Begin typing your search above and press return to search.

విశాఖ జనాలు ఉన్నారే...బీచ్ సాక్షిగా బాబు

విశాఖకు పదే పదే బాబు టూర్లు వేస్తున్నారు. వచ్చిన ప్రతీ సారి తీరిక లేని కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు.

By:  Satya P   |   18 Sept 2025 10:00 AM IST
విశాఖ జనాలు ఉన్నారే...బీచ్ సాక్షిగా బాబు
X

విశాఖకు పదే పదే బాబు టూర్లు వేస్తున్నారు. వచ్చిన ప్రతీ సారి తీరిక లేని కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. తాజాగా ఆయన మూడు కార్యక్రమాలలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కలసి ఆయా కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన విశాఖ నుంచి మొదలెట్టి ఇంటర్నేషనల్ దాకా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. విశాఖ గురించి బాబు మాట్లాడింది ఈ సందర్భంగా హైలెట్ అని చెప్పాలి.

విశాఖ వాసులు మంచోళ్ళు :

విశాఖ వాసులు ఎంతో మంచివారో ఎంత శాంతికాముకులో అని ఒక రేంజిలో బాబు పొగిడేశారు. అభివృద్ధిని కోరుకుంటారు. ప్రజలంతా ఒక్కటిగా ఉంటారు. మంచిగా వ్యవహరిస్తారు అంటూ బాబు ఒక్కటే పొగడ్తలతో ముంచెత్తారు. విశాఖకు ఎంతైనా చేయాల్సి ఉంది. ఇది ఒక మహా నగరం. అభివృద్ధికి చిరునామా అని కూడా సిటీ ఆఫ్ డెస్టినీ కి కితాబు ఇచ్చారు అంతే కాదు సేఫెస్ట్ సిటీ అని కూడా బాబు కొత్త మాట చెప్పారు. చక్కని సముద్రం, ఎత్తైన అందమైన కొండలు మధ్య నగరం, అన్నింటికీ మించి విశాఖ జనాలు ఉన్నారే అని బాబు మొదలెడితే ఇక హుషారు ఆపుకోవడం ఎవరి తరం. విశాఖ తనకు ఎంతో ఇష్టమైన నగరం, తనకు ఎంతో మెచ్చిన నగరం అని కూడా బాబు గుండెల్లో పెట్టేసుకున్నారు.

గూగుల్ తో గుడ్ న్యూస్ :

బాబు విశాఖ వచ్చిన ప్రతీసారీ ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఒక సంచలనం క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఈసారి కూడా ఆయన తన వెంట గిఫ్ట్ పట్టుకొచ్చారు. విశాఖకు ఆ విధంగా గుడ్ న్యూస్ వినిపించారు. విశాఖకు అక్టోబర్ లోనే ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థ గూగుల్‌కు చెందిన డేటా సెంటర్‌ వస్తోంది అని బాబు ప్రకటించారు. దాంతో విశాఖ ఐటీకి కేరాఫ్ అవుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు తలమానికంగా నిలిచే భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చే ఏడాది మొదలవుతోంది అని కూడా చెప్పారు.

అభివృద్ధికి రెడీ :

విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తామని బాబు ప్రకటించారు. వరసబెట్టి ఎన్నో ఐటీ పరిశ్రమలు విశాఖ రానున్నాయని ఆయన చెప్పారు. విశాఖ ఐటీ రాజధానిగానే కాదు ఏపీకే తలమానికంగా మారుతోంది అని జీసీసీ బిజినెస్ సమ్మిట్ లో బాబు చెప్పారు. విశాఖ వంటి నగరాలను కేంద్రం సాయంతో మెగా సిటీలుగా చేస్తామని చెప్పారు. ఏపీలోని తిరుపతి దాకా కీలక నగరలను అభివృద్ధి చేసే అజెండాతో తమ ప్రభుత్వం పనిచేస్తోంది అని అన్నారు. మొత్తానికి చంద్రబాబు విశాఖ తరచూ రావడమే కాదు విశాఖ బ్యూటీని విశాఖ వాసుల హార్ట్ ని కూడా చూసి మరీ గ్రీట్ చేస్తున్నారు అంటే విశాఖ వాసులు ఊరుకుంటారా థాంక్యూ బాబు అంటూ వెల్ కం చెబుతూనే ఉంటారు కదా. దటీజ్ బాబు అంతే.