చంద్రబాబు పిలుపు.... ఎన్డీయే పట్టించుకుంటే ?
టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు దేశ హితానికి సంబంధించి పదే పదే ప్రతిపాదనలు అనేకం చేస్తూ వస్తున్నారు. అందులో అతి ముఖ్యమైనది నదుల అనుసంధానం.
By: Satya P | 25 Aug 2026 4:00 AM ISTటీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు దేశ హితానికి సంబంధించి పదే పదే ప్రతిపాదనలు అనేకం చేస్తూ వస్తున్నారు. అందులో అతి ముఖ్యమైనది నదుల అనుసంధానం. ఈ దేశంలో జీవ నదులు మిగిలిన నదులు అన్నీ కలిపి పెద్ద సంఖ్యలో ఉన్నాయి. జీవనదులు వర్షాధార నదులు అన్నీ కలిపి సుమారు 400 లకు పైగా పెద్ద చిన్న నదులు భారతదేశం నిండా ఉన్నాయి. అందులో గంగా, బ్రహ్మపుత్ర, యమున వంటి జీవ నదులతో పాటు గోదావరి, కృష్ణ, కావేరి వంటి ద్వీప కల్ప నదులు దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రవహిస్తున్నాయి.
దేశ సంపదగా ఉన్నాయి :
ఇక దేశంలోని ప్రధాన నదులుగా గంగ బ్రహ్మపుత్ర సింధు ఉంటే వర్షాధార నదులు ద్వీపకల్ప నదులుగా గోదావరి కృష్ణ కావేరి మహానది నర్మద తపతి వంటివి ఉన్నాయి. ఈ దేశంలో నదులు అందించే నీటిని సముద్రం పాలు కాకుండా ఒడిసి పడితే వందేళ్ళ పాటు భారత్ కి నీటి కొరత అన్నది ఉండే సమస్యే లేదు అని జలవనరుల నిపుణులు అంటున్నారు. నదుల అనుసంధానం ద్వారా వరద నీటిని నిల్వ చేయవచ్చు. కరవు ప్రాంతాలకు సాగునీరు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాంతో వర్షాభావ పరిస్థితులలో సైతం కరవు కాటకాలు రాకుండా ఉంటాయి అని అంటున్నారు.
చంద్రబాబు మరోసారి :
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానం గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా ముసునూరులో గోర్మెట్ పాప్‌కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ నదుల అనుసంధానం గురించి గట్టిగా చెప్పారు. అది కనుక జరిగితే దేశమంతా నీటి లభ్యత పెద్ద ఎత్తున సాధ్యపడుతుంది అని ఆయన అంటున్నారు. దేశం అంతా నదుల అనుసంధానం జరిగి నీటి సద్వినియోగం జరగాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచనగా కూడా చంద్రబాబు చెప్పారు.
నాలుగు రాష్ట్రాల్లో :
గోదావరి కృష్ణా తుంగభద్ర పెన్నా కావేరీ నదులను అనుసంధానించటం ద్వారా నాలుగు రాష్ట్రాలలో నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పారు. అలాగే జల వివాదాలకు శాశ్వతంగా తెర పడుతుంది అని ఆయన అన్నారు. అంతే కాకుండా కష్టకాలంలో అన్ని ప్రాంతాల్లో ఆయకట్టు స్థిరీకరణ తాగునీరు అందించే అవకాశం ఉంటుంది అని బాబు చెప్పుకొచ్చారు. ఇక దేశంలోని గంగా మహానది గోదావరి నదులను కూడా అనుసంధానించుకుంటే వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడు దేశానికి తిరుగులేదు అని నీటి భద్రత సాధిస్తే దేశ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని కూడా చంద్రబాబు గట్టిగా చెప్పారు. ఏపీ పరంగా చూస్తే కూటమి ప్రభుత్వం నీటి భద్రత సాధించి ప్రతి ఎకరాకూ నీరు ఇచ్చేలా చర్యలు చేపడుతుందని ఆయన హామీ ఇచ్చారు.
వాజ్ పేయి హయాంలోనే :
నిజానికి చూస్తే వాజ్ పేయి ప్రధానిగా ఉండగానే నదుల అనుసంధానం మీద జాతీయ స్థాయిలో చర్చ సాగింది. 2002లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నదుల అనుసంధానం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను కూడా అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి హయాంలో నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే దానికి నాటి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అధ్యక్షుడిగా వ్యవహరించారు. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదుల అనుసంధానం ద్వారా నీటి కొరతను తీర్చాలని అప్పట్లోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధాన లక్ష్యం వరదలను నివారించడం గా ఉంది. అలాగే తాగునీరు సాగునీటిని అందించడం కీలక ఉద్దేశంగా ఉంది. అయితే ఇప్పటికే పాతికేళ్ళు గడుస్తున్నా మళ్లీ ఆ ప్రతిపాదనల ఊసు అయితే లేదు, ఇపుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. నదుల అనుసంధానం మీద చంద్రబాబు తరచూ మాట్లాడుతున్నారు. కేంద్రం దీని మీద సీరియస్ గా ఆలోచన చేస్తే కనుక కచ్చితంగా దేశంలో నీటి కొరత లేకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
