బాబు ఔదార్యం: మహిళలకు మరిన్ని.. ఎప్పటి నుంచంటే!
ఏపీ సీఎం చంద్రబాబు.. వ్యూహం వేస్తే.. ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే. ఇప్పుడు ఆయన అదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
By: Garuda Media | 29 Sept 2025 5:30 PM ISTఏపీ సీఎం చంద్రబాబు.. వ్యూహం వేస్తే.. ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే. ఇప్పుడు ఆయన అదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వ్యూహాత్మంగా ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా గత ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో మెజారిటీ పథకాలను మహిళలకు కేటాయించారు. మొత్తం ఆరు సూపర్ సిక్స్ ఉంటే..
వీటిలో....
1) తల్లికి వందనం,
2) ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం,
3) ఆడబిడ్డ నిధి.
ఈ మూడు కూడా మహిళలకు కేటాయించారు. వీటిలో ఒక్క ఆడబిడ్డ నిధి మాత్రమే అమలు కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి నాటికి దీనిని అమలు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. ఇక, తాజాగా మరో రెండు కీలక పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో చేరువ అవుతున్నాయి.
1) ఎన్టీఆర్ విద్యాలక్ష్మి,
2) ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి.
ఈ రెండు పథకాలను కూడా బాలికల నుంచి యువతుల వరకు అమలు చేయనున్నారు. తద్వారా మహిళల ఓటు బ్యాంకు బెసిగి పోకుండా చూసుకుంటున్నారు.
1) ఎన్టీఆర్ విద్యాలక్ష్మి: ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల్లోని మహిళలు అర్హులు అవుతారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరికీ ఒక్కొక్కరి చొప్పున రూ.10 వేల నుంచి లక్ష వరకు.. రుణంగా అందిస్తారు. అత్యంత స్వల్ప వడ్డీలకు మాత్రమే ఈ రుణాలు ఇస్తారు. తద్వారా బాలికల విద్యకు పడే ఫీజుల భారం నుంచి తల్లులకు విముక్తి కలిగిస్తారు. తీసుకున్నరుణానికి అనుగుణంగా ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశం కల్పిస్తారు. అంతేకాదు.. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే వారి ఖాతాలకు సొమ్ము చేకూరుతుంది.
2) ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి: ఇళ్లలోని యువతుల వివాహాలకు చేయూతనిచ్చేలా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. దీనిని కూడా డ్వాక్రా సంఘంలోని మహిళలకే కేటాయిస్తారు. వివాహ అవసరం కోసం రూ.10 వేల నుంచి లక్ష వరకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తారు. దీనికి కూడా పావలా వడ్డీనే వర్తిస్తుంది. ఈ ఎంఐల రూపంలో దీనిని తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తారు. దీనిని కూడా మూడు రోజుల్లోనే బ్యాంకులు అనుమతించి రుణాలు ఇస్తాయి. ఈ రెండు పథకాలతో పేదల కుటుంబాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
