పాన్ ఐఐటీ అల్యూమ్ని.. ఏపీ కోసం చంద్రబాబు టెక్ వ్యూహం!
ఏపీని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త పారిశ్రామిక విధానాలతో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
By: Tupaki Political Desk | 16 Sept 2026 2:00 PM ISTఏపీని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త పారిశ్రామిక విధానాలతో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. మరోవైపు టెక్నాలజీ ద్వారా ఎకానమీని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోందని అంటున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం నుంచి స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి మారిన ప్రభుత్వం ఇప్పుడు మరో సరికొత్త వ్యూహాన్ని రచించింది. వచ్చేనెల 3న విజయవాడలో పాన్ ఐఐటీ అల్యూమ్ని సదస్సు నిర్వహించడం ద్వారా ఆధునిక టెక్ పరిశ్రమలు, అనుబంధ రంగాలలో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న టెక్ నిపుణులు, ఐఐటీయన్లను ఆహ్వానిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ వ్యూహాంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రాన్ని అత్యాధునిక సాంకేతిక రంగానికి కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా అక్టోబరు 3న ‘పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. స్వర్ణాంధ్ర టు వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనే ధ్యేయంగా సదస్సును రూపొందించారు. విజయవాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. పాన్ ఐఐటీ అల్యూమ్ని ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, ప్రభుత్వ-పరిశ్రమల భాగస్వామ్యం కోసం ఇలాంటి సదస్సులను, గ్లోబల్ సమ్మిట్‌లను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తోంది. గతంలో బెంగళూరు, ముంబై నగరాలలో ‘పాన్ ఐఐటీ వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ’ (PIWOT) పేరిట భారీ సాంకేతిక సదస్సులను నిర్వహించి, స్టార్టప్‌లు, పరిశ్రమల అనుసంధానానికి పెద్దపీట వేసినట్లు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఇవే కాకుండా ఢిల్లీ, హైదరాబాద్, గౌహతి వంటి ప్రాంతాలలో కూడా కృత్రిమ మేధస్సు (AI), టెక్నాలజీ ఆధారిత వృద్ధి (Tech4Bharat) లక్ష్యంగా అనేక కార్యక్రమాలు జరిగాయని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏఐ, క్యాంటం కంప్యూటింగ్, డీప్ టెక్ వంటి ఆధునిక టెక్నాలజీకి కేంద్రంగా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం విజయవాడలో కూడా జాతీయస్థాయి సదస్సు నిర్వహణకు ప్రణాళిక రూపొందించిందని చెబుతున్నారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఈ సదస్సు ప్రత్యేకించి రాష్ట్ర స్థాయి డీప్‌టెచ్ ఎకోసిస్టమ్‌ను పటిష్టం చేయడంతోపాటు గ్లోబల్ ఐఐటీ నెట్‌వర్క్‌ను స్థానిక యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో డీప్‌టెచ్ (DeepTech) రంగాన్ని ప్రోత్సహించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీస్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రిటెక్, బయోటెక్నాలజీ వంటి సంక్లిష్టమైన, శాస్త్రీయ ఆధారిత సాంకేతికతలలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం, ఐఐటీ నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలు కలిసి పనిచేసేలా ఒక బలమైన వేదికను సృష్టించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వివరిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థకు జరిగే మేలు!
ఈ సదస్సు నిర్వహణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామిక రంగానికి గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఐఐటీ పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరడం ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున డీప్‌టెచ్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని పారిశ్రామిక స్వరూపాన్నే పూర్తిగా మార్చివేయగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా స్థానిక యువతను తీర్చిదిద్దడం జరుగుతుందని చెబుతున్నారు. గ్లోబల్ ఐఐటీ మెంటర్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలోని టెకీలు, నూతన స్టార్టప్‌లకు అంతర్జాతీయ స్థాయి మార్గదర్శకత్వం లభిస్తుందని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశాలు పెరుగుతాయంటున్నారు. రాష్ట్రంలో ‘పాన్ ఐఐటీ అమరావతి కౌన్సిల్’ ఏర్పాటు ద్వారా నూతన ఆవిష్కరణలకు ఆర్థిక సహాయం, సాంకేతిక సహకారం లభిస్తుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘స్వర్ణాంధ్ర-2047’ ఆర్థిక ప్రగతి లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సదస్సు ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికతను జోడించడం ద్వారా వ్యవసాయం, వైద్యం, పారిశ్రామిక రంగాలలో ఉత్పాదకత పెరిగి, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం బలపడుతుందని అంచనా వేస్తున్నారు.
