Begin typing your search above and press return to search.

కొత్త జగన్ కనిపించాలి అపుడే...!

రాజకీయాలు సినిమాలకు ఎంతో సారూప్యం ఉంది. రెండింటికీ జనామోదం ఉండాలి. ప్రజల ఆలోచనల మేరకే రెండు చోట్ల వ్యూహాలు ఉండాలి.

By:  Satya P   |   7 Aug 2025 2:00 PM IST
కొత్త జగన్ కనిపించాలి అపుడే...!
X

రాజకీయాలు సినిమాలకు ఎంతో సారూప్యం ఉంది. రెండింటికీ జనామోదం ఉండాలి. ప్రజల ఆలోచనల మేరకే రెండు చోట్ల వ్యూహాలు ఉండాలి. అపుడే సక్సెస్ రేటు ఉంటుంది. ఈ విజయ సూత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఆయన ప్రతీ ఎన్నికలో ఒక కొత్త నినాదం అందుకుంటారు. తాను కూడా సరికొత్తగా మారి జనం ముందుకు వస్తారు. టీడీపీలో బాబు రాజకీయ వ్యూహాలు చూస్తే అదే అర్ధం అవుతుంది.

మొదటి నుంచి అలాగే :

చంద్రబాబు టీడీపీ సారధిగా ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కార్గిల్ యుద్ధం తరువాత జరిగిన ఆ ఎన్నికల్లో దేశం ముఖ్యమని బాబు ప్రచారం చేశారు. ఇక 2004 ఎన్నికల్లో ఆయన మావోయిస్టుల దాడి నుంచి బయట పడి వచ్చారు. దాంతో అపుడు ఉమ్మడి ఏపీ లా అండ్ ఆర్డర్ వంటి వాటి మీదనే ప్రచారం జరిగింది. 2009లో ఆల్ ఫ్రీ అంటూ ఆయన కాంగ్రెస్ ని మించేశారు 2014లో నవ్యాంధ్రాకు బాబు మోడీ జోడీ అంటూ ముందుకు వచ్చారు. 2019లో అయితే అమరావతి రాజధాని అని జనంలోకి వెళ్ళారు. 2024లో విధ్వంసం అయిన ఏపీ పునర్నిర్మాణం అని మళ్ళీ జనాభిప్రాయం కోరారు. ఈ సమయాల్లో కేవలం నినాదాలతోనే సరిపెట్టకుండా పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు సైతం పెట్టుకుని బాబు విజయాలు సాధించిన సంగతి గుర్తు చేసుకోవాలి.

జనాల ఆలోచనలలో ఉండేలా :

ఇక ఎన్నికల్లో జనాలు తమ గురించి ఆలోచించేలా నినాదాలు విధానాలు ఉండాలి. ప్రజల మధ్య చర్చ జరిగేలా పార్టీ వ్యవహారం అంతా ఉండాలి. అలా చంద్రబాబు ఓడినా గెలిచినా జనంలో టీడీపీని ఎప్పటికపుడు కొత్తగా ఉంచుతూ తాను కూడా కొత్తగా బాబుని అని చెప్పుకుంటూ వస్తున్నారు. దాంతో జనాలు సైతం అవును కదా అని ఆ వైపుగా మొగ్గు చూపేందుకు ఆస్కారం ఏర్పడుతోది.

వైసీపీ తీరు ఇలా :

వైసీపీ మీద జనాలకు అటెన్షన్ ఫోకస్ 2014లో ఏర్పడడానికి కారణం వైఎస్సార్ అని చెప్పాలి. అలాగే జగన్ పదహారు నెలల జైలు జీవితం అని కూడా చెప్పాలి. ఇక 2019 నాటికి అయితే వైఎస్సార్ పాలనను జగన్ తెస్తారని జనాలు ఆశ పెంచుకోవడం జరిగింది. అంతే కాదు జగన్ సీఎం అయితే ఎలా చేస్తారో అన్న ఆసక్తి కూడా ఆ పార్టీకి ఓటెత్తేలా చేశాయని విశ్లేషణలు ఉన్నాయి. మరి 2024లో వైసీపీ ఓటమికి కారణాలు అనేకం ఉన్నాయి.

యాంటీ ఇంకెంబెన్సీ ఆయుధమా :

ఎల్ల వేళలా యాంటీ ఇంకెంబెన్సీయే విజయాలు అందించదు. అంతే కాదు గెలిచేందుకు ఆ పార్టీ చేయాల్సినవి అన్నీ చేయాలి తమ పార్టీని ఎన్నుకోవాలన్న అనురక్తిని కలిగించాలి. వైసీపీ వైపు నుంచి చూస్తే అంతా రొటీన్ గానే సాగిపోతోంది. జగన్ స్పీచ్ మారలేదు, తీరు మారలేదు, ఆయన వైఖరిలో మార్పు లేదు, పార్టీ ఫిలాసఫీలో మార్పు లేదు అని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అన్నీ తప్పులే చేయదు, అలా అని ఒప్పులే అన్నీ చేయదు. తప్పులు చేశామని తమ దృష్టికి వచ్చిన వాటిని సవరించుకోవాలని అనుకుంటుంది. వైసీపీలో అలాంటి ఆంత విమర్శ ఉండాలని అది జనాలకు తెలిసేలా కూడా జరగాలని అంతా కోరుకుంటున్నారు.

జగన్ స్టైల్ మార్చాల్సిందేనా :

జగన్ స్పీచ్ కూడా మారాలని అంటున్నారు. ఆయన సూటిగా స్పష్టంగా చెప్పాల్సింది చెప్పాలని అంతే తప్ప దేవుడు అంతా చూసుకుంటారు, ప్రజలు చూసుకుంటారు అన్న పడికట్టు మాటల వల్ల అయితే ఈసారి అయ్యేది పెద్దగా ఉండదని అంటున్నారు. తమ పార్టీ ఏమి చేసిందో చెప్పుకోవడం అలాగే ఏమి చేయగలదో చెప్పడం చేయాలని అంటున్నారు. మరీ ముఖ్యంగా బాబు సెంట్రిక్ పాలిటిక్స్ ని వీడి జనం సెంట్రిక్ పాలిటిక్స్ కి చోటు ఇవ్వాలని అంటున్నారు. ప్రత్యర్థి చంద్రబాబు అయినా అధికారం ఇచ్చేది జనాలు కాబట్టి వారిని తాను మెప్పించి ఒప్పించేందుకు చూడాలి తప్ప బాబుని ఘాటుగా విమర్శిస్తే కుదిరేది కాదన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు, ప్రజలే అంతిమ నిర్ణేతలు అందువల్ల వాళ్ళకు జవాబుదారిగా ఉన్న పార్టీలకే విజయాలు దక్కుతాయని తలపండిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.