వెలిగొండ ప్రాజెక్ట్...బాబు మార్క్ రికార్డు
ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి తన హయాంలో భారీ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టి మళ్లీ తానే పూర్తి చేసి ప్రారంభించడం అంటే రికార్డే మరి
By: Satya P | 28 Aug 2026 7:24 PM ISTఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి తన హయాంలో భారీ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టి మళ్లీ తానే పూర్తి చేసి ప్రారంభించడం అంటే రికార్డే మరి. ఆ అరుదైన ఘనతను ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించారు. ఇది చాలా అరుదు అని ఎందుకు అనాల్సి వస్తోంది అంటే భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం మామూలు విషయం కాదు దశాబ్దాల కాలం పడుతుంది. అంత వరకూ ఒక రాజకీయ నాయకుడు అగ్రశ్రేణి నేతగా కొనసాగడం ప్రభుత్వంలో ఉండడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, కానీ బాబు మూడు దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రోజూ ఉన్నారు. ఈ మధ్యలో ఆయన అనేక సార్లు సీఎం అయ్యారు. అందుకే ఆయన హయాంలోనే పురుడు పోసుకుని ఆయన చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఈ నెల 31న ప్రారంభం కాబోతోంది. ఇది చాలా గొప్ప విషయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగంతో ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం.
మొదటి దశ పనులు పూర్తి :
ఇదిలా ఉంటే చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 31న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను అధికారికంగా ప్రారంభించనున్నారు. మార్కాపురంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆయన నల్లమల సాగర్‌లోకి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అది కూడా ఆగస్టు నెలలో. మళ్ళీ రిగ్గా 30 ఏళ్ల తర్వాత మళ్లీ తన చేతుల మీదుగానే దీనిని ప్రారంభించే అవకాశం దక్కడంపై చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందుతుంది. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం చూపనుంది.మొదటి దశ సాగునీరు ద్వారా దాదాపు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసం కింద కూటమి ప్రభుత్వం కేవలం 48 రోజుల్లోనే 768 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అదనంగా అర్హులైన 18 ఏళ్లు నిండిన యువతకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు మరో 169 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు.
అందరికీ ఆదుకుంటాం :
ఇదిలా ఉంటే ఇంత భారీ నీటి ప్రాజెక్ట్ కోసం తమ భూములనే కాదు అన్నీ త్యాగం చేసిన అర్హులైన ప్రతి నిర్వాసితుడిని ఆదుకుంటామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ పరిహారం అందించే క్రమంలో ప్రభుత్వంపై అదనంగా సుమారు 169 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఆ భారాన్ని లెక్కచేయకుండా ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేయాలనే మానవతా దృక్పథంతో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రైతులు, ప్రజలకు ప్రయోజనం కల్పించడం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుల కోసం తమ భూములు, ఆస్తులు, స్వగ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల జీవితాల్లో వెలుగు నింపడం కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ఇక వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటి భద్రత కల్పించడంతో పాటు,ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. గడచిన రెండేళ్లలో 2,250 కోట్ల రూపాయలు పైగా వ్యయం చేశామని ఆయన చెప్పారు.
