తెలుగు వారనే పీవీకి టీడీపీ మద్దతు ...ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా !
తెలుగు వారికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలి. ఆ పార్టీ పుట్టిందే తెలుగు వారి కోసం కదా అని ఎన్నో రాకాలైన కామెంట్స్ వస్తున్నాయి.
By: Satya P | 23 Aug 2025 7:00 AM ISTతెలుగు వారికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలి. ఆ పార్టీ పుట్టిందే తెలుగు వారి కోసం కదా అని ఎన్నో రాకాలైన కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాదు తెలుగు వారికి చాన్స్ ఇస్తే తప్పనిసరిగా సపోర్టు చేయాలి కదా అని ఒత్తిడి కూడా చేస్తున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద మీడియా ముందు తనదైన శైలిలో స్పందించారు. తెలుగు వారు అన్నది తాము గుర్తించి గౌరవించబట్టే ఆనాడు పీవీ నరసింహారావుకు మద్దతు ఇచ్చామని తమ సీటుని త్యాగం చేశామని చెప్పారు. ఆయన దేశ ప్రధాని కావడానికి తాము ఆనాడు ఎంతగానో కృషి చేశామని ఫ్లాష్ బ్యాక్ గురించి వివరించారు.
మా నుంచి ఎలా ఆశిస్తారు :
ఇదిలా ఉంటే తాము మొదటి నుంచి ఎన్డీయేలోనే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే తమ పొత్తు ఉందని కూటమి కట్టామని ఆయన చెప్పారు. ఇక కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని చెప్పారు. తమ కూటమి నిలబెట్టిన అభ్యర్ధికి తాము మద్దతు ఇవ్వకుండా ఎలా ఉండగలమని ఆయన ప్రశ్నించారు. అసలు మా నుంచి ఇండియా కూటమి మద్దతు ఎలా ఆశిస్తుందని కూడా ప్రశ్నించారు. తాము ఎన్డీయే వైపే కట్టుబడి ఉంటామని అదే విధానం అని అన్నారు.
ఇండియా కూటమికి సూటి ప్రశ్నలు :
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ బలం ఎంత ఉన్నదో ఇండియా కూటమికి తెలుసు అని చంద్రబాబు అన్నారు. తన సంఖ్యా బలం తెలిసి ఓడిపోతామని తెలిసి కూడా పోటీగా అభ్యర్ధిని ఎందుకు నిలబెట్టారో ఇండియా కూటమి వారే బదులు ఇవ్వాలని ఆయన అన్నారు. పైగా తెలుగు వారిని అభ్యర్ధిగా పెట్టామని మద్దతు ఇవ్వమని అంటున్నారని, గెలిచే సందర్భాలలో ఎందుకు నిలబెట్టలేదని ఆయన నిలదీశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది అని ఆయన మండిపడ్డారు.
ఆయన గొప్పవారు :
ఇదిలా ఉంటే ఎన్డీయే కూటమి నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్ధి సీపీ రాధా క్రిష్ణన్ దేశం గౌరవించదగ్గ వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. ఆయన దేశానికి అదే విధంగా ఉప రాష్ట్రపతి పదవికి సైతం వన్నె తెస్తారని చంద్రబాబు ఆకాంక్షించారు. తమ పార్టీ విషయంలో ఎలాంటి వేరే ఆలోచన లేదని తాము పూర్తిగా స్పష్టంగా ఉన్నామని చెప్పారు. దాంతో చంద్రబాబు కానీ టీడీపీ కానీ తెలుగు వారి సెంటిమెంట్ అన్న దానికి తమదైన వివరణ ఇచ్చిందని అంటున్నారు. అదే సమయంలో తాము మొదటి నుంచి ఎండీయే కూటమి అని బాబు గట్టిగా చెప్పారు తమ నుంచి ఎలా ఆశిస్తారు అని ఆయన ప్రశ్నించడం ద్వారా ఎన్డీయే కూటమికి మరింత బలంగా మద్దతు ఇచ్చినట్లు అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలుగు కార్డుకి బాబు ఈ విధంగా జవాబు ఇచ్చారని అంటున్నారు.
