాలరీ, వర్క్ కల్చర్, ఉద్యోగ భద్రతలను బేరీజు వేసుకోవడం చాలా అవసరం.
చివరిగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే... "ఎక్కువ కంపెనీలు మారితే ఎక్కువ జీతం వస్తుంది అనేదాని కంటే మన నైపుణ్యాల విలువ పెరిగినప్పుడే నిజమైన పెంపు సాధ్యమవుతుంది." ఒకే చోట ఉండి ఎదుగుదల లేక నలిగిపోతున్నప్పుడు దాన్ని వదిలిపెట్టి కొత్త దారి వెతుక్కోవడంలో తప్పులేదు. కానీ మారే ప్రతి అడుగు మనలోని నైపుణ్యాన్ని.. ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేదిగా ఉండాలి. ఉద్యోగం మార్చడం జీతం పెంచుకోవడానికి ఒక మార్గం మాత్రమే కావచ్చు.. కానీ మీ కష్టానికి సరైన విలువను పొందే హక్కు మీకు ఎప్పుడూ ఉంటుంది.
