బాలయ్య పాట.. దేవాన్ష్ ఆట.. నారావారిపల్లెలో ఒకరోజు ముందే సందడి
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది.
By: Tupaki Political Desk | 13 Jan 2026 3:26 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు అందరితో కలిసి రెండు రోజుల ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెకు చేరుకున్నారు. సోమవారం రాత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు అంతా స్వగ్రామానికి చేరుకున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి, చంద్రబాబు మనవడు దేవాన్ష్ నారావారిపల్లె వచ్చారు. వీరితోపాటు చంద్రబాబు వియ్యంకుడు ఎమ్మెల్యే, నటసింహం బాలకృష్ణ సతీమణి వసుంధర, బాలయ్య చిన్నల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఆయన భార్య తేజస్విని కూడా నారావారిపల్లెకు వచ్చారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ రావడంతో నారావారిపల్లెలో సంక్రాంతి సందడి కనిపిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి చంద్రబాబు గ్రామస్థులతో కలిసి సదరాగా గడుపుతున్నారు. సుమారు రెండు గంటల పాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లల ఆటల పోటీలను చంద్రబాబు తిలకించారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ కూడా తోటిపిల్లలతో ఆడుతూ సందడి చేశాడు. ఇక దేవాన్ష్ ఆడుతుండగా, తాత బాలయ్య పాట వేసి ఉర్రూతలూగించారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు.
చిన్నారులందరితో ఫోటోలు దిగిన సీఎం చంద్రబాబు వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. దాదాపు రెండు గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం చంద్రబాబు గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమానాలు అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను అందుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఏటా సంక్రాంతి నాడు నారా, నందమూరి కుటుంబాలు నారావారాపల్లెలో సంతోషంగా గడుపుతుంటారు. ఈ పండగ సందర్భంగా గ్రామ దేవత నాగాలమ్మను ఈ ఇరు కుటుంబాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే తల్లిదండ్రుల సమాధులను సైతం చంద్రబాబు సందర్శించుకొని వారికి ఘన నివాళులు అర్పిస్తుంటారు.
రాజకీయ హడావుడికి దూరంగా, గ్రామీణ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అదే సమయంలో సొంతూరిలో గడిపేందుకు చంద్రబాబు చాలా ఆసక్తి కనిపించారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని గ్రామస్తులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తమతో ముచ్చటించేందుకు అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబుతోపాటు మంత్రి లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణితో ఫొటోలు దిగేందుకు గ్రామస్తులు పోటీపడ్డారు.
