Begin typing your search above and press return to search.

తుగ్లక్ పాలన...బాబు సంచలనం

ఏపీలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. ఆ పార్టీ మీద టీడీపీ కూటమి ప్రత్యేకించి టీడీపీ ప్రతీ రోజూ విమర్శలు చేస్తూనే ఉంటుంది.

By:  Satya P   |   1 Oct 2025 7:45 PM IST
తుగ్లక్ పాలన...బాబు సంచలనం
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాట అయినా చాలా ఆలోచించి మాట్లాడుతారు. అందులో కూడా ఎన్నో వ్యూహాలు ఉంటాయి. ఆయన జనం మదిలో చేరాలనే ప్రతీ విషయం చెబుతూంటారు సానుకూలమైన అంశం అయితే కచ్చితంగా ఒకటికి పది సార్లు చెబుతారు ఎంతో ఓపికగా కూడా చెబుతారు. అదే ప్రత్యర్థుల మీద విమర్శలు అయినా అంతే సౌండ్ చేసి చెబుతారు. ఇది కూడా జనాల మనసులో రిజిస్టర్ కావాలని ఆయన చెబుతారు. మొత్తం మీద చూస్తే కనుక చంద్రబాబు నోట ఒక మాట వచ్చింది అంటే అది ఎంతో స్ట్రాంగ్ గా ఉండడమే కాదు అనుకున్న లక్ష్యాన్ని చేదిస్తుంది అని అంటారు.

తుగ్లక్ ఎవరు అంటే :

చంద్రబాబు సామాజిక పెన్షన్ పంపిణీ విషయంలో ఒక పద్ధతి ప్రకారం జనం దగ్గరకు వెళ్తున్నారు. ప్రతీ నెలా ఇచ్చే పెన్షన్ కదా అని అనుకోవడం లేదు. ఏ నెలకు ఆ నెల ఇస్తున్నట్లుగా అది కొత్త పధకం గానే ఆయన జనాలకు చెబుతున్నారు. పెన్షన్ ఘనత తమదే అని జనాల బుర్రల్లో గట్టిగానే చాటుతున్నారు. అంతే కాదు ప్రత్యర్థుల మీద విమర్శలు అదే స్థాయిలో ఎక్కు పెడుతున్నారు. అక్టోబర్ పెన్షన్ల పంపిణీ కోసం ఆయన విజయనగరం జిల్లా దత్తిరాజేరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుగ్లక్ పాలన పోయింది అని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు ఆ విధంగా మేలు జరిగిందని స్వేచ్చ వచ్చిందని చెప్పారు.

వైసీపీని డిఫెన్స్ లో :

ఏపీలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. ఆ పార్టీ మీద టీడీపీ కూటమి ప్రత్యేకించి టీడీపీ ప్రతీ రోజూ విమర్శలు చేస్తూనే ఉంటుంది. చిత్రమేంటి అంటే దానికి కౌంటర్లు ఇచ్చే పరిస్థితి మాత్రం వైసీపీలో ఎక్కడా కనిపించడం లేదు అని అంటున్నారు. వైసీపీ ఈ స్ట్రాటజీలో బాగా వెనకబడిపోతోంది. అదే సమయంలో జగన్ పాలన గురించే కాదు ఆయన క్యారెక్టర్ మీద కూడా టీడీపీ విమర్శలు చేస్తోంది. అసెంబ్లీలో బాలయ్య సైకో గాడు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇపుడు చంద్రబాబు అయితే తుగ్లక్ అనేశారు. అయితే ఇది మొదటి సారి మాత్రం కాదు ఇంతకు ముందు ఎన్నో సార్లు టీడీపీ వారు ఇదే విమర్శలు జగన్ మీద చేశారు అని గుర్తు చేస్తున్నారు.

ఒక్క విమర్శతో ఎన్నో :

నిజానికి తుగ్లక్ గురించి చరిత్ర లో ఉన్నది ఏమిటి అంటే ఆయన రాజధానులను మార్చారని సరైన నిర్ణయాలు తీసుకోకుండా నిలకడ లేకుండా వ్యవహరించారు అని దానినే జగన్ కి అపాదిస్తూ ఈ విమర్శలు చేశారు అని భావించాలి. జగన్ మూడు రాజధానులు ప్రస్తావించారు. అది అమలు కాలేదు, కానీ ఆయనకు తుగ్లక్ బిరుదుని మాత్రం టీడీపీ పెట్టేసింది. అది విపక్షంలో ఉన్నపుడే కాదు అధికారంలో ఉన్నపుడు కూడా పదే పదే చేస్తూ జనంలో ఆ వ్యతిరేక భావన అలాగే ఉండేలా తగిన జాగ్రత్తలు పడుతున్నారు అని విశ్లేషిస్తున్నారు.

జనాలకు ఎక్కుతోందా :

తుగ్లక్ అన్నది అతి పెద్ద విమర్శగానే చూస్తున్నారు. పైగా ఒక పరిపాలకుని విషయంలో చూస్తే దీనిని నెగిటివ్ గానే తీసుకుంటారు. అయితే ఈ తరహా విమర్శలు టీడీపీ ఎన్ని చేసినా వైసీపీ వైపు నుంచి సరైన కౌంటర్లు ఉండవని అది ఆ పార్టీ బలహీనతగానే చూస్తున్నారు. అదే సమయంలో వైసీపీ కూడా లైట్ తీసుకుంటుంది అంటారు. బాబు మాటలను ఎవరూ నమ్మరని భావిస్తూ ఉంటుందని చెబుతారు. అయితే 2024 ఎన్నికలు బాబుని జనాలు నమ్మారని పూర్తిగా నిరూపించిన నేపథ్యంలో ఈ తరహా ఘాటు విమర్శల పట్ల వైసీపీ తగిన తీరున స్పందించాల్సి ఉందని అంటున్నారు. రాజకీయ విమర్శలు వేరు వ్యక్తిగత హననం వేరు. ఈ రెండూ కలగాపులగం అవుతున్న రాజకీయాల్లో నష్టం ఎవరికి అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది.