ఏపీని మొత్తం చూపించారు...ఇక సింగపూర్ దే చాన్స్ !
ముఖ్యమంత్రి చంద్రబాబు అతి పెద్ద పని పెట్టుకునే సింగపూర్ వెళ్ళారు. ఏకంగా ఆరు రోజుల బిజీ షెడ్యూల్ గా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు
By: Satya P | 30 July 2025 1:12 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబు అతి పెద్ద పని పెట్టుకునే సింగపూర్ వెళ్ళారు. ఏకంగా ఆరు రోజుల బిజీ షెడ్యూల్ గా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. సింగపూర్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి క్షణం తీరిక లేకుండా బాబు మీటింగుల మీద మీటింగులలో పాల్గొంటున్నారు ఇక పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ పవర్ ఫుల్ స్పీచ్ తో ఏపీని మొత్తం సింగపూర్ పారిశ్రామికవేత్తలకు వాణిజ్య నిపుణులకు చూపించారు.
అద్దంలో పెట్టి మరీ :
ఏపీని అద్దంలో పెట్టి వారి ముందుంచారు. ఏపీలో ఎన్ని వనరులు ఉన్నాయో అన్నీ సవివరంగా చెప్పారు. కళ్ళకు కట్టినట్లుగా తెలియచేశారు. ఏపీలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని, అలాగే ప్రభుత్వం అద్భుతమైన పారిశ్రామిక పాలసీని రూపొందించిందని బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు పెట్టుబడులకు అందిస్తున్న ఆహ్వానాలు అన్నీ కూడా వారికి స్పష్టంగా చెప్పారు.
ఉమ్మడి పదమూడు జిల్లాలతో :
ఏపీలో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. అందుకే ప్రతీ జిల్లా గురించి బాబు చక్కగా విశ్లేషిస్తూ మరీ పెట్టుబడిదారులను ఆకట్టుకున్నారు. విశాఖలో డేటా సెంటర్ పార్కులు పెట్టాలని ఆయన ఐటీ రంగం పారిశ్రామికవేత్తలను కోరారు ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ ని విశాఖ పెడుతోందని పేరొందిన ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయని కూడా బాబు వారికి వివరించారు.
అతి పెద్ద సముద్ర తీరంతోనే :
ఏపీలో దాదాపుగా వేయి కిలోమీటర్ల కిలోమీటర్ల పొడవున తొమ్మిది ఉమ్మడి జిల్లలా పరిధిలో అతి పెద్ద కోస్తా తీరం ఉందని చంద్రబాబు తెలియచేసారు. దీనిని ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకుంటోందని ఆయన చెప్పారు. షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణానికి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే అనేక పోర్టులు ఏపీలో ఉంటే మరిన్ని కొత్త పోర్టులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తుందని కూడా బాబు వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తున్నామని అన్నారు.
టూరిజం తో కొత్త పుంతలు :
ఏపీలో కోస్తా ప్రాంతంలో టూరిజం స్పాట్స్ ని గుర్తించి ఆయా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పర్యాటక పరంగా ఆంధ్రాకు తిరుగులేని ప్రకృతి వనరులు ఉన్నాయని వీటిని అందిపుచ్చుకోవాలని ప్రభుత్వం ఆహ్వానిస్తోందని ఆయన చెప్పారు. విశాఖ రాజమండ్రి విజయవాడ తిరుపతి సహా చాలా కీలక ప్రాంతాలు టూరిజం అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఆ రంగంలో ఆసక్తి ఉన్న వారు పెట్టుబడులతో ముందుకు రావాలని కోరుతున్నారు.
అమరావతిలో అడుగడుగునా :
ఇక ఏపీకి అతి పెద్ద రాజధానిగా రూపుదిద్దుకోబోతున్న అమరావతిలో ఏ పరిశ్రమ పెట్టాలన్నా ఏ పెట్టుబడితో రావాలన్నా ఘనమైన స్వాగతమే పలుకుతామని చంద్రబాబు చెబుతున్నారు. 2026 జనవరిలో అమరావతిలో ప్రారంభం కాభోతున్న క్వాంటం వాలీలో పెట్టుబడులు పెట్టేందుకు అంతా ముందుకు రావాలని కూడా ఆయన కోరారు. రాయలసీమలో హార్టీ కల్చర్ కానీ ఉత్తరాంధ్రా సహా ఎక్కడైనా పరిశ్రమలు కానీ పెట్టాలని కోరుతున్నారు.
సింగపూర్ కి గొల్డెన్ చాన్స్ :
ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పవర్ ఫుల్ పాయింట్స్ తో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ఇన్ని రోజుల పాటు ఒక దేశంలో ఉంటూ వివిధ వర్గాలతో మీటింగులు పెట్టడం కానీ గతంలో ఎక్కడా జరిగి ఉండేఅమో. సింగపూర్ మీద కోటి ఆశలు పెట్టుకుని చంద్రబాబు అక్కడికి వెళ్ళారు. ఆయన ఏపీ గురించి అంతా విడమరచి చెప్పారు. మీరు వస్తానంటే మేము ఆహ్వానిస్తామని కూడా హామీ ఇచ్చారు. మరి సింగపూర్ వంతు ఇపుడు. ఆ దేశంలోని పారిశ్రామిక వేత్తలు పెట్టుబడిదారులు ఏమి ఆలోచించుకుంటారో చూడాలి ఉంది. చంద్రబాబు సింగపూర్ టూర్ లో ఏ ఒక్క అంశాన్ని కానీ ఏ ఒక్క ప్రాంతాన్ని కానీ ఏ ఒక్క రంగాన్ని కానీ వదలలేదు అని అంటున్నారు. మరి దానికి తగిన ఫలితాలు అయితే వస్తాయా అన్నదే చూడాల్సి ఉంది అని అంటున్నారు.
