ఆర్టీసీ ఉచితం: మళ్లీ మామూలే.. బాబు సీరియస్
దీని వల్ల ఎవరికి ప్రయోజనమని కూడా ప్రత్యర్థులు సహా .. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
By: Garuda Media | 18 Aug 2025 11:00 PM ISTరాష్ట్రంలో కూటమి సర్కారు అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో అత్యంత కీలకమైన పథకం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. దీనికి ఏటా రూ.2000 కోట్ల వరకు ఖర్చు చేయాలన ఇప్రభుత్వం నిర్ణయించింది. గత శుక్రవారం సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని స్వయంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఈ పథకాన్ని వినియోగించుకునే మహిళలు కూడా పెరిగారు. అయితే.. దీనిపై సహజంగానే ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఉచితం అంటూ.. మాయ చేశారని.. కేవలం 5 రకాల బస్సులను మాత్రమే కేటాయించారని, విశాఖ నుంచి తిరుపతి వెళ్లాలనుకునే మహిళలు.. నాలుగు నుంచి ఆరు బస్సులు మారే పరిస్థితి తీసుకువచ్చారని.. దీని వల్ల ఎవరికి ప్రయోజనమని కూడా ప్రత్యర్థులు సహా .. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. దీనిని గమనించిన.. టీడీపీ అధినేత చంద్రబాబు దీనికి విరుగుడుగా.. చెక్ పెట్టాలన్నది ఆయన ఆలోచన. కానీ, యథా తథంగా టీడీపీ నాయకులు ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు.
గతంలో పింఛను పెంచి రూ.4000 చొప్పున ఇచ్చినప్పుడు.. తర్వాత.. తల్లికి వందనం పథకాన్ని అమలు చేసినప్పుడు.. ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం కింద.. రూ.5000 చొప్పు(కేంద్రంతో కలిపి 7 వేలు)న ఇచ్చినప్పుడు కూడా.. నాయకులు ముందుకు రాలేదు. ప్రజల మధ్యకువెళ్లలేదు. ఒకవైపు చంద్రబాబు ఆయా పథకాలపై ప్రచారం చేయాలని.. ప్రజల మధ్యకు వెళ్లాలని నాయకులకు పదే పదే చెబుతున్నారు. అయినా.. వారు కదలడం లేదు. దీంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. అవుతున్నారు. అయినా.. మార్పు కనిపిస్తే ఒట్టు.
ఏం చేస్తున్నారంటే..
ఇక, నాయకులను నమ్ముకుంటే కష్టమని భావించిన చంద్రబాబు.. తనే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు 1 నుంచి నెల నెలా 4 రోజుల పాటు..(ప్రతి వారంలో ఒక రోజు) ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6పైనే టార్గెట్ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. తాను వస్తున్నానని.. అప్పుడైనా మీరు కదులుతారని అన్నారు. మరి ఎంత వరకు.. నాయకులు కదులుతారో చూడాలి.
